ETV Bharat / bharat

నాడు ఇందిరమ్మ ధైర్యం- నేడు మోదీ భయం- 'తేడా గమనించండి సార్' అంటూ రాహుల్ ఫైర్!

ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం - 'సార్, ప్లీజ్ మిమ్మల్ని కలవొచ్చా' అని మోదీ అడిగారట - పాత వీడియోతో ప్రధానిపై రాహుల్ విమర్శలు

RAHUL GANDHI SLAMS MODI
Rahul Slams PM Modi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 4:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rahul Slams PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవడానికి "సార్, ప్లీజ్ నేను మిమ్మల్ని చూడొచ్చా?" అని బతిమాలినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "తేడా గమనించండి సార్ జీ!" అంటూ మోదీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాడు అమెరికా బెదిరింపులకు ఏమాత్రం భయపడని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎక్కడ? నేడు అమెరికా అధ్యక్షుడి ముందు చేతులు కట్టుకు నిల్చున్న నరేంద్ర మోదీ ఎక్కడ? అంటూ రాహుల్ ఫైర్​ అయ్యారు. ఈ మేరకు ఆయన ఒక పాత వీడియోను షేర్ చేసి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ట్రంప్ ఏమన్నారంటే?
అసలు ఈ వివాదానికి కారణం మంగళవారం ట్రంప్ చేసిన వ్యాఖ్యలే. హౌస్ జీఓపీ రిట్రీట్‌లో ట్రంప్ మాట్లాడుతూ, భారత్‌పై, మోదీపై సంచలన కామెంట్స్ చేశారు. "భారత్, రష్యా నుంచి ఆయిల్ కొంటోంది. అందుకే మేం వారిపై భారీగా పన్నులు వేశాం. ఆ పన్నుల వల్ల ప్రధాని మోదీ నాపై అంత సంతోషంగా లేరు" అని ట్రంప్ అన్నారు. అంతటితో ఆగకుండా, "మోదీ నన్ను చూడటానికి వచ్చారు. 'సార్, నేను మిమ్మల్ని కలవొచ్చా ప్లీజ్' అని అడిగారు. నేను సరే అన్నాను" అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒక దేశ ప్రధానిని ట్రంప్ ఇలా చులకన చేసి మాట్లాడటం ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పించింది.

ఇందిరమ్మకు, మోదీకి తేడా ఇదే
రాహుల్ గాంధీ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ 1971 నాటి పరిస్థితులను గుర్తుచేశారు. గతంలో తాను మాట్లాడిన ఒక వీడియో క్లిప్‌ను ఆయన పోస్ట్ చేశారు. "1971 యుద్ధ సమయంలో అమెరికా మనల్ని తీవ్రంగా బెదిరించింది. ఏకంగా తన 7వ నౌకాదళాన్ని భారత్‌పైకి పంపింది. అయినా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అమెరికా ఒత్తిడికి తలొగ్గలేదు. కొంచెం కూడా భయపడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ట్రంప్ ఒక్క మాట అనగానే మోదీ వణికిపోయారు. లొంగిపోయారు. ఇందిరమ్మ ధైర్యానికి, ఇప్పటి మోదీ భయానికి ఉన్న తేడా ఇదే" అని రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నారు.

కౌగిలింతల వల్ల ఏం వచ్చింది?
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా ప్రధానిపై సెటైర్లు వేశారు. "గతంలో 'నమస్తే ట్రంప్' అన్నారు. అమెరికా వెళ్లి 'హౌడీ మోదీ' అన్నారు. 'డొనాల్డ్ భాయ్' అంటూ బలవంతపు కౌగిలింతలు ఇచ్చారు. ఇన్ని చేసినా చివరకు మిగిలిందేంటి? ఇప్పుడు ట్రంప్ మన ప్రధానిని 'సార్, ప్లీజ్' అని అడిగించుకునే స్థాయికి దిగజార్చారు" అని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకోవడం వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు.

పన్నుల మోత, అపాచీ లేట్
ట్రంప్ కేవలం మాటలతోనే కాదు, చేతల్లోనూ భారత్‌పై కఠినంగా ఉన్నారు. భారత్, రష్యా ఆయిల్ కొంటున్నందుకు గాను, అమెరికా ఏకంగా 50 శాతం పన్నులు విధించింది. ఇందులో 25 శాతం పన్నులు కేవలం చమురు కొనుగోళ్ల కోసమేనని ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే అపాచీ హెలికాప్టర్ల అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. "భారత్ 68 అపాచీ హెలికాప్టర్ల కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తోందని నాకు చెప్పారు. ఇప్పుడు మేం దాన్ని మారుస్తున్నాం" అని తెలిపారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్‌ను రాజేశాయి. ప్రధాని గౌరవాన్ని ట్రంప్ తగ్గించారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

మహారాష్ట్రలో వింత రాజకీయం- బీజేపీ, కాంగ్రెస్‌ పొత్తు - నేతలకు సీఎం ​వార్నింగ్

నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్- ఉగ్రవాదంపై పోరు, ప్రాంతీయ పరిస్థితులపై చర్చలు