తేరే మేరే సప్నే:పెళ్లికి ముందే వధూవరులకు కౌన్సెలింగ్- గృహ హింస, విడాకుల కేసులు తగ్గించేందుకు వినూత్న కార్యక్రమం
పరస్పర గౌరవం, సహనభావంపై వధూవరులకు కౌన్సెలింగ్- వైవాహిక జీవితంపై పెళ్లికి ముందే జంటలకు అవగాహన- మున్సిపల్ కార్పొరేషన్ డివిజనల్ కమిషనర్ చొరవతో 'తేరే మేరే సప్నే' కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు

Published : January 7, 2026 at 3:04 PM IST
Tere Mere Sapne Counseling Center : వివాహ బంధం బలహీనపడుతోంది. గృహ హింస, విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న అభిప్రాయబేధాలే వీటికి ప్రధాన కారణం. వైవాహిక జీవితంలోని సవాళ్లు, ఎగుడుదిగుడుల గురించి పెళ్లికి ముందే వధూవరులకు అవగాహన కల్పిస్తే గృహ హింస, విడాకుల కేసులను తగ్గించొచ్చని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజనల్ కమిషనర్ డాక్టర్ ప్రతిభా సింగ్ అనుకున్నారు. ఈ ఆలోచనకు తొలిసారిగా ఆచరణ రూపాన్ని ఇచ్చారు. పెళ్లి నిశ్చయమైన వధూవరులకు వైవాహిక జీవితంలోని సాధకబాధకాల గురించి, సామరస్యపూర్వకంగా జీవితాన్ని సాగించడంపై అవగాహన కల్పించేందుకు 'తేరే మేరే సప్నే' పేరుతో ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఎలా పనిచేస్తోంది? వధూవరులకు ఏయే అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు? మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా వారిని వివాహ జీవితానికి ఎలా సన్నద్ధం చేస్తున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆందోళనకర స్థాయిలో గృహ హింస కేసులు
గత కొన్నేళ్లుగా మన దేశంలో గృహ హింస, విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే ఈ కేసులకు ప్రధాన కారణమని న్యాయ నిపుణులు అంటున్నారు. కొన్ని కేసుల్లో గొడవ పడుతున్న భార్యాభర్తలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇరు కుటుంబాల పెద్దల వైపు నుంచి సరైన ప్రయత్నాలు జరగడం లేదని చెబుతున్నారు. భర్త పరిస్థితిని భార్య, భార్య మానసిక స్థితిని భర్త సామరస్యంగా, ప్రశాంత చిత్తంతో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఈ తరహా వివాదాలు తగ్గిపోతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మచ్చుకు చూస్తే, రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్ కమిషనరేట్ పరిధిలోని తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్‌లలో ఈ ఏడాది (2026) మొదటి 6 రోజుల్లోనే గృహ వివాదాలకు సంబంధించిన 10 కేసులు నమోదయ్యాయి. ప్రతి సంవత్సరం ఈ రెండు జిల్లాల్లోని నగర, గ్రామీణ పోలీస్ స్టేషన్‌లలో సగటున 3,000కుపైగా గృహ హింస కేసులు నమోదవుతున్నాయి. దేశానికి పునాది లాంటి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేలా, వైవాహిక జీవితాలకు సవాల్ విసిరేలా ఈ కేసుల గణాంకాలు ఉన్నాయి.

విప్లవాత్మక నిర్ణయం : 'తేరే మేరే సప్నే'
ఆందోళనకరంగా ఉన్న గృహ హింస, విడాకుల కేసుల గణాంకాలను జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజనల్ కమిషనర్ డాక్టర్ ప్రతిభా సింగ్ విశ్లేషించి చూసి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. వధూవరులకు వివాహానికి ముందే కౌన్సెలింగ్ చేస్తే పరిస్థితి కాస్తయినా అదుపులోకి వస్తుందని ఆమె భావించారు. 2025 నవంబరు మూడోవారంలో జోధ్‌పూర్‌లో 'తేరే మేరే సప్నే' పేరుతో ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. జిల్లా కలెక్టరేట్‌లోని మహిళా సాధికారతా శాఖ కార్యాలయానికి దీని నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ సెంటర్‌లో గత 45 రోజుల వ్యవధిలో వధూవరుల ఏడు జంటలకు కౌన్సెలింగ్ చేశారు. అనంతరం వాళ్లందరికీ పెళ్లిళ్లు జరిగాయి. ఈ సెంటర్ గురించి అంగన్‌వాడీ కేంద్రాలు, సామూహిక వివాహ వేదికలు, వివాహ రిజిస్ట్రేషన్ కేంద్రాలు, పెళ్లి సంబంధాలు కుదిర్చే బ్యూరోల కార్యాలయాల ద్వారా ముమ్మర ప్రచారం చేస్తున్నారు.

