వెరైటీ హోలీ : సహజ రంగులతో డ్రెస్‌లు- ఫ్యాషన్ డిజైనర్ బ్రదర్స్ క్రియేటివిటీ- పండుగ వేళ ఆ ఊళ్లలో మృత్యు గీతాలు
'రసాయనరహితంగా సహజ రంగులతో డ్రెస్‌లు- ఫ్యాషన్ డిజైనర్ బ్రదర్స్ క్రియేటివిటీ- హోలీ వేళ వీటిని ధరిస్తే ఎన్నో ప్రయోజనాలు!'

Published : March 4, 2026 at 6:23 PM IST
Variety Holi 2026 : రంగుల పండుగ హోలీ వేడుకలను పలుచోట్ల వెరైటీగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా ఇద్దరు ఫ్యాషన్ డిజైనర్ సోదరులు క్రియేటివ్‌గా ఆలోచించారు. పూర్తిగా సహజ రంగులతో పర్యావరణ హితమైన కాటన్ దుస్తులను రూపొందించారు. ఇక ఆనందాల పండుగ హోలీ వేళ పలు గ్రామాల ప్రజలు మరణాన్ని గుర్తు చేసుకొని మృత్యు గీతాలను ఆలపించి ఆడారు, పాడారు. విభిన్నంగా జరిగిన ఈ వేడుకల విశేషాలతో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనమిది.
ఫ్యాషన్ డిజైనింగ్‌పై సోదరులకు ఆసక్తి
ఒడిశాలోని కటక్ జిల్లా జగత్‌పూర్ పట్టణానికి చెందిన వ్యాపారి అసిత్ కుమార్ నాయక్, జ్యోత్స్నారాణి నాయక్ దంపతులకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు అన్షుమన్(25), అంకిత్(20). అన్షుమన్‌కు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భౌగోళిక శాస్త్రంలో పీజీ చేశారు. అంకిత్ 2022లో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తానని తల్లిదండ్రులకు చెప్పారు.
కానీ అందుకు పేరెంట్స్ నో చెప్పారు. కానీ తమ్ముడు అంకిత్‌కు అన్నయ్య అన్షుమన్ అండగా నిలిచారు. అంకిత్‌ను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ చేయమని తల్లిదండ్రులను ఒప్పించారు. ఈ క్రమంలో అన్షుమన్‌కు కూడా ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. దాని గురించి తెలుసుకోవడానికి తమ్ముడితో కలిసి ఫ్యాషన్ షోలకు హాజరుకావడం మొదలుపెట్టారు. అన్షుమన్ సొంతంగా రీసెర్చ్ చేస్తూ ఫ్యాషన్ డిజైనింగ్‌ను నేర్చుకున్నారు.

ఇంటర్నేషనల్ పోటీల్లో మూడోస్థానం
అంకిత్ మొదట ఒడిశాలోని ఖోర్ధా జిల్లాలో ఉన్న ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో రెండు డిజైనర్ దుస్తుల ప్రదర్శనలను నిర్వహించారు. అనంతరం కటక్‌లోని బైసాఖి మేళాలోనూ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఇద్దరు సోదరులు ఇండోనేషియాలో జరిగిన మిస్టర్ ఇంటర్నేషనల్ పోటీల్లోనూ పాల్గొన్నారు. ఇందులో 148 దేశాల ఫ్యాషన్ డిజైనర్లు పాల్గొన్నారు. సూర్య దేవుడి థీమ్‌తో అన్షుమన్, అంకిత్ సోదరులు రూపొందించిన దుస్తులు ఈ పోటీల్లో మూడో స్థానంలో నిలిచాయి.
అనంతరం అన్షుమన్, అంకిత్ కలిసి తల్లి పేరు మీద జ్యోత్స్న ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించారు. దీని వ్యవస్థాపకుడిగా అన్షుమన్, అసిస్టెంట్ డిజైనర్‌గా అంకిత్ అభిషేక్ నాయక్ వ్యవహరిస్తున్నారు. ఈ అన్నదమ్ములు కేవలం ఒకటిన్నర సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 20 షోలలో తమ డిజైనర్ దుస్తులను ప్రదర్శించడం విశేషం. వీటిని ధరించి పలువురు నటీమణులు, మోడల్స్ ర్యాంప్‌పై నడిచారు.
సహజ రంగులతో డ్రెస్ - తయారీ ఇలా
'మేం ఇప్పటిదాకా విభిన్నమైన థీమ్‌లతో దుస్తులను డిజైన్ చేశాం. ఈసారి హోలీకి ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. సహజ రంగులతో ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. రసాయనాలు, రంగులు వేసినప్పుడు కొంతమందికి చర్మ సమస్యలు వస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని కాటన్ వస్త్రానికి సహజ రంగులను అద్ది డిజైనర్ దుస్తులను తయారు చేశాం'
'అపరాజిత (శంఖం) పువ్వుల నుంచి నీలం రంగు, పచ్చి పసుపు నుంచి పసుపు రంగు, దుంపల నుంచి ఎరుపు రంగు, కుంకుమ రంగు కోసం నారింజ, క్యారెట్‌లను ఉపయోగించాం. రంగుల తయారీ కోసం నిమ్మ ఆకులు, అరటి తొక్కలను కూడా ఉపయోగించాం. ఇవి శరీరానికి అస్సలు హాని కలిగించవు. మేం తయారుచేసిన ఈ డిజైనర్ దుస్తులు చూడటానికి ఆకర్షణీయంగానూ ఉంటాయి. హోలీ వేళ వీటిని ధరిస్తే చర్మంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు' అని సోదరులు అంకిత్, అన్షుమన్ వివరించారు.

