ETV Bharat / bharat

నేపాల్ టూ ఉత్తరాఖండ్- హిమాలయ దేశాలు, రాష్ట్రాల్లో 'ఆగస్టు' భయాలు- 28 ఏళ్లుగా కుదిపేస్తున్న విపత్తులు!

హిమాలయ పర్వత ప్రాంత ప్రజల్లో ఆగస్టు ఫీవర్- ఆ నెలలో ఉత్తరాఖండ్, నేపాల్‌ను కుదిపేస్తున్న విపత్తులు- ప్రాణాలు విడుస్తున్న వేలాది మంది ప్రజలు

Natural Disasters August Month
ప్రతీకాత్మక చిత్రం (ETV BHARAT)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 2:32 PM IST

4 Min Read
Choose ETV Bharat

Natural Disasters August Month : నేపాల్‌లో జలప్రళయం వల్ల వందలాది మంది ప్రాణాలు విడవడంతో హిమాలయ పర్వత ప్రాంత దేశాలు, రాష్ట్ర వాసుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఆగస్టులో హిమాలయ శిఖరంపై కురిసే వర్షపు చినుకుల్లో ప్రమాదకరమైన కోణం దాగి ఉంది. రుతుపవనాల ఉద్ధృతి సమయంలో హిమానీనదాలు కరిగినప్పుడు ప్రకృతి పూర్తిగా భిన్నమైన సందేశాన్ని ప్రజలకు పంపుతోంది. పర్వత పైభాగంలో ఉన్న మంచు, హిమానీనదాలపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పర్వతం కింద బలహీనపడుతున్న రాతి నిర్మాణాలు, నదులు కలిసి వరదలు, కొండచరియలు విరిగిపడటం, సరస్సులు విస్ఫోటనం చెందడానికి వేగంగా పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అందుకే భారత్‌, నేపాల్ తదితర దేశాల్లో ఆగస్టు నెలలో పదే పదే అనేక విషాదకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనల కారణంగా చాలా సార్లు గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో భారత్, నేపాల్‌లో ఆగస్టు నెలలో సంభవించిన ప్రకృతి విపత్తుల గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

28 ఏళ్ల క్రితం ప్రారంభం
1998 ఆగస్టు 18న ఉత్తరాఖండ్‌ పిథోర్‌గఢ్ జిల్లాలోని కాళీ లోయలో ఉన్న మాల్పా గ్రామంపై ఒక భారీ పర్వత భాగం కూలిపోయింది. ఈ విషాదంలో కైలాస మానసరోవర్ యాత్ర చేస్తున్న 60 మంది యాత్రికులతో సహా 221 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని అప్పట్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన గురించి ప్రముఖ భూవిజ్ఞాన శాస్త్రవేత్త బీడీ జోషీ ఈటీవీ భారత్‌కు వివరించారు.

"ఇది కేవలం ఆకస్మిక కొండచరియ విరిగిపడటం మాత్రమే కాదు. నిజానికి భారీ వర్షపాతం వల్ల పెరిగిన నీటి ఒత్తిడి, ముందు నుంచే ఉన్న బలహీనమైన రాతి నిర్మాణాలు, ఆ ప్రాంతపు భౌగోళిక పరిస్థితులు వంటి అనేక కారణాల కలయిక ఈ భారీ శిథిల ప్రవాహానికి కారణమైంది. హిమాలయాలలో వర్షం కేవలం నీటిని మాత్రమే కాకుండా తరచుగా పర్వతాలనే కూల్చివేస్తుందనడానికి మాల్పా ఘటన ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది" అని బీడీ జోషీ తెలిపారు.

లద్ధాఖ్ విషాదం
2010 ఆగస్టు 6న లద్ధాఖ్‌లోని లేహ్‌లో రాత్రిపూట సంభవించిన మేఘ విస్ఫోటనం అతి తక్కువ సమయంలో కుండపోత వర్షాన్ని కురిపించింది. తత్ఫలితంగా సంభవించిన ఆకస్మిక వరదలు లేహ్, చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వరదలు, శిథిలాలు పడిన ఘటనల్లో దాదాపుగా 255 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఇళ్లు, రోడ్లు, కీలకమైన మౌలిక సదుపాయాలు శిథిలాల కింద కూరుకుపోయాయి.

