ETV Bharat / bharat

అమిత్​ షా కార్యాలయం ఎదుట టీఎంసీ నిరసన- ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఐప్యాక్‌ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ED దాడులను నిరసిస్తూ దిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌- TMC ఎంపీలు ఆందోళన

TMC Protest in Delhi
TMC Protest in Delhi (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 10:49 AM IST

3 Min Read
Choose ETV Bharat

TMC Protest in Delhi : బంగాల్​ కోల్‌కతాలోని ఐ-ప్యాక్‌ కార్యాలయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ED దాడులను నిరసిస్తూ దిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌-TMC ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ దిల్లీలోని కేంద్రహోం మంత్రి అమిత్‌ షా కార్యాలయం వద్ద TMC ఎంపీలు నిరసనలు చేశారు. డెరెక్‌ ఓబ్రియెన్‌, మహువా మొయిత్రాతో సహా మరికొంత మంది ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులు పట్టుకొని అమిత్‌ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బంగాల్‌ అసంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసమే దర్యాప్తు సంస్థలను కేంద్రం పంపుతోందని ఎంపీలు ఆరోపించారు. తప్పుడు పద్ధతిలో ఈడీ దాడులు చేస్తోందని ఆక్షేపించారు. అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ చేస్తోన్న ప్రయత్నమని మండిపడ్డారు. ఈ విధంగా బీజేపీ ఎన్నికలలో గెలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిరసన చేస్తున్న ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పార్లమెంట్‌ స్ట్రీట్​ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

"అమిత్ షా ఇదెక్కడ అహంకార వైఖరి? ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడానికి దిల్లీ పోలీసులను ఉపయోగించి ఎన్నికైన ప్రజా ప్రతినిధులపై దాడి చేస్తున్నారా? దేశంలోని అసమ్మతిని ఇలాగే అణచివేస్తారా? మీరు ఆందోళన చెందుతున్నారని ఒప్పుకోండి? ముందు EDని సిగ్గులేకుండా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీల శాంతియుత చేస్తున్న ధర్నాపై దాడి చేశారు. ఈ నిరాశ మీ భయాన్ని బయటపెడుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ బంగాల్ భయపడదు."
--తృణముల్​ కాంగ్రెస్​

'ఇక్కడ నిరసన చేస్తే ప్రజలు నవ్వుతారు'
మరోవైపు దిల్లీలో హెంమంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంపై బంగాల్​ బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య తప్పుబట్టారు. "బంగాల్​ ప్రజల ముందు టీఎంసీ నేతలు నిరసనలు చేయలేరు. ఎందుకంటే బంగాల్ ప్రజలకు వీరి గురించి తెలుసు. అవినీతికి వ్యతిరేకంగా ఇక్కడ నిరసన చేస్తే ప్రజలు నవ్వుతారు. ఈడీ దర్యాప్తు చేస్తున్న సమయంలో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఫైళ్లను తీసుకెళ్లారు. అయినా, ఈడీ సోదాలు రాజకీయ పార్టీ కార్యాలయంలో జరగలేదు. టీఎంసీ నేతలు బొగ్గు స్కామ్​లో పాల్గొన్నారు. టీఎంసీ, అవినీతి రెండు పర్యాయపదాలు." అని అన్నారు.

ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు
అంతకుముందు గురువారం బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా కోల్​కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేపట్టింది. ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు, డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో కూడా సోదాలు జరిపింది. అయితే, సోదాలు జరుపుతుండగా సీఎం మమత బెనర్జీ ప్రవేశించి కీలక ఆధారాలను పట్టుకెళ్లారని ఈడీ ఆరోపించింది. సాల్ట్‌ లేక్‌లోని ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు చేస్తున్న సమయంలో మమత తన అనుచరులు, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తో కలిసి బలవంతంగా లోపలికి ప్రవేశించారని తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు పలు కీలక దస్త్రాలను ఆమె తన వెంట తీసుకెళ్లిపోయారని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతీక్ జైన్ తృణముల్ కాంగ్రెస్ ఐటీ సెల్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.

రాజకీయ పార్టీల నివేదికలను సేకరించడమే ఈడీ పనా?
అటు ఈడీ దాడులను నిరసిస్తూ బంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్లారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనిఖీలు చేస్తున్నారని మమత దుయ్యబట్టారు. తమ పార్టీకి చెందిన హార్డ్ డిస్క్, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు కేంద్రం, ఈడీతో ఈ దాడులు చేయించిందని మమత ఆరోపించారు. రాజకీయ పార్టీలకు చెంది నివేదికలను సేకరించడమే ఈడీ పనా అని మమత ప్రశ్నించారు. దేశాన్ని రక్షించాల్సిన హోంమంత్రి నీచంగా వ్యవహరిస్తున్నారని అమిత్ షాను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.