తొక్కిసలాట కేసు - టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ సమన్లు
41 మందిని బలిగొన్న విషాదంపై సీబీఐ దర్యాప్తు - జనవరి 12న హాజరుకావాలంటూ టీవీకే చీఫ్‌కు ఆదేశాలు - సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ

Published : January 6, 2026 at 3:22 PM IST
CBI Summons Vijay: తమిళనాడు ప్రముఖ సినీ నటుడు, 'తమిళగ వెట్రి కళగం' అధినేత విజయ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి పిలుపు వచ్చింది. గత సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆయనను విచారించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు జనవరి 12న (సోమవారం) తమ ఎదుట హాజరుకావాలని విజయ్‌కు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ విషాద ఘటనపై సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విచారణ వేగవంతం చేసిన అధికారులు ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేతకే నోటీసులు జారీ చేశారు.
అసలేం జరిగింది?
సెప్టెంబర్ 27న కరూర్ వేదికగా జరిగిన టీవీకే బహిరంగ సభ పెను విషాదంగా మారింది. ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. భద్రతా వైఫల్యాలే దీనికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ మరణాలపై సీబీఐ కూపీ లాగుతోంది.
సామర్థ్యానికి మించి జనం
ఘటన జరిగిన రోజు అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని దర్యాప్తులో తేలింది. సభ నిర్వహించిన మైదానం సామర్థ్యం కేవలం 10,000 మంది మాత్రమే. కానీ అక్కడికి ఏకంగా 30,000 మందికి పైగా జనం పోటెత్తారు. నిర్వాహకులు సరైన అంచనా వేయలేకపోయారు. కనీసం ఆహారం, తాగునీటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో జనం ఆకలిదప్పులతో అలమటించారు. ఇది కూడా తొక్కిసలాట తీవ్రత పెరగడానికి ఒక కారణమైంది.
విజయ్ ఆలస్యం, సహనం కోల్పోయిన జనం
విజయ్ రాక ఆలస్యం కావడం వల్లే పరిస్థితి చేయి దాటిపోయిందని అధికారులు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వేదిక వద్దకు రావాల్సి ఉంది. కానీ ఆయన వచ్చేసరికి సాయంత్రం 7 గంటలు అయ్యింది. దాదాపు 7 గంటల పాటు జనం ఎండలో, ఆకలితో పడిగాపులుగాశారు. ఆయన వచ్చే సమయానికి జనసంద్రం వెల్లువలా మారింది. ఆయన ప్రచార రథంతో పాటు బయట నుంచి కూడా జనం ఒక్కసారిగా తోసుకువచ్చారు.
చెప్పులు విసిరారు, చెట్లు ఎక్కారు
విజయ్ రాకతో అక్కడ గందరగోళం నెలకొంది. ఆయన్ను చూసేందుకు జనం చెట్లు, ఇళ్ల పైకప్పులు ఎక్కారు. కరెంట్ స్తంభాలు కూడా ఎక్కడంతో, షాక్ కొట్టకుండా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చీకటి పడటం, తోపులాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ దృష్టిని ఆకర్షించడానికి కొందరు ఆయన ప్రచార రథంపైకి చెప్పులు విసిరారు. జనం ఒకరినొకరు నెట్టుకోవడంతో చాలా మంది స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
క్షమాపణలు చెప్పిన విజయ్
ఘటన జరిగిన నెల రోజుల తర్వాత విజయ్ బాధిత కుటుంబాలను కలిశారు. చెన్నై సమీపంలోని మహాబలిపురం రిసార్ట్‌లో బాధితులతో సమావేశమయ్యారు. ఈ ఘటన పట్ల ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. "మిమ్మల్ని వెంటనే కలవలేనందుకు నాకు చాలా గిల్టీగా అనిపించింది. అప్పుడు నా బుర్ర పనిచేయలేదు. ఏం ఆలోచించలేకపోయాను. ఇప్పుడు మిమ్మల్ని కలిశాక నా మనసు కుదుటపడింది" అని విజయ్ బాధితులతో ఎమోషనల్ అయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు.
అరెస్టులు, విడుదల
ఈ ఘటనకు బాధ్యుడిగా టీవీకే కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మతియళగన్‌ను పోలీసులు మొదట అరెస్ట్ చేశారు. ఏర్పాట్లలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. అయితే కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించేందుకు నిరాకరించడంతో తర్వాత విడుదలయ్యారు. ఇప్పుడు నేరుగా విజయ్‌కే సీబీఐ నోటీసులు రావడంతో, సోమవారం విచారణలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