హోలీ వేడుకల్లో మృత్యు గీతాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ అనేది విశిష్ట, విభిన్న సంప్రదాయాలకు నెలవు. ఇక్కడి గ్రామీణ ప్రజలు పాడే ప్రాచీన జానపద గేయాలను ఫాగ్ అంటారు. వీటిని ఏటా హోలీ వేడుకల్లో, వసంత రుతువు సీజన్‌లో పాడుతుంటారు. ఇక్కడి సంస్కృతిలో, జన జీవితాల్లో ఫాగ్‌లు బలమైన అంతర్భాగం. బుందేల్‌ఖండ్‌లో దాదాపు 14 రకాల ఫాగ్‌లను పాడుతుంటారు. ఎవరైనా మరణించినప్పుడు, చనిపోయిన వారి సంవత్సరీకం కార్యక్రమాల్లో ఆలపించే ఫాగ్‌లను అనరయే అని పిలుస్తారు. ఈసారి హోలీ వేడుకల సందర్భంగా పలు గ్రామాల్లో ఈ అనరయే గేయాలను ప్రజలు లయబద్ధంగా ఆలపించారు. పిల్లలు, పెద్దలంతా డ్రమ్స్ వాయిస్తూ, హార్మోనియం మోగిస్తూ ఈ గేయాలను పాడారు. చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకున్నారు.
అనరయే గేయాలలో ఏముంది ?
అనరయే గేయాలను మృత్యు గీతాలు అని కూడా చెబుతుంటారు. ఎందుకంటే వీటిలో మరణం గురించి ఎక్కువగా హైలైట్ చేస్తారు. మనిషికి మరణం తప్పదని, శరీరం నశించక తప్పదనే సందేశాన్ని ఇచ్చే పల్లవులు, చరణాలు ఈ గేయాల్లో ఉంటాయి. ఎవరు మరణించినా నలుగురు వ్యక్తులు మోసుకెళ్లి, అతడి శరీరాన్ని హోలీలాగా దహనం చేసి ఇంటికి తిరిగొస్తారనే సమాచారం వీటిలో ఉంటుంది.
దైవ స్మరణ తర్వాతే ఫాగ్ ఆలాపన
'బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఫాగ్‌లను ఆలపించడానికి ముందు, తప్పకుండా దైవ స్మరణ చేస్తారు. శారదా మాత, శ్రీరాముడు, గణేశుడు, హనుమాన్ జీలలో ఎవరో ఒక ఇష్టదైవాన్ని తొలుత ప్రార్ధిస్తారు. అనంతరం సఖౌ ఫాగ్/సభీ ఫాగ్ మొదలవుతుంది. ఇందులో ఒక స్త్రీ లేదా పురుషుడు గేయాన్ని ఆలపిస్తారు. అతడు/ఆమె పాడిందే అక్కడున్న వాళ్లంతా కలిసి పాడుతారు. ఇక నాలుగు చరణాలు కలిగిన చందౌ ఫాగ్ కూడా చాలా ఫేమస్. ఝగడ్ కీ ఫాగ్‌లలో రామాయణ, మహాభారతాల్లోని యుద్ధ ఘట్టాల ప్రస్తావన ఉంటుంది. ఇలాంటి 14 రకాల ఫాగ్‌లు బుందేల్‌ఖండ్‌లో ఫేమస్' అని బుందేలీ కళా సంస్కృతిపై పరిశోధన చేసిన డాక్టర్ ఓంప్రకాశ్ చౌబే తెలిపారు.
హోలీ మిలన్‌లో 31 దేశాల రాయబారులు, హైకమిషనర్లు
దిల్లీ శాసనసభలో మంగళవారం జరిగిన హోలీ మిలన్ వేడుకల్లో 31 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమం భారతీయ సాంస్కృతిక సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది. ఈ వేడుకల్లో విదేశీ అతిథులు హోలీ పండుగ ఆనందాన్ని ఆస్వాదించారు. దాదాపు 90 నిమిషాల పాటు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వారిని ఆకట్టుకున్నాయి. కథక్ నృత్యం, తోలుబొమ్మల ప్రదర్శనలు, మధ్యప్రదేశ్‌కు చెందిన మల్లఖాంబ్ సాహసోపేత ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
కేంద్ర శాసన మండలి మొదటి భారతీయ ఛైర్మన్ విఠల్‌భాయ్ పటేల్‌పై ఈసందర్భంగా ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ వేడుకలకు హాజరైన వారిలో శ్రీలంక హైకమిషనర్ ప్రదీపా మహిషిని కోలోన్, చైనా రాయబారి జు ఫీహాంగ్, నేపాల్ రాయబారి శంకర్ ప్రసాద్ శర్మ, దక్షిణాఫ్రికా హైకమిషనర్ అనిల్ సూక్లాల్, రష్యా, చిలీ, వెనిజులా, వియత్నాం దేశాల ప్రతినిధులు, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, దిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మోహన్ సింగ్ బిష్ట్, దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఉన్నారు.