'తేరే మేరే సప్నే' : కౌన్సెలింగ్ ఇలా
• అత్తవారింటిలోని పెద్దల మాట వినాలని, అయితే అవసరమైన చోట అభిప్రాయాన్ని వ్యక్తపరచాలని పెళ్లి చేసుకోబోతున్న యువతికి చెబుతారు.
• అత్తవారింటిలో ఇతరుల మనసుకు బాధ కలిగించే మాటలను వాడొద్దని యువతికి సూచిస్తారు.
• ఇంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు భర్త ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని యువతికి చెబుతారు. తద్వారా భర్తతో విభేదాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయని కౌన్సెలింగ్ చేస్తారు.
• భార్యను గౌరవించాలని, ఆమె మాటను కూడా పరిగణనలోకి తీసుకోవాలని యువకుడికి చెబుతారు.
• ఇద్దరూ కలిసి కూర్చొని జీవితంలో రాబోయే దశల గురించి సామరస్యంగా చర్చించుకోవాలని యువకుడికి సూచిస్తారు.
• ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ జరిగితే, దాన్ని తమలో తామే పరిష్కరించుకోవాలని యువకుడికి చెబుతారు.
• పెద్ద ఉమ్మడి కుటుంబంలో జీవించే క్రమంలో ఎలా వ్యవహరించాలి ? ఆలోచనా విధానం ఎలా ఉండాలి ? అందరితో ఎలా ప్రవర్తించాలి ? అనే అంశాలపై వధూవరులకు చిట్కాలు ఇస్తారు.
• వైవాహిక జీవితం కోసం శారీరకంగా, మానసికంగా, ఉద్వేగపరంగా వధూవరులను సన్నద్ధం చేసేలా ఈ కౌన్సెలింగ్ ఉంటుంది.
• వివాహ జీవితంపై వధూవరులకు ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలు, అపోహలను తెలుసుకొని, వాటిని కౌన్సెలింగ్ నిపుణులు నివృత్తి చేస్తారు. తద్వారా వారి ఆలోచనా విధానంలో మార్పును తెస్తారు.
వధూవరుల కమ్యూనికేషన్‌కు బాటలు వేయడమే లక్ష్యం
'పెళ్లికి ముందే వధూవరులను మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా సిద్ధం చేయడమే తేరే మేరే సప్నే ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ సెంటర్ లక్ష్యం. ఈ కౌన్సెలింగ్ వల్ల భార్యాభర్త కాబోయే యువతీ యువకుల ఆలోచనా విధానంలో పరిపక్వత వస్తుంది. వారు తీసుకునే జీవిత నిర్ణయాల్లో సామరస్య భావన ఉంటుంది. కౌన్సెలింగ్ సెంటర్‌లో కౌన్సెలర్ సమక్షంలో వధువు, వరుడు కూర్చొని కూలంకషంగా మాట్లాడుకుంటారు. మేం చెప్పిన అంశాలపై చర్చించుకుంటారు. దీనివల్ల వారి వైవాహిక జీవితాలు సాఫీగా సాగుతాయి. మనదేశంలో బలమైన కుటుంబ వ్యవస్థకు పునాది పడుతుంది. గృహ హింస, విడాకుల కేసులు తగ్గుతాయి' అని జోధ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజనల్ కమిషనర్ డాక్టర్ ప్రతిభా సింగ్ పేర్కొన్నారు.
వివాహ జీవితపు వాస్తవాలపై అవగాహన కల్పిస్తాం
'పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోని కీలక ఘట్టం. తమ వివాహ జీవితం బాగుండాలని, ఆనందమయంగా సాగాలని అందరూ కలలు కంటారు. ఆ కలలను సాకారం చేసేందుకు తేరే మేరే సప్నే ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ సెంటర్ దోహదపడుతుంది. మా సెంటర్‌కు వచ్చే వధూవరులను పక్కపక్కన కూర్చోబెట్టి, వివాహ జీవితంతో ముడిపడిన వాస్తవాల గురించి వివరిస్తాం. ఇద్దరి మధ్య అన్యోన్యత తగ్గకుండా ఎలా జీవించాలో సూచనలు ఇస్తాం. అత్తవారింటిలో ఎలా మసులుకోవాలో యువతులకు చెబుతాం. భార్య అభిప్రాయాన్ని కూడా గౌరవించాలని యువకులకు సూచిస్తాం. ఏదైనా అంశంపై ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడితే, సామరస్యంగా కూర్చొని చర్చించుకోవాలని చెబుతాం. ఇప్పటిదాకా ఏడు జంటలకు కౌన్సెలింగ్ చేశాం' అని జోధ్‌పూర్‌లోని తేరే మేరే సప్నే ప్రీ మ్యారేజ్ కౌన్సెలింగ్ సెంటర్ కౌన్సెలర్ జాగృతి కల్లా పేర్కొన్నారు.

