జల్లికట్టును పోరాడి నిలుపుకున్న తమిళులు- క్రీస్తు పూర్వం నుంచి నేటిదాకా 3,000 ఏళ్ల జల్లికట్టు ప్రస్థానం ఇదే
సంప్రదాయ క్రీడను పోరాడి కాపాడుకున్న తమిళులు- 2014లో జల్లికట్టును బ్యాన్ చేసిన సుప్రీంకోర్టు- 2017లో రాత్రికి రాత్రి చట్టం చేసిన తమిళనాడు సర్కారు- అప్పటి నుంచే జల్లికట్టు పోటీలకు చట్టపరమైన అనుమతులు-

Published : January 15, 2026 at 3:09 PM IST
HOW Jallikattu Broke Barriers : తమిళులు తమ భాషతో పాటు సంప్రదాయాలనూ పదిలంగా కాపాడుకుంటున్నారు. తమ సంప్రదాయ క్రీడ 'జల్లికట్టు' పరిరక్షణ కోసం వాళ్లు పెద్ద పోరాటాన్నే చేశారు. 2014 మేలో 'జల్లికట్టు' పోటీలపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది. దీంతో ఓ వైపు కోర్టుల్లో న్యాయపోరాటం, మరోవైపు వీధుల్లో నిరసనలు చేశారు. చివరకు 2017లో 'జల్లికట్టు' పోటీలకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. నాటి నుంచి చట్టపరంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. వాస్తవానికి 'జల్లికట్టు' క్రీడతో తమిళులకు గత 3000 ఏళ్లుగా అనుబంధం ఉంది. వాళ్లు జల్లికట్టు ఎద్దులతోనూ ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ను కలిగి ఉంటారు.
కొందరైతే తమ జల్లికట్టు ఎద్దులు చనిపోతే, విగ్రహాలు చేయించి మరీ పూజిస్తున్నారు. జల్లికట్టు పోటీల్లో శౌర్యాన్ని చాటిన ఓ యోధుడికి ఏకంగా గుడిని కట్టేశారు. తమిళనాడులోని పలు ఆలయాలు తమ ఎద్దులు, ఆవులు చనిపోతే, వాటి పేరిట విగ్రహాలను ఏర్పాటు చేయిస్తాయి. ఇంతకీ జల్లికట్టు ఎలా మొదలైంది? తమిళులు దానికి ఎందుకు ఆకర్షితులయ్యారు? జల్లికట్టు ఎద్దులపై వారికి ప్రేమ ఎందుకు? చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయి? ఈ కథనంలో చూద్దాం.

జల్లికట్టు ప్రస్థానం ఇలా మొదలైంది!
3వేల ఏళ్ల క్రితం తమిళనాడులో పశువుల కాపరులుగా పనిచేసే ఒక తెగ ఉండేది. దాని పేరే 'అయార్' తెగ. రాష్ట్రంలోని ముళ్లయి అనే ప్రాంతంలో ఉన్న అడవుల సమీపంలో వారు జీవించేవారు. వారు ఏటా ఒకసారి తమ సాహస పరాక్రమాలను చాటుకునేందుకు పొగరుబోతు ఎద్దులను మచ్చిక చేసుకునే పోటీలను నిర్వహించేవారు. తద్వారా ఆ ఎద్దులకు చేరువ అయ్యేవారు. ఈ వివరాల ప్రస్తావన తమిళ ప్రాచీన సాహిత్యంలోనూ ఉంది. క్రీస్తు పూర్వం 400 నుంచి 100 మధ్యకాలంలో 'అయార్' తెగ ప్రజలు జల్లికట్టు క్రీడకు శ్రీకారం చుట్టారని చరిత్రకారులు చెబుతున్నారు. ఎద్దును మనిషి మచ్చిక చేసుకుంటున్న ఒక పురాతన పెయింటింగ్ మదురై జిల్లాలోని ఓ ప్రాచీన గుహపై ఉంది. అది దాదాపు 2,500 సంవత్సరాల కిందటిది అని చరిత్ర పరిశోధకులు గుర్తించారు. 'సిలప్పతికరం' అనే తమిళ ఇతిహాసంలోనూ ఎద్దులను మచ్చిక చేసుకునే అంశంపై ప్రస్తావనలు ఉన్నాయి. పాకిస్థాన్‌లోని మొహంజోదారోలో చరిత్రకారులకు లభ్యమైన ఒక ప్రాచీన ముద్రపైనా ఎద్దును మచ్చిక చేసుకునే చిత్రం ఉండటం గమనార్హం. ఆ ముద్ర కూడా దాదాపు 2,500 ఏళ్లు పాతదే.

