ETV Bharat / bharat

'స్కూల్ మ్యూజియమ్స్‌‌'- పాఠ్య పుస్తకాలను మించిన నాలెడ్జ్- ఆచరణాత్మక, అనుభవపూర్వక విద్యాబోధన

స్కూల్ మ్యూజియమ్స్‌‌తో అద్భుత ఫలితాలు- పాఠ్యాంశాలపై విద్యార్థులకు లోతైన అవగాహన ఝార్ఖండ్‌‌లోని 1,000కిపైగా పాఠశాలల్లో మ్యూజియంలు- గిరిజన ప్రాంతాల్లోని బాలల పాలిట వరం- నెరవేరుతున్న -సమగ్ర శిక్షా అభియాన్‌ లక్ష్యం

School Museum Concept
School Museum Concept (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 10, 2026 at 12:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

School Museum Concept : ఏదైనా పాఠాన్ని పుస్తకంలో చదవడం ఒక ఎత్తు. ఆ పాఠంలోని విషయాలను లైవ్‌లో చూసి లేదా ప్రాక్టికల్స్ చేసి తెలుసుకోవడం మరో ఎత్తు. ఈ విధమైన ఆచరణాత్మక, అనుభవపూర్వక విద్యాబోధన దిశగా ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో 'స్కూల్ మ్యూజియం'లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పుస్తకంలోని పాఠాలు, చిత్రాలను మించిన విజ్ఞానదాయక సమాచారాన్ని విద్యార్థులు తెలుసుకుంటున్నారు. పర్యావరణం, పరిసరాలు, సంప్రదాయాలు, సంస్కృతి, నాగరికత, మానవుల జీవనశైలిపై లోతైన అవగాహన పొందుతున్నారు. 'స్కూల్ మ్యూజియం'లను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? విద్యార్థుల నాలెడ్జ్‌ను పెంచేందుకు వాటిలో ఏమేం ఉన్నాయి? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఏమిటీ సమగ్ర శిక్షా అభియాన్?
విద్యను పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా పిల్లల జీవితాలు, పరిసరాలు, సంస్కృతితో అనుసంధానించడం సమగ్ర శిక్షా అభియాన్ (సమగ్ర విద్యా మిషన్) లక్ష్యం. సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టుకు 2018లో భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను సమగ్రంగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్టు టార్గెట్. ఇందుకోసం సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, శిక్షక్ శిక్షా (టీచర్ ఎడ్యుకేషన్)‌లను ఏకీకృతం చేశారు. పిల్లలకు ఆచరణాత్మక, అనుభవపూర్వక విద్యాబోధనను అందించాలని నిర్దేశించారు.

SCHOOL MUSEUMS
స్కూల్​ మ్యూజియం (ETV Bharat)

ఝార్ఖండ్‌‌లోని 1,000కిపైగా పాఠశాలల్లో మ్యూజియంలు
సమగ్ర శిక్షా అభియాన్‌లో భాగంగానే దేశంలోని పలు గిరిజన, బహుభాషా ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మ్యూజియంలను ఏర్పాటు చేశారు. ఝార్ఖండ్‌‌ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో (సిమ్దేగా, పశ్చిమ సింగ్భూమ్, ఖుంటి, గుమ్లా, లోహర్దగా, లతేహర్, దుమ్కా, సాహిబ్ గంజ్) ఉన్న గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో 1,000కిపైగా స్కూల్ మ్యూజియంలు ఉన్నాయి. వీటివల్ల 31,000 మందికిపైగా పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. విద్యార్థుల ప్రయోజనార్థం ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ బడుల్లో ఐదు స్థానిక భాషలలో (సంతాలి, ముండారి, ఖరియా, హో, కురుఖ్) విద్యాబోధన కూడా చేస్తున్నారు.

SCHOOL MUSEUMS
స్కూల్​ మ్యూజియం (ETV Bharat)

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లోనూ!
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలలో స్కూల్ మ్యూజియంల కాన్సెప్ట్ ఇప్పటికే సక్సెస్ అయింది. ఒడిశాలోని 17 జిల్లాల్లో ఉన్న గిరిజన ప్రాబల్య ప్రాంతాలలో దాదాపు 300 ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మ్యూజియంలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 45 స్కూల్ మ్యూజియంలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని 61 బ్రిటీష్ కాలం నాటి పాఠశాలలను స్కూల్ మ్యూజియంలుగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలు అధికారులు సిద్ధం చేశారు.

SCHOOL MUSEUMS
స్కూల్​ మ్యూజియం (ETV Bharat)

స్కూల్ మ్యూజియంలలో ఏం నేర్చుకుంటారు?
స్కూల్ మ్యూజియంలలో గృహోపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, సాంప్రదాయ ఉపకరణాలు, జానపద కళారూపాలు, సంగీత వాయిద్య పరికరాలు, పండుగల సంబంధిత వస్తువులు, ఔషధ మూలికలు, వివిధ రకాల మట్టి వంటివి ఉంటాయి. వాటిపై పేర్లు, వివరాలు రాసి ఉంటాయి. ఈ వస్తువులతో ముడిపడిన పాఠం ఏదైనా వచ్చినప్పుడు, విద్యార్థులను స్కూల్ మ్యూజియంలోకి తీసుకొని వస్తారు. ఆ వస్తువును చూపిస్తూ, ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తారు. విద్యార్థులు మ్యూజియంలోని వస్తువులను టచ్ చేసి చూస్తూ, వాటి గురించి తెలుసుకుంటారు. దీనివల్ల చరిత్ర, పర్యావరణం, సమాజం, సంప్రదాయాలు, స్థానిక సంస్కృతి, జీవన శైలి గురించి విద్యార్థులకు స్పష్టమైన అవగాహన వస్తుంది. పిల్లలు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితమైతే ఇంతటి అవగాహన లభించదు. అంటే స్కూల్ మ్యూజియంలో మన దేశ విద్యావిధానంలో విప్లవాత్మక మార్పునకు బాటలు వేశాయి.

SCHOOL MUSEUMS
స్కూల్​ మ్యూజియం (ETV Bharat)

కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతోంది!
"స్కూల్ మ్యూజియంలు గిరిజన బాలల ఆలోచనా విధానాన్ని మార్చేస్తున్నాయి. వారి నాలెడ్జ్‌ను అనూహ్యంగా పెంచుతున్నాయి. ఎందుకంటే విద్యార్థులు మ్యూజియంలోకి వెళ్లి వివిధ వస్తువులు, పరికరాలు, ఉత్పత్తులను నేరుగా టచ్ చేసి చూస్తారు. పాఠ్య పుస్తకంలోని ఫొటోలను చూడటానికి మించిన లెర్నింగ్ ఇది. ప్రత్యక్షంగా చూసి, ప్రాక్టికల్స్ చేసి నేర్చుకున్న విషయాలతో లోతైన అవగాహన వస్తుంది. కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నెరవేరుతున్నట్లుగా కనిపిస్తోంది" అని ల్యాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ ఫౌండేషన్ జాతీయ సలహాదారు డాక్టర్ మహేంద్ర కుమార్ మిశ్రా పేర్కొన్నారు.

SCHOOL MUSEUMS
స్కూల్​ మ్యూజియం (ETV Bharat)

చేతులు లేకపోయినా డోంట్​ కేర్-​ 'ఛాయ్'తో తలరాతను మార్చుకున్న సంతోష్!

ఛార్జింగ్ అవసరం లేని ఎలక్ట్రిక్​ సైకిల్​- భారత విద్యార్థి వినూత్న ఆవిష్కరణ