ETV Bharat / bharat

బిహార్​లో సుపరిపాలన, సామాజిక న్యాయం, అభివృద్ధి గెలిచాయి : ప్రధాని మోదీ

బిహార్​ ఎన్నికలపై స్పందించిన ప్రధాని మోదీ

PM Modi On Bihar Results
PM Narendra Modi (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : November 14, 2025 at 6:07 PM IST

2 Min Read
Choose ETV Bharat

PM Modi On Bihar Results : బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏ సాధించిన భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయ స్ఫూర్తికి లభించిన విజయమని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎక్స్​ వేదికగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​, ఎల్​జేపీ (రామ్ విలాస్​) అధినేత చిరాగ్ పాసవాన్​, హెచ్​ఏఎం నేత జితన్ రామ్ మాంఝీ, ఆర్​ఎల్​ఎం అధినేత ఉపేంద్ర కుశ్వాహాలకు మోదీ అభినందనలు తెలిపారు.

'2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​డీఏకు చారిత్రాత్మకమైన, అపూర్వమైన విజయాన్ని అందించిన నా బిహార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ కృతజ్ఞతలు' అని ప్రధాని మోదీ ఎక్స్​ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఈ అఖండ ప్రజాతీర్పు ప్రజలకు సేవ చేయడానికి, బిహార్ కోసం సరికొత్త సంకల్పంతో పనిచేయడానికి ఎన్​డీఏను మరింత శక్తిమంతం చేస్తుందని ఆయన అన్నారు.

ఎన్​డీఏ ట్రాక్ రికార్డ్​
'ఎన్​డీఏ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కృషి చేసింది. మా ట్రాక్ రికార్డును, రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మా దృష్టిని చూసిన ప్రజలు, మాకు భారీ మెజారిటీ ఇచ్చారు' అని ప్రధాని మోదీ అన్నారు. 'ప్రతి ఎన్​డీఏ కార్యకర్తకు నా ధన్యవాదాలు. వారు అవిశ్రాంతంగా శ్రమించి, అధికార కూటమి అభివృద్ధి జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను' అని మోదీ పేర్కొన్నారు. "రానున్న రోజుల్లో మేము బిహార్ అభివృద్ధి కోసం మరింత చురుకుగా పనిచేస్తాం. ఇక్కడి మౌలిక సదుపాయాలకు, రాష్ట్ర సంస్కృతికి కొత్త గుర్తింపును ఇస్తాం. ఇక్కడి యువతకు, మహిళలకు సుసంపన్న జీవితానికి తగిన అవకాశాలు లభించేలా చేస్తాం" అని మోదీ తెలిపారు.

జంగిల్ రాజ్​కు కాలం చెల్లింది!
మరోవైపు బిహార్​లో ఎన్​డీఏ విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా శుక్రవారం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్​కు శుభాకాంక్షలు తెలిపారు. బిహారీలు వేసిన 'ప్రతి ఓటు నమ్మకానికి ప్రతీక' అని ఆయన వ్యాఖ్యానించారు. "అభివృద్ధి చెందిన బిహార్​ను విశ్వసించే ప్రతి బిహారీకి ఈ విజయం దక్కింది. ఆటవిక పాలన, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారికి ఇక రాష్ట్రాన్ని దోచుకునే అవకాశం ఉండదు. ప్రజలు ఇప్పుడు పనితీరు ఆధారంగా మాత్రమే తీర్పు ఇస్తున్నారు. ప్రధాని మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​, ఎన్​డీఏ నేతలు, కార్యకర్తలు అందరికీ నా అభినందనలు. బూత్​ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవిశ్రాంతంగా పనిచేసిన బిహార్ కార్యకర్తలు అందరికీ నా వందనాలు" అని ఎక్స్​ వేదికగా పేర్కొన్నారు.

'బిహార్​ తీర్పు మా ప్రభుత్వంపై ఓటర్లకు ఉన్న నమ్మకాన్ని, ముఖ్యంగా మహిళల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. మోదీ నాయకత్వంలో ఎన్​డీఏ చూపించిన ఆశావాదం, నమ్మకంలో నేను బిహార్ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు హామీ ఇస్తున్నాను. ఎన్​డీఏ సర్కార్ ఇకపై బిహార్ అభివృద్ధికి మరింత అంకిత భావంతో పనిచేస్తుంది' అని అమిత్​ షా పేర్కొన్నారు.

అఖండ విజయం
బీజేపీ, జేడీయూ, ఎల్​జేపీ (ఆర్​వీ), హెచ్​ఏఎం, ఆర్​ఎల్​ఎంతో కూడిన ఎన్​డీఏ కూటమి బిహార్​లో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 204 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. మరోవైపు ఆర్​జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన మహాగఠ్​బంధన్​ కేవలం 33 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. 2020 ఎన్నికల్లో ఆ కూటమి గెలుచుకున్న స్థానాల కంటే ఈసారి 81 స్థానాలు తక్కవ కావడం గమనార్హం.