ETV Bharat / bharat

బిహార్‌లో ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం- ఓటింగ్ రికార్డు బద్ధలవుతుందా?

నేటితో ముగిసిన బిహార్‌ రెండో విడత ఎన్నికల ప్రచారం- ఎల్లుండి రెండో విడత ఎన్నికల పోలింగ్

Bihar Polls 2025
Bihar Polls 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 9, 2025 at 5:51 PM IST

|

Updated : November 9, 2025 at 6:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

Bihar Polls Campaign Ended : బిహార్‌లో రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీకి ఈ నెల 11న 20 జిల్లాల పరిధిలోని మిగితా 122 సీట్లకు ఓటింగ్‌ జరగనుంది. ఈనెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో తొలిదశ పోలింగ్‌ జరిగింది. ఈసారి అధికార ఎన్డీయే, మహాగఠ్‌బంధన్‌ మధ్య గట్టిపోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష కూటములు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్డీయే తరఫున ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు బహిరంగసభల్లో పాల్గొన్నారు. మహాగఠ్‌బంధన్‌ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, ఆర్జేడీ అగ్రనేత, మహాగఠ్‌బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మరోవైపు జన్​ సురాజ్​ పార్టీ తరఫున ప్రశాంత్ కిశోర్​, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మాయావతి, ఏఐఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఒవైసీ కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈసారి ఎంత మంది ఓట్లు వేస్తారు?
బిహార్​ రెండో దశ పోలింగ్​లో 3 కోట్ల 70 లక్షలకు పైగా ఓటర్లు 1,302 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో పురుష ఓటర్లు సుమారుగా 1.95 కోట్లు, మహిళా ఓటర్లు సుమారుగా 1.74 కోట్ల మంది ఉన్నారు. ఈసారి 20 జిల్లాల్లోని మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, వాటిలో 101 జనరల్ సీట్లు కాగా, 21 రిజర్వ్​ సీట్లు. వీటిలో షెడ్యూల్డ్ కులాలకు 19 సీట్లు, షెడ్యూల్డ్ తెగలకు 2 సీట్లు రిజర్వ్ చేశారు.

బరిలో ఎంత మంది ఉన్నారు?
ఎన్నికల సంఘం ప్రకారం, రెండో దశ ఎన్నికల్లో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో చాలా మంది అభ్యర్థులు మూడేసి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఇక కైమూర్​లోని చైన్పూర్, రోహ్​తాస్​లోని ససారాం, గయాలోని గయా సిటీలో ఏకంగా 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు తూర్పు చంపారన్​లోని లోరియా, చాన్​పాటియా, రక్సౌల్​, సుగౌలి, సుపాల్​లోని త్రివేణిగంజ్, పూర్ణియాలోని బన్మంఖిల్లో అత్యల్పంగా, ఒక్కో అసెంబ్లీ స్థానానికి 5 మంది చొప్పున పోటీ చేస్తున్నారు.

45,399 పోలింగ్ స్టేషన్స్​
ఎన్నికల సంఘం ప్రకారం, రెండో దశ ఎన్నికల కోసం 45,399 బూత్​లు ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40,073 బూత్​లు, పట్టణ ప్రాంతాల్లో 5,326 బూత్​లు ఉన్నాయి. వీటిలో 45,388 జనరల్ బూత్​లు ఉండగా, 11 సహాయక బూత్​లు ఉన్నాయి. రెండో దశ ఎన్నికల్లో మొత్తం 3,70,13,556 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మొదటి సారి ఓటు హక్కు పొందిన వారు 7,69,356 మంది. అలాగే 943 మంది థర్డ్ జెండర్లు, 43 మంది ఎన్​ఆర్​ఐ ఓటర్లు కూడా ఉన్నారు. ఇక 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు 6,255 మంది ఉండగా, సర్వీసు ఓటర్ల సంఖ్య 63,373.

హేమాహేమీల భవితవ్యం తేలనుంది!
రెండో దశ పోలింగ్​లో హేమాహేమీ రాజకీయ నేతల భవితవ్యం తేలనుంది. ముఖ్యంగా నీతీశ్ కుమార్​కు అత్యంత సన్నిహితులైన మంత్రులు విజేంద్ర ప్రసాద్​ యాదవ్​, లేసీ సింగ్, రేణుదేవి, షీలా మండల్​, జామాఖాన్​ మొదలైనవారు ఉన్నారు. అయితే ఈసారి బిహార్ ఎన్నికల్లో ఎన్​డీఏ, మహాగఠ్​బంధన్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే జన్​ సురాజ్​, ఏఐఎంఐఎం కూడా అనేక స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఓటింగ్ రికార్డు బద్ధలవుతుందా?
నవంబర్​ 6న 121 స్థానాలకు జరిగిన మొదటి దశ పోలింగ్​లో రికార్డు స్థాయిలో 65 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. కనుక ఇప్పుడు రెండో దశ పోలింగ్​పై అందరి దృష్టి పడుతోంది. మరి ఈసారి ఓటింగ్ రికార్డు బద్దలవుతుందో, లేదో చూడాలి. కాగా, ఈనెల 11న ఓటింగ్ జరగనుండగా, 14న బిహార్‌ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

'బిహార్​లో చొరబాటుదారుల కారిడార్​ నిర్మాణానికి ప్రయత్నాలు'​- విపక్షాలపై అమిత్​ షా ఫైర్​

ప్రధాన సమస్య ఓట్​ చోరీ- SIR అనేది దానిని కప్పిపుచ్చే ప్రయత్నం: రాహుల్

Last Updated : November 9, 2025 at 6:09 PM IST