ETV Bharat / bharat

చింతపండుతో 'చాకో' - రూ.600 కోట్ల ఆఫర్ వదులుకున్న ఇంజినీర్ సక్సెస్ స్టోరీ!

చింతపండు గుజ్జుకు పేటెంట్ - 17 దేశాలకు ఎగుమతి - సొంత ఊరిలో ఎంఎన్‌సీ కంపెనీ పెట్టాలన్నదే లక్ష్యం

BAILAHONGAL TAMARIND CHOCO
Engineer Patent for Tamarind Choco (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 3, 2026 at 5:59 PM IST

3 Min Read
Choose ETV Bharat

Engineer Patent for Tamarind Choco: చిన్నప్పుడు చింతచెట్టు కింద చింతకాయలు ఏరుకోవడం, వాటికి ఉప్పు, కారం అద్ది తినడం అందరికీ మధుర జ్ఞాపకమే. కానీ ఆ జ్ఞాపకాన్ని ఒక ఇంజినీర్ భారీ వ్యాపారంగా మార్చారు. కర్ణాటకలోని బైలహొంగల పట్టణానికి చెందిన గిరీశ్ హలసగి అనే ఇంజినీర్ చింతపండుతో 'చాకో' తయారు చేశారు. దీని కోసం ఆయన ఏకంగా రూ.600 కోట్ల జాబ్ ఆఫర్‌ను తిరస్కరించారు. తొమ్మిదేళ్ల కష్టానికి ఫలితంగా ఇప్పుడు ఆయన తయారు చేసిన 'ఇమ్లీ చాకో'కు పేటెంట్ లభించింది. చింతపండు చాకోకు పేటెంట్ పొందిన 'మొదటి భారతీయుడు'గా గిరీశ్ రికార్డు సృష్టించారు.

రూ.600 కోట్ల ఆఫర్ రిజెక్ట్
గిరీశ్ హలసగి నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన రిటైర్డ్ టీచర్ మహదేవప్ప, వీరమ్మ దంపతుల కుమారుడు. 2002లో బాగల్‌కోట్‌లోని బసవేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఈ (ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) పూర్తి చేశారు. గిరీశ్ ఎస్ఎస్ఎల్‌సీ, పీయూసీ, ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలిచారు. 2013-14లో ఆయన ప్రతిభను గుర్తించిన ఒక కంపెనీ ఏకంగా రూ.600 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ గిరీశ్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. 'నా టాలెంట్ నా సొంత ఊరికి ఉపయోగపడాలి. రూ.600 కోట్లు పెద్ద మొత్తమే కావచ్చు. కానీ నా కల రూ.1000 కోట్లు సాధించడం' అని ఆయన బలంగా నిర్ణయించుకున్నారు.

9 ఏళ్ల శ్రమ, పేటెంట్ విజయం
గిరీశ్ తన ప్రయాణాన్ని సాదాసీదాగా మొదలుపెట్టలేదు. చింతపండుకు తగిన గుర్తింపు రావడం లేదని గ్రహించి, 2016లో పరిశోధనలు ప్రారంభించారు. దాదాపు నాలుగున్నరేళ్లు ప్రయోగాలు చేశారు. చింతపండు, ఉప్పు, మిరియాలు, బెల్లం, జీలకర్ర వంటి సహజ పదార్థాలతో 'చాకో' తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 లక్షలు అప్పు చేశారు. 2021లో పేటెంట్ కోసం దరఖాస్తు చేయగా, 2025 ఏప్రిల్ 25న అధికారికంగా పేటెంట్ లభించింది.

TAMARIND CHOCO GETS A PATENT
చింతపండుతో 'చాకో' (ETV Bharat)

చాక్లెట్‌లా ఆకర్షణీయమైన ప్యాకింగ్
సాధారణంగా చింతపండు గుజ్జును పుల్లలకు చుట్టి అమ్ముతారు. కానీ గిరీశ్ దాన్ని మార్చేశారు. 'ఇమ్లీ చాకో'ను చిన్న చిన్న బాక్సుల్లో, రంగురంగుల అల్యూమినియం ఫాయిల్స్‌లో చాక్లెట్‌లా ప్యాక్ చేశారు. ఇది చూడగానే పిల్లలను, పెద్దలను ఆకర్షిస్తోంది. ఎగ్జిబిషన్లలో గిరీశ్​ను పిల్లలు ప్రేమగా 'చాకో అంకుల్' అని పిలుస్తుంటారు.

TAMARIND CHOCO GETS A PATENT
చింతపండుతో 'చాకో' (ETV Bharat)

17 దేశాలకు ఎగుమతి
గిరీశ్ తయారు చేసిన ఈ దేశీ ఉత్పత్తి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. అమెరికా, ఇంగ్లండ్, ఇటలీ, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, జర్మనీ సహా మొత్తం 17 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. విదేశాల్లో ఉండే భారతీయులు ఇక్కడికి వచ్చినప్పుడు వీటిని భారీగా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, దిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ దీనికి మంచి డిమాండ్ ఉంది. పేటెంట్ వచ్చిన తర్వాత డిమాండ్ మరింత పెరిగిందని గిరీశ్ తెలిపారు.

మహిళలకు ఉపాధి
వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతను కూడా గిరీశ్ నెరవేరుస్తున్నారు. 'ఆశా హోమ్ ఎంప్లాయ్‌మెంట్' పేరుతో స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం 9 మంది మహిళలు ఇందులో పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.10,000 వరకు జీతం ఇస్తున్నారు. గిరీశ్ భార్య ఆశ కూడా భర్తకు తోడుగా నిలిచి వ్యాపారంలో సహకరిస్తున్నారు.

IMLI CHOCO PATENT
చింతపండుతో 'చాకో' తయారు చేస్తున్న మహిళలు (ETV Bharat)

ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
ఈ చాకో కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదని గిరీశ్ చెబుతున్నారు. "ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడానికి, చర్మ కాంతికి ఇది ఉపయోగపడుతుంది" అని ఆయన చెప్పారు. గర్భిణీలకు వాంతులు, వికారం తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు.

IMLI CHOCO PATENT
చింతపండుతో 'చాకో' తయారు చేస్తున్న మహిళలు (ETV Bharat)

భవిష్యత్ లక్ష్యం
"ప్రపంచంలో అత్యధిక చింతపండు పండించేది మనమే. కానీ పేటెంట్లు మాత్రం జపాన్, అమెరికా వాళ్ల దగ్గర ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి. భవిష్యత్తులో బైలహొంగలలో ఒక ఎంఎన్‌సీ కంపెనీని స్థాపించడమే నా లక్ష్యం" అని గిరీశ్ హలసగి చెప్పారు. "థింక్ లోకల్ - గో గ్లోబల్" అనే నినాదాన్ని ఆయన నిజం చేసి చూపిస్తున్నారు.

కంటైనర్​లో కుంకుమ పువ్వు సాగు- ఒడిశా మహిళకు ఏటా రూ.లక్షల్లో ఆదాయం

ప్రభుత్వ వర్సిటీ సత్తా - సొంతంగా ‘హెర్బల్ టీ’ ఫార్ములాలు - క్యాంపస్‌లోనే స్టార్టప్‌ టీ -మార్కెట్‌లోకి ఎంట్రీ