ఖమేనీ మరణంతో విషాదంలో యూపీ, కర్ణాటకలోని ఊర్లు- ఆ గ్రామాలతో సుప్రీం లీడర్‌కు కనెక్షన్ ఏంటి?
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం- ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న దేశంలోని కొన్ని గ్రామాల ప్రజలు

Published : March 1, 2026 at 5:24 PM IST
Ayatollah Ali Khamenei India Link : ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ క్రమంలో ఖమేనీతో సంబంధం ఉన్న భారత్‌లో ఉన్న కొన్ని గ్రామాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఖమేనీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకీ జిల్లాలోని బడోసరై ప్రాంతంలోని కింతూర్‌తో అయతుల్లా అలీ ఖమేనీ గురువు అయతుల్లా రుహోల్లా ముసావి ఖమేనీకి సంబంధాలు ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయతుల్లా రుహోల్లా ముసావి ఖమేనీ పూర్వీకులు సుమారు 150 ఏళ్ల క్రితం కింతూర్ నుంచి ఇరాన్‌కు వలస వెళ్లారని అన్నారు.
'రుహోల్లా తాత ఊరు కింతూరే'
ఇదే విషయంపై ఖమేనీ కుటుంబం నుంచి వచ్చిన వారసుడిగా చెప్పుకునే సయ్యద్ నిహాల్ అహ్మద్ కజ్మీ స్పందించారు. కింతూర్‌ను అయతుల్లా రుహోల్లా ఖమేనీ తాత సయ్యద్ అహ్మద్ ముసావి జన్మస్థలంగా పరిగణిస్తారని అన్నారు. ముసావి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 1834లో మతపరమైన ప్రయాణంలో ఇరాన్‌కు వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఆ తర్వాత ముసావి ఇరాన్‌లోని ఖమేనీ నగరంలో స్థిరపడ్డారని, అక్కడే అతడి మనవడు రుహోల్లా ఖమేనీ జన్మించారని వెల్లడించారు.
"1989లో అయతుల్లా రుహోల్లా ముసావి ఖమేనీ మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని అయతుల్లా అలీ ఖమేనీ మందుకు తీసుకెళ్లారు. అయతుల్లా అలీ ఖమేనీ మరణం బాధాకరం. ఆయనపై చేసిన దాడి మానవత్వంపై జరిగిన దాడి. అయతుల్లా రుహోల్లా ముసావి ఖమేనీ శిష్యుడు మరణం ఇరాన్‌కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు తీరని లోటు" అని సయ్యద్ కజ్మీ పేర్కొన్నారు.
'హింస ఏ సమస్యకు పరిష్కారం కాదు'
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణవార్త తెలిసి కింతూర్ గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఖమేనీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. సంతాప సమావేశాలు నిర్వహించారు. ఖమేనీని మానవాళికి మార్గదర్శకుడిగా చాలా మంది భావిస్తారని గ్రామస్థుడు ఒకరు తెలిపారు. హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదని పేర్కొన్నాడు. అందరూ శాంతిగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.
కర్ణాటకలోని గ్రామంలో ఖమేనీ పర్యటన
అలాగే కర్ణాటక చిక్కబల్లాపూర్ జిల్లాలోని అలిపురాలో ఖమేనీ మరణంతో విషాద వాతావరణం నెలకొంది. ఆ గ్రామస్థులు ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని షియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే గ్రామంలో మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించి దుకాణాలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసేశారు. అన్ని రకాల వేడుకలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు.
అలిపురా జనాభా దాదాపు 30,000 కాగా, వీరిలో ఎక్కువ మంది షియా ముస్లింలే. 1986లో ఖమేనీ భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు అలిపురాను ఖమేనీ సందర్శించారు. అలా ఇరాన్‌తో అలిపురాకు బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఖమేనీ గౌరవార్థం ఆయన పేరిట ఓ ఆస్పత్రిని నిర్మించారు. కాగా, అలిపురాలోని అనేక కుటుంబాలు ఇరాన్‌తో ప్రత్యక్ష సంబంధాలను కొనసాగిస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. కొంతమంది గ్రామస్థులు ఉన్నత విద్య, ఉపాధి కోసం ఇరాన్‌లోనే స్థిరపడ్డారని పేర్కొన్నారు.
పంజాబ్‌లో నిరసనలు
అలాగే అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని లూధియానాలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి షాహి ఇమామ్ మౌలానా మొహమ్మద్ ఉస్మాన్ రెహ్మానీ నాయకత్వం వహించారు. సుప్రీం లీడర్‌కు మృతికి సంఘీభావంగా వారం రోజుల సంతాప దినాలు పాటించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిరసనకారులు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండించాలని భారత్‌లోని ఇరాన్ ఎంబసీ కోరింది. తమ నేత ఖమేనీ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
భారత్‌లోకి పాకిస్థాన్ డ్రోన్లు- తిప్పికొట్టిన ఆర్మీ- LoC వద్ద హైఅలర్ట్
ఇరాన్‌పై దాడులు- పశ్చిమాసియా గగనతలం మూసివేత- అన్ని విమాన సర్వీసులు రద్దు

