స్కూటర్లో దాక్కున్న పాము- తెలియకుండానే 5కి.మీ నడిపిన లేడీ టీచర్- చివరకు ఏమైందంటే?
స్కూటర్‌లోకి చొరబాడిన పాము- కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఘటన

Published : November 1, 2025 at 10:31 PM IST
Woman Travel with Snake Five kilometers : సాధారణంగా ఎక్కడో ఆమడ దూరంలో పాము కనిపిస్తేనే చాలా భయపడిపోతుంటాం. అలాంటిది మీరు కూర్చున్న సీటు పక్కనో, మీరు తరచూ వాడే వస్తువుల్లోనో పాము చొరబడితే ఎలా ఉంటుంది చెప్పండి. అలా పాము మీ కంటపడితే పరిస్థితి ఏంటి? ఆలోచిస్తేనే భయమేస్తుంది కదా! అచ్చం ఇలాంటి ఘటనే కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో జరిగింది. స్కూటర్లో విషపూరిత పాము ఉందనే విషయం తెలియకుండానే ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేసింది ఓ కాలేజ్ టీచర్. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి హానీ కలగకుండానే బయటపడింది.
ఇదీ జరిగింది
తైకదప్పురానికి చెందిన షర్ఫునిసా నెహ్రూ కాలేజీలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమె రోజు తన స్కూటర్‌పైనే కాలేజ్‌కు వెళ్తుంటుంది. రోజూలాగే ఉదయాన్ని కాలేజ్‌కు రెడీ అయిన ఆమె, హెల్మెట్‌తో పాటు షూలను చెక్ చేసుకుంది. అన్నీ సాధారణంగానే ఉండడంతో స్కూటర్‌పై కాలేజ్‌కు బయలుదేరింది. కానీ నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడి బ్రేక్ పెడల్ దగ్గర ఏదో కదులుతున్నట్లు కనిపించింది. వెంటనే నిశితంగా పరిశీలించగా పెద్ద విషపూరితమైన పాము కనిపించింది. దానిని చూసిన ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తాను కొద్దిగా చేతులను కదిలించినా పాము కాటు వేసి ప్రమాదం ఉండేదని గుర్తు చేసుకుంది.

అయితే, కాలేజ్‌కు మరో కిలోమీటర్ మాత్రమే ఉండడంతో కాస్త ధైర్యాన్ని కూడబెట్టుకుని మెల్లగా అక్కడ వరకు వెళ్లింది. వెంటనే దగ్గర్లోని మెకానిక్కు కాల్ చేసి స్కూటర్ భాగాలని విప్పించింది. దీంతో ఆ విషపూరితమైన పాము బయటకు రావడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన తర్వాత ఎప్పుడు స్కూటర్ దగ్గరకు వెళ్లినా భయం అవుతుందని షర్ఫునిసా చెప్పారు. ముఖ్యంగా స్కూటర్‌ను బయటకు తీసే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని అంటున్నారు.

"నా అదృష్టం బాగుండి ఈరోజు బతికిపోయాను. రోజులాగే హెల్మెట్‌తో పాటు షూలను చెక్ చేశాను. అంతా నార్మల్‌గానే అనిపించడంతో కాలేజ్‌కు బయలుదేరాను. మధ్యలోకి వచ్చాక ఏదో కదులుతున్నట్లు అనిపించింది. తీరా చూస్తే పెద్ద విషపూరితమైన పాము కనిపించింది. అయితే, అది చాలా బిజీగా ట్రాఫిక్ ఉండే ప్రాంతం. అక్కడ ఏ మాత్రం భయపడినా పెద్ద ప్రమాదమే జరిగేది. అందుకే కాలేజ్ దగ్గరికి రావడంతో మెల్లగా అక్కడి వరకు వెళ్లాను. ఆ తర్వాత మెకానిక్‌ను పిలిపించి స్కూటర్ భాగాలను విప్పి పామును బయటకు తీశాం. పామును బయటకు తీసిన తర్వాతనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాను."
--షర్ఫునిసా, కాలేజ్ టీచర్
మూడు నెలల జాగ్రత్తగా ఉండాలని నిపుణుల సూచన
మరోవైపు మూడు నెలల పాటు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో కోబ్రా, రక్తపింజర లాంటి విషపూరిత పాములు ఎక్కువగా సంచరిస్తాయని తెలిపారు. కేవలం ఇల్లు, పరిసరాలు మాత్రమే కాకుండా షూలు, వాహనాల్లో కూడా పరిశీలించాలని సలహా ఇస్తున్నారు. అక్టోబర్ నుంచి జనవరి వరకు పాములు కలిసే సమయమని అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్నేక్ క్యాచర్ కేటీ సంతోశ్ చెప్పారు.

