ETV Bharat / bharat

ఉత్తరాఖండ్‌లో పాక్ కుట్రలు- సోషల్ మీడియా ద్వారా ఉగ్ర నెట్‌వర్క్ ఏర్పాటుకు యత్నాలు!

రెండు నెలల్లో ఐదుగురు అనుమానితుల అరెస్టు- పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు- సోషల్ మీడియా ద్వారా యువతను ప్రభావితం చేసే ప్రయత్నాలు- నిఘా పెంచిన ఉత్తరాఖండ్- ఎస్‌టీఎఫ్, సైబర్ కమాండోల మోహరింపు

Uttarakhand STF Deploys Cyber Commandos
Uttarakhand STF Deploys Cyber Commandos (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 3, 2026 at 11:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

Uttarakhand STF Deploys Cyber Commandos : ఉత్తరాఖండ్‌లో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు, పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. గత రెండు నెలల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన వేర్వేరు ఆపరేషన్లలో ఐదుగురు అనుమానితులను అరెస్టు చేయగా, వారిలో పలువురికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.

సోషల్ మీడియా ద్వారా యువతను ప్రభావితం
ఉత్తరాఖండ్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ ఏజెంట్లు సోషల్ మీడియా ద్వారా యువతను ప్రభావితం చేసి రాష్ట్రంలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు సైబర్ కమాండోలను రంగంలోకి దించింది.

ఈ క్రమంలో ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎస్‌టీఎఫ్ సహారన్‌పుర్ జిల్లాలో నలుగురు అనుమానితులను అరెస్టు చేసింది. వీరు పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ల కోసం భారత్‌లో స్లీపర్ సెల్‌లుగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. అరెస్టైన వారిలో ఒకరు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

పాకిస్థాన్‌లోని వ్యక్తుల సూచనల మేరకు కార్యకలాపాలు
ఇదిలా ఉండగా, హరిద్వార్ జిల్లా రూర్కీలో నివసిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలి ఇంటిపై జమ్ముకశ్మీర్ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే, విచారణలో ఆమెకు కూడా పాకిస్థాన్‌లో ఉన్న కొందరితో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. పాకిస్థాన్‌లోని వ్యక్తుల సూచనల మేరకు కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు, వివిధ మార్గాల ద్వారా నిధులను బదిలీ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో మహిళను అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం జమ్ముకశ్మీర్‌కు తరలించారు.

అయితే, ఈ ఘటనల అనంతరం ఉత్తరాఖండ్ పోలీసులు, ఎస్‌టీఎఫ్ అప్రమత్తమయ్యాయి. తమదైన స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశాయి. అనుమానితులు పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలు, విదేశీ హ్యాండ్లర్లతో సంప్రదింపులు కొనసాగించినట్లు గుర్తించాయి. అరెస్టైన వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్, వీడియో కాల్స్, ఇతర సోషల్ మీడియా అప్లికేషన్ల ద్వారా సరిహద్దు అవతల ఉన్న వ్యక్తులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించారని తెలిసింది.

గోడలపై "తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌" పేరు
మరోవైపు, దెహ్రదూన్​లో అరెస్టైన విక్రాంత్ అనే అనుమానితుడు నగరంలోని గోడలపై "తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌" పేరును రాస్తూ ప్రచారం నిర్వహించినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది. అతనితో సంబంధాలు కొనసాగించిన మిగతా వ్యక్తులు ఎవరన్న విషయంపై అధికారులు విచారిస్తున్నారు. అలాగే, ఈ నెట్‌వర్క్ ఎంత మేర విస్తరించి ఉందనే అంశంపై లోతుగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో భద్రతా సంస్థలు ప్రస్తుతం సోషల్ మీడియా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాయి. ఉత్తరాఖండ్‌లోని మరికొందరు యువకుల కదలికలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను సైతం పరిశీలిస్తున్నారు.

మరోవైపు, ఈ విషయంపై ఉత్తరాఖండ్ ఎస్‌టీఎఫ్ ఎస్‌ఎస్‌పీ అజయ్ సింగ్ మాట్లాడారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయన్నారు. యువతను తప్పుదోవ పట్టించి వివిధ రకాల తీవ్రవాద భావజాలాల వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దర్యాప్తులో ఐఎస్ఐకు సంబంధించిన ఓ మాడ్యూల్ బయటపడిందని, సోషల్ మీడియా ద్వారా యువతను కలుపుకునే ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇక, కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా అనుమానాస్పదంగా జరిగినట్లు విచారణలో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు. విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్లు సులభంగా పర్యవేక్షించగల ప్రదేశాల్లో కెమెరాలు ఏర్పాటు చేయించినట్లు సమాచారం. అలాగే సోషల్ మీడియా ద్వారా సరిహద్దులు దాటి జరిగే కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నిఘాను మరింత బలోపేతం చేసినట్లు ఎస్‌టీఎఫ్ వెల్లడించింది.

బంగాల్​లో దీదీకి భారీ షాక్ - ప్రతిపక్ష నేతగా టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ

విమానయాన రంగానికి ప్యాకేజీ- రహదారులకు భారీగా నిధులు- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు