23 ఏళ్లు కొండను తొలిచి- 25 గ్రామాల తలరాతను మార్చేసిన తాత!
బిహార్ గయా జిల్లా కేవ్టీ గ్రామానికి చెందిన రామ్‌చంద్ర యాదవ్ సాహసం- దశరథ్ మాంఝీ స్ఫూర్తితో 23 ఏళ్ల పాటు కొండను తొలిచిన ట్రక్ డ్రైవర్- 25 గ్రామాలకు కొత్త వెలుగులు

Published : July 4, 2026 at 1:59 PM IST
Ramchandra Yadav Mountain Man 2 story : భార్య ప్రాణం కాపాడలేకపోయాననే బాధతో 22 ఏళ్ల పాటు కొండను తొలిచి రహదారి నిర్మించిన బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ కథను ప్రపంచం అంత సులభంగా మర్చిపోదు. అయితే ఇప్పుడు అదే బిహార్‌లో మరో 'మౌంటెన్ మ్యాన్' తన అసాధారణ సంకల్పంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక సాధారణ ట్రక్ డ్రైవర్, సరైన రహదారి లేక తన గ్రామ ప్రజలు అనుభవిస్తున్న కష్టాల్ని చూసి తన జీవితాన్నే పణంగా పెట్టాడు. చేతిలో సుత్తి, ఉలి తప్ప మరో యంత్రం లేదు. ఆర్థిక స్థోమత అంతకన్నా లేదు. అయినా రోజూ కొండను కొడుతూ 23 ఏళ్ల పాటు శ్రమించాడు. చివరకు అసాధ్యం అనుకున్న పనిని చేసి చూపించాడు. 25 గ్రామాల తలరాతే మార్చేశాడు. ఒకప్పుడు ఏ పనీ పాట లేకుండా ఇలా చేస్తున్నాడేంటీ పిచ్చోడు అంటూ ఎగతాళి చేసిన గ్రామస్థులే ఇప్పుడు ఆయన్ను గౌరవంగా 'మౌంటెన్ మ్యాన్ 2' అని పిలుచుకుంటున్నారు. ఆయనే రామ్‌చంద్ర యాదవ్.
గయా జిల్లాలో జన్మించిన రామ్‌చంద్ర యాదవ్‌కు చిన్నతనంలోనే తీవ్రమైన ఆటుపోటులు ఎదురయ్యాయి. ఆయన పదేళ్ల వయసులోనే తండ్రికి ఎవరో విషమిచ్చి చంపేశారు. దీంతో కుటుంబ పరిస్థితులు తలకిందులయ్యాయి. తర్వాత తన మేనమామ గ్రామమైన కేవ్టీలో స్థిరపడ్డారు. అప్పట్లో ఆ గ్రామం చుట్టూ ఉన్న పెద్ద కొండ కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడటం గమనించారు రామ్‌చంద్ర. దీంతో అదే కొండ తన జీవిత లక్ష్యంగా మారిపోయింది. పెద్దయ్యాక ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ వచ్చిన రామ్‌చంద్రను రోజూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తీవ్రంగా కలచివేసేవి. ఊరికి సరైన రహదారి లేకపోవడంతో గర్భిణులు ఆస్పత్రికి సమయానికి చేరుకోలేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కొండ దాటించి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చేది. విద్యార్థులు బడులకు, రైతులు మార్కెట్‌కు వెళ్లాలన్నా కొండల మీదుగా నడవడం తప్ప మరో మార్గం ఉండేది కాదు.

