బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స: బంగాల్ పింక్ కారిడార్ మోడల్‌కు అంతర్జాతీయ గుర్తింపు- ఆఫ్రికాలో అమలుకు సిద్ధం
పేదలకు ఉచితంగా, వేగంగా, సమగ్రంగా క్యాన్సర్ చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్న పింక్ కారిడార్ మోడల్- ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు!

Published : February 27, 2026 at 5:17 PM IST
Bengal Pink Corridor In Britain : క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణభయం. చికిత్స ఖర్చులతో కుటుంబాలు కూలిపోయిన సందర్భాలు అనేకం. అయితే ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య సేవలతో పేదలకు కూడా ఆశాకిరణం కనిపిస్తోంది. ఈ క్రమంలో బంగాల్ రూపొందించిన పింక్ కారిడార్ మోడల్ దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది.
బ్రిటన్ ఇటీవల ఆ నమూనాను ఆమోదించి, ఆఫ్రికా దేశాల్లో అమలు చేయాలని నిర్ణయించడం విశేషం. అసన్సోల్ జిల్లా ఆసుపత్రిలో కేన్సర్ చికిత్స విజయాలపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ విషయాన్ని రాష్ట్ర క్యాన్సర్ కేర్ విభాగం నోడల్ అధికారి, ప్రముఖ శస్త్రచికిత్స నిపుణుడు డా. దీప్తేంద్ర సర్కార్ వెల్లడించారు.
ఉచిత చికిత్సకు వినూత్న చర్యలు
క్యాన్సర్ చికిత్స ఖర్చులు అధికంగా ఉండటంతో పేద రోగులు వైద్యం పొందలేకపోయే పరిస్థితులు గతంలో కనిపించేవి. దీనికి పరిష్కారంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా బ్రెస్ట్ కేన్సర్ చికిత్స కోసం పింక్ కారిడార్ వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి ఎస్ఎస్కేఎం హాస్పిటల్‌ను జిల్లా ఆసుపత్రులతో డిజిటల్ పద్ధతిలో అనుసంధానం చేశారు. హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ద్వారా రోగుల వివరాలు వెంటనే అప్లోడ్ అవుతాయి. దీంతో పరీక్షలు, బయోప్సీలు, వైద్యుల సలహాలు అన్నీ వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. చికిత్స ఆలస్యం కాకుండా వెంటనే ప్రారంభమవుతోంది.
హబ్ అండ్ స్పోక్ మోడల్
ఆ వ్యవస్థలో రాష్ట్రవ్యాప్తంగా 37 హబ్‌లు, 28 స్పోక్ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. జిల్లా ఆసుపత్రులనే స్పోక్ కేంద్రాలుగా అభివృద్ధి చేశారు. అక్కడే ప్రాథమిక పరీక్షలు, స్క్రీనింగ్, బయోప్సీలు నిర్వహిస్తున్నారు. తర్వాత నిపుణులైన వైద్యులు ఆన్‌లైన్‌లో కేసులను పరిశీలించి చికిత్స విధానాన్ని సూచిస్తున్నారు. అవసరమైతే జిల్లా ఆసుపత్రుల్లోనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆసన్సోల్ ఆసుపత్రిలో ఇప్పటికే బ్రెస్ట్, కాలన్, ప్యాంక్రియాస్, కిడ్నీ కేన్సర్‌లకు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సలు జరగడం విశేషమని వైద్యులు చెబుతున్నారు.
రోగులకు సమయం, డబ్బు ఆదా
గతంలో క్యాన్సర్ పరీక్షల కోసం మెడికల్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. రోజులు గడిచేవి. ఈలోగా వ్యాధి ముదిరిపోయేది. ఇప్పుడు జిల్లా ఆసుపత్రుల్లోనే పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉండటంతో రోగులు సమయం, ఖర్చు రెండింటినీ ఆదా చేసుకుంటున్నారు. త్వరగా చికిత్స మొదలవడంతో కోలుకునే అవకాశాలు పెరిగాయి.
పింక్ కారిడార్ అంటే ఏమిటి?
రోగి ముందుగా జిల్లా ఆసుపత్రికి వస్తాడు. అక్కడ పరీక్షలు పూర్తిచేసి వివరాలు పోర్టల్‌లో నమోదు చేస్తారు. వెంటనే వర్చువల్ మెడికల్ బోర్డు ఏర్పడి నిపుణులు చికిత్స ప్రణాళిక రూపొందిస్తారు. తదుపరి రోజు నుంచే చికిత్స ప్రారంభమవుతుంది. పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలే రోగి వద్దకు చేరుతున్నాయి. ఈ సమగ్ర వ్యవస్థకే పింక్ కారిడార్ అని పేరు.
బ్రిటన్ ప్రశంసలు- ఆఫ్రికాలో అమలు
ఆ నమూనాను ఇటీవల యూనిటైడ్ కింగ్డమ్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించగా విశేష స్పందన లభించింది. బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే ఆఫ్రికాలోని పలు దేశాల్లో క్యాన్సర్ సేవలు అందిస్తోంది. అక్కడ కూడా బంగాల్ మోడల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. డాక్టర్ సర్కార్ మాట్లాడుతూ, "భారత ప్రభుత్వానికి మూడు ప్రధాన స్క్రీనింగ్ కార్యక్రమాలు ఉన్నా, బంగాల్ ప్రత్యేక మోడల్ రూపొందించింది. ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం మరింత ఫలితాలు ఇస్తుందని బ్రిటన్ నిపుణులు అభిప్రాయపడ్డారు" అని తెలిపారు.
రాష్ట్రానికి గర్వకారణం
పేదలకు ఉచితంగా, వేగంగా, సమగ్రంగా క్యాన్సర్ చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్న ఈ పింక్ కారిడార్ మోడల్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలవడం రాష్ట్ర ఆరోగ్య శాఖకు గర్వకారణమని వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా ఆసుపత్రుల నుంచే ప్రాణరక్షక వైద్యం అందుబాటులోకి రావడం ద్వారా క్యాన్సర్‌కు భయం కాదు, చికిత్సే మార్గం అనే నమ్మకాన్ని బంగాల్ ప్రభుత్వం ప్రజల్లో తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా HPV వ్యాక్సినేషన్- క్యాన్సర్‌కు చెక్ పెట్టేలా కేంద్రం కీలక నిర్ణయం
రొమ్ము క్యాన్సర్‌ను జయించిన కథక్ డ్యాన్సర్- కీమోథెరపీల సమయంలో ప్రదర్శనలు ఆపని నృత్యకారిణి

