ETV Bharat / bharat

మొబైల్ యూజర్లకు అలర్ట్​- పోర్న్ యాప్స్​ ముసుగులో ఫోన్స్​లోకి చొరబడుతున్న మాల్‌వేర్!

సైబర్ నేరాల పట్ల ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ అప్రమత్తం- పోర్న్ యాప్‌ల ముసుగులో మొబైల్‌లోకి చొరబడుతున్న మాల్‌వేర్ గురించి హెచ్చరించిన సంస్థ- ప్రకటనలు, వెబ్‌సైట్లు, ఏపీకే ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయొద్దని సూచన

I4C on Porn Apps Cyber Frauds
ప్రతీకాత్మక చిత్రం (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : August 31, 2026 at 5:29 PM IST

3 Min Read
Choose ETV Bharat

I4C on Porn Apps Cyber Frauds : అశ్లీల (పోర్న్) యాప్‌ల ముసుగులో ఉన్న మాల్‌వేర్ గురించి ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) హెచ్చరించింది. సోషల్ మీడియా ప్రకటనల ద్వారా వ్యాప్తి చెందుతున్న హానికరమైన అశ్లీల యాప్‌ల ద్వారా జరిగే ఆర్థిక మోసాలు పెరిగాయని తెలిపింది. ఈ యాప్‌లు ఫోన్ డివైజ్‌ను తమ నియంత్రణలోకి తీసుకుని, అనధికార ఆర్థిక లావాదేవీలకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర విశ్వసనీయ యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. ప్రకటనలు, వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింక్‌ల నుంచి వచ్చే ఏపీకే (APK) ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలని పిలుపునిచ్చింది. తెలియని యాప్‌లకు యాక్సెసిబిలిటీ అనుమతులు ఇవ్వవద్దని కోరింది. ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను క్రమం తప్పకుండా సమీక్షించి, తమకు తెలియని వాటిని తొలగించాలని కూడా వినియోగదారులకు సూచించింది.

'కొన్ని యాప్స్ యూజర్స్‌ను అశ్లీల కంటెంట్ వెబ్‌సైట్లలోకి మళ్లిస్తాయి'
"నైట్ ప్లే, రీలూప్, కిస్, విమో, రివో, నెక్సో, విక్సా వంటి యాప్‌లు వినియోగదారులను సోషల్ మీడియా ప్రకటనల నుంచి అశ్లీల కంటెంట్‌ను అందించే వెబ్‌సైట్‌లకు మళ్లిస్తాయి. వెబ్‌సైట్ డొమైన్‌లు ప్రధానంగా .liveతో ముగుస్తాయి. అక్కడ గూగుల్ ప్లే స్టోర్ వెలుపల నుంచి ఒక ఆండ్రాయిడ్ ఏపీకేని డౌన్‌లోడ్ చేసుకుని, ఇన్‌స్టాల్ చేసుకోమని యూజర్లను కోరతాయి. ఇన్‌స్టాలేషన్ తర్వాత ఆ యాప్ అదనపు అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతులు కోరుతుంది. యాక్సెసిబిలిటీ అనుమతిని దుర్వినియోగం చేసి వినియోగదారుల డివైజ్‌ను తన నియంత్రణలోకి తీసుకుంటుంది. దీనివల్ల ఆర్థిక మోసాలు జరగవచ్చు. కొన్ని యాప్‌లు వీపీఎన్‌ను కూడా ఇన్‌స్టాల్ చేస్తాయి. దీనిని హానికరమైన, నేరపూరిత కార్యకలాపాలకు సంబంధించిన ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మళ్లించడానికి ఉపయోగిస్తాయి. " అని ఐ4సీ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ హెచ్చరించింది.

ఆండ్రాయిన్ ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలంటే?
కొన్ని సందర్భాల్లో ఈ మాల్‌వేర్ సాధారణ డివైజ్ సెట్టింగ్‌ల ద్వారా కూడా అప్లికేషన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయకుండా వినియోగదారులను నిరోధించవచ్చని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ తెలిపింది. దీనివల్ల బాధితులు తమ ఫోన్‌లపై తిరిగి నియంత్రణ సాధించడం మరింత కష్టతరవుతుందని పేర్కొంది. ఇప్పటికే ఫోన్ హ్యాకింగ్‌కు గురైతే మొదట దాన్ని సేఫ్ మోడ్‌లో రీస్టార్ట్ చేసి, అనుమానాస్పద అప్లికేషన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని సూచించింది. అప్పటికే మాల్‌వేర్ పోకపోతే వినియోగదారులు యాప్ యాక్సెసిబిలిటీ యాక్సెస్‌ను డిసేబుల్ చేయాలని పేర్కొంది. ఫోన్ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా యాప్ తొలగకపోతే ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేసి పోన్‌ను రీసెట్ చేయాలని సిఫార్సు చేసింది. మోసపూరిత యాప్‌లు, సైబర్ స్కామ్‌‌లు జరిగితే వెంటనే 1930 లేదా cybercrime.gov.in ద్వారా తమకు నివేదించాలని కోరింది.

'గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను ఎనేబుల్ చేయాలి'
"ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్, ఇతర విశ్వసనీయ యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమే అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాడ్స్, వెబ్‌సైట్లు, అనుమానాస్పద లింక్‌ల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయకూడదు. తెలియని యాప్‌లకు యాక్సెసిబిలిటీ అనుమతులు ఇవ్వొద్దు. ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లను క్రమం తప్పకుండా సమీక్షించుకోవాలి. తమకు తెలియని యాప్‌లను ఫోన్ నుంచి తొలగించాలి. ఫోన్‌లో గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను ఎనేబుల్ చేసి ఉంచాలి. ఆండ్రాయిడ్ డివైజ్‌లను అప్డేడ్‌గా ఉంచుకోవాలి. వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలు, యూపీఐ లావాదేవీలలో అనధికార కార్యకలాపాలు ఉన్నాయేమో క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. " అని సైబర్‌ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ స్పష్టం చేసింది.

ఫోర్న్ సైట్లలలో టెర్రరిస్టుల సీక్రెట్‌ చాటింగ్
ఉగ్రవాదులు రహస్యంగా మాట్లాడేందుకు అశ్లీల వెబ్‌సైట్లు, ప్రత్యేకమైన ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని ఇటీవలే భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. సంప్రదాయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘాను తప్పించుకునేందుకు జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు, పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐ తమ రిక్రూట్లతో మాట్లాడడాకి ఈ మార్గాలను వాడుకుంటున్నట్లు తేల్చాయి. భద్రతా సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడానికి ఈ పోర్నోగ్రఫీ ప్లాట్‌ఫారమ్‌లో ఉండే రియల్ టైమ్ చాట్ టూల్స్‌ను ఉగ్రవాదులు వాడుకుంటున్నట్లు గుర్తించాయి.

డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.63 లక్షల టోకరా- 17 రాష్ట్రాల్లో సైబర్ వేట- 12 మంది అరెస్ట్

డూప్లికేట్ సిమ్‌కు రూ.650 వసూల్- కట్ చేస్తే ఎయిర్‌టెల్ ఏజెంట్‌కు బిగ్ షాక్- రూ.40వేలు చెల్లించాలని ఆదేశం