UGC NET 2026- మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష- ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడం వల్లే
ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీకి సెప్టెంబర్ 9, 10న మళ్లీ పరీక్ష- 84 సబ్జెక్టుల యూజీసీ నెట్ ఫలితాలు విడుదల

Published : August 29, 2026 at 9:36 AM IST
UGC NET 2026 Re Exam : యూజీసీ- నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మూడు సబ్జెక్టుల పరీక్షలకు సెప్టెంబర్ 9,10 తేదీల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. మరోవైపు 84 సబ్జెక్టులకు సంబంధించి యూజీసీ-నెట్ జూన్ 2026 ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక యూజీసీ-నెట్ వెబ్‌సైట్‌లో లాగిన్ అయి చూసుకోవచ్చు. స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
ఎన్టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం,
- ఇంగ్లీష్ : సెప్టెంబర్ 9, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
- కామర్స్: సెప్టెంబర్ 9, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
- సోషియాలజీ: సెప్టెంబర్ 10, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రంలో నిర్ణీత సమయానికి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
స్కోర్‌కార్డుపై స్పష్టత
రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ అభ్యర్థులకు ఎన్టీఏ ప్రత్యేక సూచన చేసింది. ప్రస్తుతం స్కోర్‌కార్డు యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తే 'Invalid Application Number/Password' అనే సందేశం కనిపించే అవకాశం ఉందని తెలిపింది. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాలు, స్కోర్‌కార్డులు రీ-ఎగ్జామ్ పూర్తయిన తర్వాతే విడుదల చేస్తామని ఎన్టీఏ వెల్లడించింది.
ప్రశ్నాపత్రాల్లో తప్పులు
యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలను ఎన్టీఏ జూన్ 22 నుంచి 30 వరకు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 87 సబ్జెక్టుల్లో పరీక్షలు జరిగాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అందించడంతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతను నిర్ణయించడం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి అర్హతను పరిశీలించడం యూజీసీ-నెట్ ప్రధాన ఉద్దేశం. అయితే పరీక్షలు ముగిసిన తర్వాత పలు సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లో తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేసేందుకు ఎన్టీఏ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ పరిశీలనలో ప్రశ్నపత్రాల్లో అనేక రకాల లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఎన్టీ తెలిపింది. ప్రముఖ పండితుల పేర్లలో తప్పులు, పుస్తకాల పేర్లు సరిగా ముద్రించకపోవడం, ప్రశ్నల రూపకల్పనలో లోపాలు, వ్యాకరణ తప్పులు, అనువాద దోషాలు ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా కొన్ని ప్రశ్నల్లో లింగం, వచనానికి సంబంధించిన వ్యాకరణ లోపాలు కూడా ఉన్నట్లు కమిటీ గుర్తించింది. గతంలో నిర్వహించిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు గణనీయ సంఖ్యలో మళ్లీ రావడాన్ని కూడా పరిశీలించింది. ఈ లోపాలపై కమిటీ ఇచ్చిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ, ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు రీ-ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఈ మూడు సబ్జెక్టుల అభ్యర్థులు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో మరోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష పూర్తయిన తర్వాతే వారి స్కోర్లను మూల్యాంకనం చేసి ఫలితాలు ప్రకటించనున్నారు.
84 సబ్జెక్టుల ఫలితాలు విడుదల
మరోవైపు మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలను ఎన్టీఏ ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ వివరాలతో లాగిన్ అయి ఫలితాలను పరిశీలించవచ్చు. రీ-ఎగ్జామ్ కారణంగా మూడు సబ్జెక్టుల ఫలితాలు మాత్రం వాయిదా పడనున్నాయి. జూనియనర్ రీసెర్చి ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు అర్హత కోసం ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 87 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను దేశ వ్యాప్తంగా నిర్వహించారు.