క్రీస్తు పూర్వం నుంచే సాహస క్రీడలపై అభిరుచి!
క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్యకాలంలో తమిళనాడులో సాహిత్య విప్లవం జరిగింది. ఈ వ్యవధిలో ప్రజల్లోకి వచ్చిన గ్రంధాలు, ఇతిహాసాలు, ప్రముఖ ఆధ్యాత్మిక రచనలను 'సంగం' సాహిత్యం అంటారు. 'సంగమం' అనే పదం నుంచే 'సంగం' అనే పదం ఏర్పడింది. చాలా రకాల సాహితీ ప్రక్రియలు, రచనలు వెలువడిన కాలం కావడంతో దాన్ని 'సంగం యుగం' అని పిలిచారు. ఆనాటి ప్రాచీన కవితా గ్రంధం పేరు 'కలిత్తోకై'. అటవీ ప్రాంతాల్లో నివసించే తమిళుల జీవనశైలి గురించి అందులో వర్ణనలు ఉన్నాయి. వారు పశువులను ప్రేమగా పెంచుకునేవారని అందులో ప్రస్తావించారు. తమిళులు ‘పర్వతారోహణ’ చేసేవారని, దాన్ని వారు ఒక క్రీడగా పరిగణించే వారని 'కలిత్తోకై' గ్రంధంలోని 'ముల్లైకలి' అనే భాగంలో ఉన్న 7 పాటల్లో రాసి ఉంది. ఈ లెక్కన సాహస క్రీడలు అంటే తమిళులకు ప్రాచీన కాలం నుంచే అభిరుచి. ఇది వారి సంప్రదాయాల్లో ఒక భాగంగా మారింది.

తమిళ సంస్కృతిలో భాగంగా ఆవులు, ఎద్దులు
ప్రాచీన తమిళ కవి తిరువళ్లువార్ రచించిన గ్రంధం పేరు 'తిరుక్కురల్'. ఈ గ్రంధంలో 'కేడిల్ విలు చెల్వం' అనే కీలకమైన పదబంధం ఉంది. దీని ప్రకారం, ఆవు అనేది సంపదను ప్రసాదించే జీవి. ఆవును, సంపదను వేరుగా చూడలేమని ఈ గ్రంధం చెప్పింది. అందుకే ఇప్పటికీ తమిళనాడులోని పలు వర్గాల ప్రజలు కోడలిని ప్రేమగా 'మదుప్పెన్' అని పిలుస్తారు. తమిళంలో 'మదు' అంటే 'ఎద్దు' అనే అర్థం కూడా వస్తుంది. దీన్నిబట్టి ఎద్దులు, ఆవులతో తమిళనాడు సంస్కృతి ఎంతగా అటాచ్ అయిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. నేటికీ ఆ రాష్ట్రంలోని చాలా గ్రామాల నుంచి పట్టణాల దాకా స్థానిక రవాణా అవసరాలకు ఎద్దుల బండ్లను విరివిగా వినియోగిస్తున్నారు. దీనివల్ల ఏటా లక్షల టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు ఆదా అవుతున్నాయి. దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం మిగులుతోంది.
