ఈ కర్చీఫ్ ధర రూ.7లక్షలు- దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
'చంబా' రుమాలు రేంజే వేరప్ప- సిమ్లా ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా రూ.7 లక్షల కర్చీఫ్- కళాకారిణి అంజలి వకీల్ స్టాల్‌కు సందర్శకుల క్యూ- లండన్‌లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలోనూ ఈ కర్చీఫ్

Published : January 7, 2026 at 12:26 PM IST
World Famous Chamba Hand Kerchief : ఒక చేతి రుమాలు (హ్యాండ్ కర్చీఫ్) ధర రూ.7 లక్షలు. అవును, ఇది జోక్ కాదు, వాస్తవం. ఈ కర్చీఫ్ తయారీకి వినియోగించిన పలుచటి, సున్నితమైన కాటన్ వస్త్రం(మస్లిన్), దారం నుంచి మొదలుకొని దానిపై వేసిన డిజైన్ దాకా అన్నీ స్పెషలే. అదొక అపురూప కళాఖండం మాత్రమే కాదు, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. అందుకే అంత రేటు పలుకుతోంది. ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో నిర్వహించిన 'హిమ్ ఎంఎస్‌ఎంఈ ఫెస్ట్'లో ఈ చేతి రుమాలు ధర విని అందరూ షాక్ అయ్యారు. దాని ప్రత్యేకతల గురించి తెలుసుకోవడానికి క్యూ కట్టారు. మనమూ ఆ విశేషాలను తెలుసుకుందాం.
ధర విని అవాక్కయ్యారు
సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్‌లో ఉన్న పీటర్ హాఫ్ భవన సముదాయం వేదికగా 'హిమ్ ఎంఎస్‌ఎంఈ ఫెస్ట్'ను హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. జనవరి 3 నుంచి 5 వరకు జరిగిన ఈ ఎగ్జిబిషన్‌లో రాష్ట్రంలోని చాలా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తమ విశిష్ట ఉత్పత్తులను ప్రదర్శించాయి. వీటిలో అత్యంత స్పెషల్‌గా నిలిచింది ఈ చేతి రుమాలు. దాని ధర గురించి తెలుసుకొని అందరూ అవాక్కయ్యారు. ఈ హ్యాండ్ కర్చీఫ్ 'చంబా రాజ్య' సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. అందుకే దీన్ని 'చంబా రుమాలు' అని పిలుస్తారు. 2007లోనే దీనికి 'జాగ్రఫికల్ ఇండికేషన్' (జీఐ) ట్యాగ్ కూడా లభించింది.
చంబా రాజ్యంలో అలా మొదలైంది
ఇప్పటి పంజాబ్ రాష్ట్రం పరిధిలో చంబా అనే పేరుతో ఒక రాజ్యం ఉండేది. 1948 ఏప్రిల్ 15న అది భారతదేశంలో విలీనం అయింది. సూది, దారంతో ఆకట్టుకునే హ్యాండ్ కర్చీఫ్‌లను తయారు చేసే కళ చంబా రాజ్యం పరిధిలోనే పురుడుపోసుకుంది. గురునానక్ సోదరి బీబీ నానకి కూడా 16వ శతాబ్దంలో స్వయంగా ఒక చంబా రుమాలును తయారు చేశారు. అది ప్రస్తుతం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ఉన్న ఒక గురుద్వారాలో భద్రంగా ఉంది. 17వ శతాబ్దంలో చంబా రాజ్యానికి చెందిన రాజకుటుంబ సభ్యులు, ఆ రాజ్యంలోని ప్రజలు వివాహ బహుమతులుగా, కట్నంగా చంబా రుమాలును ఇచ్చుకునేవారు. 1883లో చంబా రాజ్య పాలకుడు రాజా గోపాల్ సింగ్ బ్రిటీష్ వారికి చంబా రుమాలును బహుమతిగా అందించారు. ఆ రుమాలుపై మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఘట్టాన్ని జీవకళ ఉట్టిపడేలా చూడచక్కగా ఎంబ్రాయిడరీ చేయించారు. ప్రస్తుతం అది లండన్‌లోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియంలో పదిలంగా ఉంది.

దుపట్టాలు, శాలువాలు, చీరలపైనా చంబా ఎంబ్రాయిడరీ
'చంబా' కళాకారిణి అంజలి వకీల్ 'హిమ్ ఎంఎస్‌ఎంఈ ఫెస్ట్'లో తన స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రోడక్ట్ కార్యక్రమంలో ఆమె తయారుచేసిన చంబా రుమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాని రూ.7 లక్షల ధర చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక్క హ్యాండ్ కర్చీఫ్ తయారీకి కొన్ని నెలల సమయం పడుతుందని అంజలి తెలిపారు. చంబా రుమాల్ ఎంబ్రాయిడరీ వర్క్‌లో ప్రావీణ్యానికిగానూ తన అత్తగారు లలితా వకీల్‌కు పద్మశ్రీ అవార్డు వచ్చిందన్నారు. అత్తగారి స్ఫూర్తితోనే ఈ సంప్రదాయ హస్తకళను నేర్చుకున్నానని అంజలి చెప్పారు. సాధారణంగానైతే ఈ కళను నేర్చుకోవడానికి చాలా టైం పడుతుందని, కానీ తాను 15 రోజుల్లోనే బేసిక్స్‌పై పట్టు సాధించానన్నారు. నిరంతర ప్రాక్టీస్ ద్వారా చంబా కర్చీఫ్‌ల తయారీపై తనకు పూర్తి పట్టు వచ్చిందని అంజలి పేర్కొన్నారు.తదుపరిగా తాను చంబా రుమాలు అల్లిక స్టైల్‌లోనే దుపట్టాలు, శాలువాలు, చీరలను ఎంబ్రాయిడరీ చేయడం మొదలుపెట్టానన్నారు. ఆ విభాగంలోనూ బాగానే ఆర్డర్లు వస్తున్నాయని ఆమె చెప్పారు.

