ETV Bharat / bharat

ప్రతి నెలా బాలేశ్వర్ టు పూరీ యాత్ర- సైకిల్‌పై 260కి.మీల ప్రయాణం- జగన్నాథుడికి తులసిని తీసుకుని!

బాలేశ్వర్ నుంచి పూరీకి సైకిల్ యాత్ర చేస్తున్న భక్తుడు బృందావన్ మాలిక్- 260కి.మీలు సైకిల్‌పైనే ప్రయాణం- కారణం ఇదే!

Devotional Cycle Yatra in Odisha
బాలేశ్వర్ నుంచి పూరీకి సైకిల్ యాత్ర (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 27, 2026 at 3:27 PM IST

3 Min Read
Choose ETV Bharat

Devotional Cycle Yatra in Odisha : సమాజ శ్రేయస్సు కోసం ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి బాలేశ్వర్ నుంచి పూరీకి సైకిల్ యాత్ర చేస్తున్నాడు. ఆ సమయంలో సైకిల్‌పై తులసి కొమ్మలను జగన్నాథుడి దేవాలయానికి తీసుకెళ్తున్నాడు. ప్రతి నెల ఈ యాత్రను చేపడుతున్నాడు. ఈ క్రమంలో పూరీ జగన్నాథుడి భక్తుడి సైకిల్ యాత్ర వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం పదండి.

బాలేశ్వర్ జిల్లాలోని ముల్లేశ్వర్ గ్రామానికి చెందిన బృందావన్ మాలిక్‌ (40)కు భార్య, కుమారుడు ఉన్నారు. బృందావన్ మాలిక్ ప్రతిరోజు వేరే గ్రామాలకు వెళ్లి చాట్ అమ్ముతాడు. ఆ చిరు వ్యాపారంతో వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రెక్కాడితేనే డొక్కాడుతుందన్నమాట. అయితే కొన్నాళ్ల క్రితం బృందావన్ మాలిక్ తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. ఒక రోజు అతడికి కలలో పూరీ జగన్నాథుడు కనిపించాడు. ఆ తర్వాత బృందావన్ పూరీ వెళ్లి జగన్నాథుడి దర్శనం చేసుకున్నాడు. ఆపై బృందావన్‌లో నిరాశ తొలగిపోయింది. హాయిగా అనిపించింది. దీంతో ప్రతి నెలా క్రమం తప్పకుండా పూరీ వెళ్తున్నాడు బృందావన్.

Devotional Cycle Yatra in Odisha
బాలేశ్వర్ నుంచి పూరీకి సైకిల్ యాత్ర (ETV Bharat)

సైకిల్‌పై తులసితో ప్రయాణం
ప్రతి నెలా 20వ తేదీన బృందావన్ మాలిక్ బాలేశ్వర్ నుంచి పూరీకి సైకిల్‌పై బయలుదేరుతాడు. తమ చుట్టుపక్కల గ్రామాల నుంచి తులసిని సేకరిస్తాడు. సైకిల్ ముందు ఒక సంచిలో తులసి కొమ్మలు ఉన్నాయి. అలాగే సైకిల్ వెనుక ఏర్పాటు చేసిన రెండు బుట్టల్లో కూడా తులసి కొమ్మలు ఉంటాయి. తులసితో పాటు కొబ్బరికాయలు, పువ్వులు కూడా సేకరిస్తాడు. వీటిని పూరీలో కొలువైన జగన్నాథుడి కోసం తీసుకెళ్తాడు.

Devotional Cycle Yatra in Odisha
బాలేశ్వర్ నుంచి పూరీకి సైకిల్ యాత్ర (ETV Bharat)

ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీకి నెలకు ఒకసారి వెళ్తానని బృందావన్ మాలిక్ చెప్పాడు. పూరీ జగన్నాథుడికి తీసుకెళ్లడానికి శిరాపూర్, బ్రహ్మపుర, కేశ్‌పూర్, ఖిలుకుని, పైక్ సాహి, తెలియగంజ్ వంటి దాదాపు 8-10 గ్రామాల నుంచి తులసిని సేకరిస్తానని తెలిపాడు. ప్రజలు కూడా చాలా సంతోషంగా తులసిని ఇస్తారని వెల్లడించాడు. "నేను తులసిని తీసుకుని నెలకు ఒకసారి పూరీకి వెళ్తానని ఇప్పుడు చాలా మందికి తెలిసింది. దీంతో చాలా మంది నా ఇంటికి తెచ్చి తులసిని ఇస్తున్నారు. " అని బృందావన్ మాలిక్ స్పష్టం చేశాడు.

Devotional Cycle Yatra in Odisha
బాలేశ్వర్ నుంచి పూరీకి సైకిల్ యాత్ర చేస్తున్న బృందావన్ మాలిక్ (ETV Bharat)

గుడి, మఠాల్లోనే విశ్రాంతి
బృందావన్ మాలిక్ బాలేశ్వర్ నుంచి పూరీ వరకు వెళ్లే సైకిల్ యాత్ర ప్రతి నెలా 20వ తేదీన ప్రారంభమవుతుంది. బాలేశ్వర్ నుంచి పూరీ దాదాపు 260 కి.మీల దూరం ఉంటుంది. ఈ దూరం ప్రయాణించడానికి దాదాపు రెండు రోజులు పడుతుంది. అలాగే ఈ యాత్ర సమయంలో బృందావన్ దేవాలయాలు, మఠాల్లోనే రాత్రి నిద్రపోతాడు. ఎవరి ఇంట్లో లేదా వరండాలో విశ్రాంతి తీసుకోడు.

"నేను సమాజ శ్రేయస్సు కోసం ఈ సైకిల్ యాత్ర చేస్తున్నాను. పూరీకి వెళ్లలేనివారు నాతో దేవుడికి వస్తువులను పంపవచ్చు. నేను వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల నుంచి తులసిని సేకరిస్తున్నాను. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మంది నుంచి తులసిని సేకరిస్తాను. ఈ సేవ కోసం నా కుటుంబం, ముఖ్యంగా నా భార్య చాలా మద్దతు ఇస్తోంది. నేను ఒడిశాలో, దేశంలోని అనేక దేవాలయాలను సందర్శించాను. భక్తితో ప్రతి గుడికి వెళ్లాను. అయితే పూరీ జగన్నాథుడిని దర్శించుకోలేదు. అకస్మాత్తుగా ఓ రోజు నిద్రలో ఓ కలలో పూరీ జగన్నాథుడు కనిపించాడు. అప్పటి నుంచి తులసి పట్టుకుని పూరీకి వెళ్తున్నాను. " అని బృందావన్ మాలిక్ తెలిపాడు.

అలాగే బృందావన్ సైకిల్ యాత్రలో తన్మయ్ ప్రధాన్ (20 సంవత్సరాలు) భాగమయ్యాడు. తన్మయ్ కూడా బృందావన్‌తో కలిసి బాలేశ్వర్ నుంచి పూరీకి సైకిల్ యాత్ర చేపడుతున్నాడు. గత నెల (జనవరి) 20న పూరీకి సైకిల్ యాత్ర చేశామని తన్మయ్ తెలిపాడు. జగన్నాథుడి కోసం తులసిని తీసుకెళ్తుతుండడంతో తమకు ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నాడు. ఈ యాత్ర ప్రతి నెలా కొనసాగుతుందని స్పష్టం చేశాడు.