40ఏళ్లుగా గోవుల సంరక్షణకు కృషి- గోమాతల ఫొటోలున్న 476 కరెన్సీ నోట్లు, నాణేలు సేకరణ
గోమాతల చిత్రాలు ఉన్న కరెన్సీ సేకరిస్తున్న ఛత్తీస్‌గఢ్ వాసి- ఎందుకో తెలుసా?


Published : October 30, 2025 at 8:55 PM IST
Gau Mata Photo Currency Collection : హిందూ మతంలో గోవులకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే భారత్‌లో గోమాతలను సైతం దైవంగా పూజిస్తారు. అయితే ఇండియాలో కరెన్సీ నోట్లు, నాణేలపై గోమాత ఫొటోలు ఉండడం చాలా అరుదు. కానీ విదేశాల్లో మాత్రం గోమాత చిహ్నం ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటాయి. అలాంటి కరెన్సీ నోట్లు, నాణేలను ప్రత్యేకంగా సేకరిస్తున్నారు ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన తేజ్ కరణ్ జైన్ అనే వ్యక్తి. ఈ క్రమంలో ఆయన ఎందుకు గోవుల చిత్రాలు ఉన్న కరెన్సీని సేకరిస్తున్నారు? దీని వెనుకున్న కారణాలేంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
అరుదైన కరెన్సీ నాణేలు, నోట్లు సేకరణ
రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన తేజ్ కరణ్ జైన్‌కు గోమాతల చిత్రాలు ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలను సేకరించడం అంటే ఇష్టం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆవు ఫొటో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలను సేకరించి భద్రపరుస్తున్నారు. తేజ్ కరణ్ ఇప్పటివరకు గోమాతల చిత్రాలు ఉన్న 146 దేశాలకు చెందిన 476 కరెన్సీ నోట్లు, నాణేలను సేకరించారు. కొన్ని దేశాలు తమ కరెన్సీ నోట్లపై ఆవు ముఖాన్ని వాటర్ మార్క్‌గా వేశాయి.

'అమెరికా, ఇటలీ వంటి దేశాల కరెన్సీపై గోమాతల ఫొటోలు'
అమెరికా, ఇటలీతో సహా అనేక దేశాల కరెన్సీలపై గోమాతల చిహ్నాలను వేస్తున్నాయని తేజ్ కరణ్ తెలిపారు. సోమాలియా, జాంబియా, బ్రెజిల్, హాంకాంగ్, ఉగాండా, ఇటలీ, నేపాల్, ఐర్లాండ్, మడగాస్కర్ కరెన్సీలపై కూడా గోవుల ఫొటోలు ఉన్నాయన్నారు. క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దం నుంచి నేటి వరకు ఉన్న కరెన్సీల్లో ఏదో ఒక రూపంలో గోమాతలు కనిపిస్తాయని చెప్పారు. ఈ నాణేలను అల్యూమినియం, వెండితో తయారుచేశారని గుర్తు చేసుకున్నారు. అలాగే గోల్ట్ కాయిన్స్ కూడా ఉన్నాయన్నారు. వివిధ దేశాలు తమ కరెన్సీలో వివిధ రూపాల్లో గోమాతల చిహ్నలు చేర్చాయని వెల్లడించారు. ఇంకా, కొన్ని దేశాలు ఆవుల ఫొటోలతో పోస్టల్ స్టాంప్స్‌ను కూడా విడుదల చేశాయని తేజ్ కరణ్ జైన్ వివరించారు.

40 ఏళ్లుగా గోవుల సంరక్షణ కోసం ప్రచారం
గోవుల సంరక్షించాలనే ప్రచారం కోసం 1985 నుంచి ఇలాంటి కరెన్సీని సేకరిస్తున్నారు తేజ్ కరణ్ జైన్. దాదాపు 40 ఏళ్లుగా గోమాతల చిత్రాల ఉన్న నాణేలు, నోట్లను సేకరించి భద్రపరుస్తున్నారు. దీంతో ఆయనకు గోసంరక్షుడిగా మంచి పేరుంది. అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కూడా దక్కింది. 2015లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తేజ్ కరణ్‌కు 'ఏతి యాతన్ లాల్' అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గౌరవం, అహింస, గోవుల పరిరక్షణకు కృషి చేసిన వారికి ఇస్తారు. అలాగే గోరక్షణకు తేజ్ కరణ్ జైన్ చేసిన కృషికి ఆయనకు డజన్ల కొద్దీ అవార్డుల వరించాయి.

నాణేలు, నోట్లు ప్రదర్శన
అయితే తేజ్ కరణ్ జైన్ తాను సేకరించిన అరుదైన నాణేలు, నోట్లను పలు ప్రదేశాల్లో ప్రదర్శిస్తారు. తాజాగా కోర్బాలోని కాన్ బేరి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇప్పటి వరకు దేశంలోని పది రాష్ట్రాల్లో 49 ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనల తాలుక ప్రధాన ఉద్దేశం, లక్ష్యం గోమాతలను సంరక్షించడానికి ప్రజలను ప్రేరేపించడమేనని తేజ్ కరణ్ చెబుతున్నారు.

మోదీకి కీలక విజ్ఞప్తి
భారతదేశంలో చివరిసారిగా గోమాత చిత్రం ఉన్న నాణేన్ని 1957లో విడుదల చేశారని తేజ్ కరణ్ జైన్ అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో ఆవుల ఫొటోలు ఉన్న కరెన్సీని ముద్రించలేదని పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కరెన్సీపై గోమాతల ఫొటోలను చేర్చాలని తేజ్ కరణ్ అభ్యర్థిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భారత సంస్కృతి, నాగరికత, సంప్రదాయాలను కాపాడుకోవచ్చని కోరుతున్నారు. అలాగే పాల ఉత్పత్తి, ఎడ్ల బండ్లు వంటివాటిని కూడా కరెన్సీపై చిత్రీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కరెన్సీ ప్రాముఖ్యం ఏమిటి?
మానవ నాగరిక చరిత్రలో కరెన్సీకి కీలక ప్రాధాన్యం ఉంది. కరెన్సీ ఆర్థిక జీవితాన్ని, మార్పిడి ప్రక్రియను తెలియజేస్తుంది. వస్తువులు, సేవలను పొందడానికి కరెన్సీని ఉపయోగిస్తారు. కరెన్సీని ఆర్థికాభివృద్ధికి కొలమానంగా కూడా పరిగణిస్తారు. ఆర్థిక ప్రక్రియలు పూర్తిగా దానిపై ఆధారపడి ఉంటాయి.