అంబానీ కుటుంబం నుంచీ ఆర్డర్
ఎంబ్రాయిడరీ వర్క్, డిజైన్, పరిమాణం, సంక్లిష్టతను బట్టి చంబా రుమాలు ధర రూ.1,500 నుంచి రూ.40 లక్షల దాకా ఉంటుందని అంజలి వెల్లడించారు. ఈసారి 'హిమ్ ఎంఎస్‌ఎంఈ ఫెస్ట్'లో ప్రదర్శించిన చంబా రుమాలు ధర రూ.7 లక్షలు ఉంటుందన్నారు. 2018 సంవత్సరం డిసెంబరులో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమార్తె నిషా అంబానీ వివాహం జరిగింది. ఆ పెళ్లికి తన అత్తగారు లలితా వకీల్‌ను కూడా అంబానీ ఫ్యామిలీ ఆహ్వానించిందని అంజలి చెప్పారు. దీన్నిబట్టి చంబా చేతి రుమాలుకు సంపన్న వర్గాల్లో ఉన్న ఆదరణను అంచనా వేయొచ్చని పేర్కొన్నారు. నిషా అంబానీ పెళ్లి వేళ రూ.2 లక్షలు విలువైన 2 చంబా చేతి రుమాలులను లలితా వకీల్ నుంచి అంబానీ ఫ్యామిలీ కొనుగోలు చేసిందన్నారు. ఇది హిమాచల్ హస్తకళలకు ఒక పెద్ద విజయమని అంజలి వకీల్ చెప్పుకొచ్చారు. జపాన్, జర్మనీ దేశాల్లోనూ చంబా చేతి రుమాలుకు డిమాండ్ ఉందని ఆమె తెలిపారు.

2018లో జాతీయ అవార్డు
చంబా రుమాల్ ఎంబ్రాయిడరీ వర్క్ గురించి హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటీ మండీ, ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీలలో విద్యార్థులకు తాను అవగాహన కల్పించానని అంజలి వకీల్ తెలిపారు. యువతకు సరైన వేదిక, శిక్షణ లభిస్తే, సాంప్రదాయ హస్తకళలు జీవనోపాధికి బలమైన వనరుగా మారుతాయని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కళా విభాగంలో తాను అందిస్తున్న సేవలకుగానూ భారత్‌లో 2018లో జాతీయ అవార్డు లభించిందన్నారు. జపాన్ ప్రభుత్వం కూడా తన కళా నైపుణ్యాన్ని గుర్తించిందని అంజలి తెలిపారు.

చంబా రుమాలు ప్రత్యేకతలు
- చంబా రుమాలుకు రెండు వైపులా ఒకే విధమైన ఎంబ్రాయిడరీ డిజైన్ కనిపిస్తుంది. ఇందుకోసం 'డబుల్ సైడెడ్ స్టిచ్' మెథడ్‌ను కళాకారులు అవలంభిస్తారు.
- ఈ రుమాలు తయారీకి ఉపయోగించే నూలు వస్త్రం, పట్టు దారాలు ప్రత్యేకమైనవి, సున్నితమైనవి. మస్లిన్ రకం కాటన్ వస్త్రంతో ఈ కర్చీఫ్ తయారవుతుంది. అధిక నాణ్యత కోసం పట్టు, బనారసీ పట్టు రకం వస్త్రాలనూ వాడొచ్చు.
- ఒక చంబా రుమాలును తయారు చేయడానికి నెలల కొద్దీ సమయం పడుతుంది.
- కర్చీఫ్‌పై ఒక చక్కటి హిందూ పురాణ గాధను కళాత్మకంగా చూపించేలా డిజైన్ ఉంటుంది.
- రామాయణం, మహాభారతంలోని ఏదో ఒక గాధను ఈ కర్చీఫ్‌పై డిజైన్ కోసం వాడుతారు.
- దేవదారు చెట్లు, నెమలులు, జింకలు వంటివీ ఈ డిజైన్లలో భాగంగా ఉంటాయి.
- రాసలీల డ్యాన్స్‌తో ముడిపడిన భంగిమలను కూడా ఈ కర్చీఫ్‌లపై అల్లుతారు.
- సూది, దారంతో ఎంతో ఏకాగ్రతతో ఈ కర్చీఫ్ తయారీ పనిని చేతివృత్తి కళాకారులు చేస్తారు.