జల్లికట్టు ఎద్దులకు, యోధులకు విగ్రహాలు
- రాష్ట్రంలోని మదురై, తిరుచ్చి, పుదుక్కొట్టై, శివగంగ జిల్లాల్లోని ఆలయాలకు పెద్దసంఖ్యలో గోశాలలు ఉన్నాయి. వీటిలోని ఆవులు, ఎద్దులు చనిపోతే ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తుంటారు. ఈ ఆచారం ప్రాచీన కాలం నుంచే వస్తోంది.
- మదురై సమీపంలోని సోరికంపట్టి గ్రామంలో అళగతేవర్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ఎన్నోసార్లు జల్లికట్టు పోటీల్లో పాల్గొని మంచిపేరు తెచ్చుకున్నాడు. తన శక్తిసామర్థ్యాలతో ఎన్నో ఎద్దులను మచ్చిక చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే అళగతేవర్‌కు సోరికంపట్టి గ్రామస్థులు ఒక ఆలయాన్ని నిర్మించారు. అందులో అళగతేవర్, అతడి ఎద్దు విగ్రహాలను ప్రతిష్ఠించారు. వాటికి నేటికీ గ్రామస్థులు భక్తితో పూజలు చేస్తున్నారు.
- పొంగల్ (సంక్రాంతి) పండుగలో మూడో రోజును మట్టు పొంగల్ అంటారు. ఏటా ఆ రోజున (జనవరి 16న) కీజక్కుయిల్గుడి అనే గ్రామంలో జల్లికట్టు ఎద్దు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.
- మదురై జిల్లాలోని మేలూర్‌కు చెందిన 'చెల్ కన్నన్' జల్లికట్టు ఎద్దులను పెంచేవాడు. వీటిలో ఒక ఎద్దు చనిపోయింది. దీంతో అతడు ఆ ఎద్దు పేరిట ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఇప్పటికీ పూజిస్తున్నాడు.
- తమిళనాడు ప్రభుత్వం మదురై జిల్లా అలంగనల్లూరు సమీపంలోని కీళకరై గ్రామంలో జల్లికట్టు పోటీల కోసం ప్రత్యేక ఎరీనాను ఏర్పాటు చేసింది.
జైరాం రమేశ్ సంచలన నిర్ణయం:
సుప్రీంకోర్టు బ్యాన్ 2011లో నాటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జల్లికట్టు ఎద్దులను ప్రదర్శించడం, వాటికి శిక్షణ ఇవ్వడంపై బ్యాన్ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రదర్శన, శిక్షణ నిషేధించిన జంతువుల జాబితాలో జల్లికట్టు ఎద్దులను చేర్చామని వెల్లడించారు. అనంతరం ఈ వ్యవహారం కోర్టులకు చేరింది. అప్పటి కేంద్ర సర్కారు నిర్ణయంపై తమిళనాడులోని జల్లికట్టు ప్రేమికులు మండిపడ్డారు. ఈ విధంగా 2011 నుంచి 2014 మధ్యకాలంలో చాలా పరిమితుల నడుమ రాష్ట్రంలో జల్లికట్టు పోటీలను నిర్వహించారు. 2014 మేలో జల్లికట్టుపై భారత సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది. ఆ పోటీల నిర్వహణ అనేది జంతువులతో క్రూరంగా ప్రవర్తించడాన్ని నిరోధించే 'పీసీఏ చట్టానికి' వ్యతిరేకమని భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ ఆదేశాలనూ తదుపరిగా కోర్టులోనే సవాలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశంపై 2014 మే నుంచి 2017 జనవరి వరకు తమిళనాడులో నిరసనలు కొనసాగాయి. విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ నిరసనల్లో భాగమయ్యారు. జల్లికట్టు తమ సంప్రదాయ క్రీడ అని తమిళులు నినదించారు.