నేపాల్ వరదలు- 2017
2017 ఆగస్టులో నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 143 మంది మరణించారు. ఈ వరదల వల్ల దాదాపు 17 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. దాదాపు 65,000 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అనేక జిల్లాల్లో రహదారి, సమాచార వ్యవస్థలు కుప్పకూలాయి. ఇది ప్రపంచంలోని ప్రధాన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా నిలిచింది.

ఉత్తరాఖండ్‌లో విపత్తులు
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో 2019 ఆగస్టులో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో జిల్లాలోని అనేక గ్రామాల్లో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మరణించారు. అలాగే 2021 ఫిబ్రవరి 7న చమోలి జిల్లాలోని రైనీ ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. రిషిగంగా, ధౌలిగంగా లోయలలో ఆకస్మికంగా, వినాశకరమైన వరదలు సంభవించాయి. దీంతో రిషిగంగా జలవిద్యుత్ ప్రాజెక్ట్ పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్-విష్ణుగడ్ ప్రాజెక్ట్ కూడా తీవ్రంగా దెబ్బతింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. కాగా, భారీ శిలలు కూలిపోవడం, మంచు గడ్డలు కరిగిపోవడం వల్ల సంభవించిన ఆకస్మిక వరదే ఈ విపత్తుకు కారణమని శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొన్నాయి. హిమాలయల్లో విపత్తు సంభవించడానికి ఆకాశం నుంచి వర్షం కురవాల్సిన అవసరం లేదని, వేల మీటర్ల ఎత్తు నుంచి మంచు, రాళ్లు కూలిపోవడం కూడా కింద ఉన్న లోయ మొత్తాన్ని నాశనం చేయగలదని రైనీ ఘటన ప్రపంచానికి నిరూపించింది.

వరదలతో హిమాచల్, ఉత్తరాఖండ్ అతలాకుతలం
హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో 2023 ఆగస్టులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు వల్ల ఇరు హిమాలయన్ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. రోడ్లు, వంతెనలు కూలిపోయాయి. నివాస ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా పర్వత వాలు ప్రాంతాలలో నీరు నిలిచిపోయి, వాటి సహజ స్థిరత్వాన్ని దెబ్బతీసింది. దీంతో అనేక ప్రాంతాలలో ఆకస్మిక కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించాయి.

2024 ఆగస్టులో నేపాల్‌లోని థామే ప్రాంతంలో ఒక హిమానీనద సరస్సు ఉప్పొంగి ఆకస్మిక వరదకు కారణమైంది. ఈ సంఘటన హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక కొత్త ప్రమాదాన్ని వెలుగులోకి తెచ్చింది. ఎత్తైన ప్రదేశాల్లోని సరస్సులు అకస్మాత్తుగా ఉప్పొంగి, వాటి నీటిని విధ్వంసకర శక్తితో దిగువ లోయల్లోకి పంపుతాయని తెలియజేసింది. ఈ ముప్పు కేవలం వర్షపాతం నుంచే కాకుండా వేల మీటర్ల ఎత్తులో ఉన్న మంచు, హిమానీనదాల మధ్య నీరు పేరుకుపోవడం వల్ల కూడా తలెత్తుతుందని వెల్లడించింది.

ఉత్తరకాశీని కుదిపేసిన వరదలు
2025 ఆగస్టులో ఉత్తరకాశీ జిల్లాలోని ధారాలి ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్‌ను కుదిపేశాయి. చెత్తాచెదారంతో నిండిన ఆ నీటి ప్రవాహం అత్యంత వేగంతో దూసుకురావడంతో ఇళ్లు, దుకాణాలు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ దుర్ఘటనలో 70 మంది ప్రాణాలు కోల్పాయారు. వందలాది మంది గల్లంతయ్యారు.

నేపాల్ విషాదం
నేపాల్‌- టిబెట్ సరిహద్దులో ఆగస్టు 26న జలప్రళయం సంభవించింది. ఈ విపత్తు వల్ల 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రళయం వల్ల గ్రామాలు, వంతెనలు, రోడ్లు, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

'నేపాల్​లో చిక్కుకున్న భారతీయుల కోసం NDRF బలగాలు మోహరించాలి'- కేంద్రానికి ఖర్గే లేఖ

1.77 అంగుళాలు వంగిన భాక్రా నంగల్ డ్యామ్ గోడ- క్లారిటీ ఇచ్చిన కేంద్రం