ఆదివారమే కేంద్ర బడ్జెట్- జనవరి 28 నుంచే పార్లమెంట్ సమావేశాలు!
రెండువిడతల్లో జరగనున్న సమావేశాలు- జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత- మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత

Published : January 7, 2026 at 8:12 PM IST
Parliament Budget Session 2026 : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సారథ్యంలోని పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరగనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండోవిడత సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన ఆదివారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలికాలంలో కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈనెల 28న పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈనెల 29న ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనుంది. అయితే ఒకప్పుడు ఫిబ్రవరి నెల చివరి రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది. అయితే దాన్ని 2017లో ఫిబ్రవరి 1కి మార్చారు.
అయితే, ఈ సారి ఫిబ్రవరి నెలలో మొదటి తేదీ ఆదివారం కావడంతో బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్టాక్ మార్కెట్ సహా ఇతర ఆర్థిక కార్యకలాపాలేవీ ఆ రోజు జరగవు. దీంతో బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ ఏమైనా మారుస్తారా? అన్న విషయంపై చర్చ జరుగుతోంది. అయితే, ఈ తేదీ మార్చకూడదని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు జనవరి 30, 31 తేదీల్లో సెలవులు రానున్నాయి. రెండో దశ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే అవకాశం ఉంది. వరుసగా తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డు ఉంది. ఆయన రెండు దఫాల్లో 10 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
అంతకుముందు జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై, డిసెంబర్ 19తో ముగిశాయి. అయితే తొలిరోజే లోక్ సభలో వాయిదాల పర్వం మొదలైంది. సమావేశాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ-SIRపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటల వరకూ లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. అనంతరం సభలో పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, మణిపుర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, పాన్‌మసాలా తయారీపై కొత్త సెస్ విధించేలా బిల్లులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు ఆందోళన చేపట్టగా సభను మధ్యాహ్నం 2గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.
అనంతరం సభ ప్రారంభం కాగానే మరోసారి విపక్ష సభ్యులు నినాదాలు చేపట్టారు. విపక్షాల ఆందోళన మధ్యే మణిపుర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనలు కొనసాగడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఎస్‌ఐఆర్‌పై చర్చ పెట్టాలని విపక్షాలు నిరసనలు తెలిపాయి. ఎస్‌ఐఆర్‌పై చర్చ పెట్టేందుకు తాము సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కానీ, తక్షణమే చర్చ పెట్టడం సరికాదన్నారు. చర్చ పెట్టేందుకు తగిన సమయం ఉంటుందని అంతవరకు ఆగాలని విపక్షాలను కోరారు. ఐనప్పటికీ విపక్ష సభ్యలు నిరసనలు కొనసాగించగా రాజ్యసభ సైతం వాయిదా పడింది.
చట్టాలను ఉల్లంఘిస్తే సాగనంపుతాం : భారతీయ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక
నాడు ఇందిరమ్మ ధైర్యం- నేడు మోదీ భయం- 'తేడా గమనించండి సార్' అంటూ రాహుల్ ఫైర్!