కూర్చుంటే కొండలు పగలవు- మాంఝీ చెప్పిన మాటతో
బిహార్‌కే చెందిన ప్రముఖ మౌంటెన్ మ్యాన్ దశరథ్ మాంఝీ కొండను తొలిచి రహదారి నిర్మించిన విషయం తెలుసుకున్న రామ్‌చంద్ర 1992లో ఒకసారి ఆయనను స్వయంగా కలిసి తన గ్రామ సమస్యను వివరించారు. 'మా ఊరికి కూడా మీరు రోడ్డు వేయండి' అని కోరగా మాంఝీ ఇచ్చిన సమాధానం రామ్‌చంద్ర జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 'నువ్వే ఎందుకు చేయవు. కూర్చుంటే కొండలు పగలవు' అని మాంఝీ చెప్పడంతో రామ్‌చంద్రలో పట్టుదల పెరిగింది. అలా సుమారు ఏడాది పాటు కొండను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 1993లో రామ్ చంద్ర చేతిలో ఉలి, సుత్తి పట్టుకొని కొండ తొలిచే పని ప్రారంభించాడు. రోజూ ఉదయం గ్రామమంతా 'టన్- టన్- టన్' అనే శబ్దంతోనే మేల్కొనేది. మొదట్లో ఆ శబ్దాన్ని, ఆయనను చూసి జనం నవ్వుకున్నారు. 'ఇంకో పిచ్చోడు వచ్చాడు. 2 రోజుల్లో మానేస్తాడు' అంటూ ఎగతాళి చేశారు. కానీ అది ఒకటి, 2 రోజులతో ఆగలేదు. ఏళ్ల పాటు శ్రమించారు.

అయితే, రామ్‌చంద్ర పెద్దగా చదువుకోలేదు. సంతకం కూడా సరిగా చేయలేనని ఆయన చెబుతారు. అయినప్పటికీ తన సంకల్పాన్ని మాత్రం వదల్లేదు. 1993 నుంచి 2015 వరకు దాదాపు ప్రతి రోజూ కొండను కొడుతూనే వచ్చారు. పగలంతా శ్రమించి, రాత్రిళ్లు విశ్రాంతి తీసుకునేవారు. కుటుంబ పోషణ కోసం చేస్తున్న ట్రక్ డ్రైవింగ్ ఉద్యోగం కూడా వదిలేశారు. దీంతో కుటుంబం తీవ్ర పేదరికంలోకి వెళ్లింది. ఎన్నో రోజుల పాటు ఒకపూట భోజనమే చేసి, మరో పూట ఆకలితోనే నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయని ఆయన కుమారుడు మున్నా కుమార్ చెబుతున్నారు.
25 గ్రామాలకు రాకపోకలు
అలా 23 ఏళ్ల నిరంతర శ్రమ తర్వాత రామ్‌చంద్ర సుమారు 15 నుంచి 30 అడుగుల ఎత్తున్న కొండను తొలిచి 15 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించారు. ఆ రహదారితో కేవ్టీ, కతల్పురా, లోర్ గంగ్టీ, కొలుహరా, ఇత్రా, బుంచార్, పియార్, నందూ బిఘా, నరహత్, రద్వానా, బద్వానా ఇలా దాదాపు 25 గ్రామాలకు రాకపోకలు సులభమయ్యాయి. ఇంతకుముందు గయా పట్టణానికి వెళ్లి రావాలంటే దాదాపు 7 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అది 3-4 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ప్రస్తుతం రోజూ వందలాది వాహనాలు, స్కూల్ బస్సులు ఈ రహదారిగుండూ ప్రయాణిస్తున్నాయి. దాదాపు లక్ష మందికిపైగా ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

2015లో రహదారి పూర్తయిన తర్వాత ప్రభుత్వం దానిని అభివృద్ధి చేస్తుందని రామ్‌చంద్ర ఆశించారు. కానీ అటవీ శాఖ ఆయనపై కేసు నమోదు చేసి జైలుకు పంపింది. అయినా ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం అదే రహదారిని మరింత మెరుగుపర్చేందుకు (లెవెల్ చేసేందుకు) రోజూ ఉలి, సుత్తితో పనిచేస్తూనే ఉన్నారు.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం- ఆ 23 మందిని 'టెర్రరిస్టులు'గా ప్రకటించిన కేంద్రం
మలద్వారంలో ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ గ్లాస్, గుట్కా ప్యాకెట్- రోగి చెప్పిన కారణాన్ని నమ్మని వైద్యులు