నిరసనల ఎఫెక్ట్
రాత్రికి రాత్రే అత్యవసర చట్టం 2017 జనవరిలో మదురై జిల్లాలోని వైగై నది సమీపంలో రైలు పట్టాలపై ప్రజలు నిరసనకు దిగారు. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులపై కేసులు నమోదు చేశారు. జల్లికట్టు నిరసనల సందర్భంగా జరిగిన హింసపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ న్యాయమూర్తి ఎస్.రాజేశ్వరన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను నాటి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జల్లికట్టు నిరసనకారులలోకి సామాజిక వ్యతిరేక శక్తులు చొరబడటం వల్లే హింస జరిగిందని కమిషన్ తేల్చింది. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంలో తప్పేమీ లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో 2017లోనే నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేస్తూ అత్యవసర చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం రాష్ట్ర అధికార పక్షం, ప్రతిపక్షాలు రాత్రికి రాత్రే ఉమ్మడి శాసనసభ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. తదుపరిగా ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా లభించింది. ఈ విధంగా 2017 నుంచి చట్టపరంగా జల్లికట్టు జరుగుతోంది.
హింస vs పరిరక్షణ
జల్లికట్టు పోటీలతో ఎద్దులను హింసిస్తున్నారని 'పెటా' లాంటి పలు జంతు పరిరక్షణ సంస్థలు ఆరోపిస్తున్నాయి. కానీ తాము ప్రత్యేక జాతుల ఎద్దుల ఉనికిని కాపాడుతున్నామని తమిళులు వాదిస్తున్నారు. జల్లికట్టు లాంటి పోటీల వల్లే ఆ జాతి ఎద్దుల పెంపకం నేటికీ కొనసాగుతోందని అంటున్నారు. దీనివల్ల గ్రామీణ స్థాయిలో ఎంతోమందికి ఉపాధి కూడా లభిస్తోందని చెబుతున్నారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన తమ సంప్రదాయంలో కీలక భాగమైన జల్లికట్టు క్రీడను వదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. జల్లికట్టు పోటీలు నిర్దిష్ట ప్రొటోకాల్స్ ప్రకారమే జరుగుతాయనే విషయాన్ని నిర్వాహక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. పోటీ జరిగే క్రమంలో ఎద్దుల తోకలు, కొమ్ములను ఆటగాళ్లు పట్టుకోకూడదని తెలిపాయి. ఎద్దు కాళ్లను పట్టుకోవడం, పరుగెత్తకుండా కాళ్లను అడ్డుకోవడం వంటి చేష్టలు చేయకూడదని పేర్కొన్నాయి.
ఈ ఏడాది జల్లికట్టు పోటీలు షురూ- భారీగా రిజిస్ట్రేషన్లు
తమిళనాడులోని మదురై జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జల్లికట్టు పోటీలు జరుగుతుంటాయి. తాజాగా గురువారం రోజు ఈ జిల్లాలోని అవనియపురంలో జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు మూర్తి, పళనివేల్ త్యాగరాజన్ ఈ పోటీలను ప్రారంభించారు. మదురైతో పాటు విరుధు నగర్, శివ గంగ, రామనాథపురం, థేనీ, దిండిగల్, తిరుచ్చి జిల్లాల నుంచి కూడా ఔత్సాహికులు తమ ఎద్దులతో అవనియపురానికి తరలివచ్చారు. ప్రతీ గంటలకు ఎంట్రీ గేటు నుంచి 80 నుంచి 90 ఎద్దులను జల్లికట్టు మైదానంలోకి వదిలేందుకు ఏర్పాట్లు చేశారు. అవనియపురంలో పోటీలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. భద్రత కోసం 2వేల మంది పోలీసులను మోహరించారు. ఈ సంవత్సరం మదురై జిల్లాలో జరిగే జల్లికట్టు పోటీల్లో పాల్గొనడానికి 15,047 ఎద్దులు, 5,234 మంది పోరాట యోధులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. 2025 కంటే కంటే ఈ సంవత్సరం 2,415 ఎద్దులు, 735 మంది పోరాట యోధులు ఎక్కువగా నమోదు చేసుకున్నారని మదురై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఏటా జల్లికట్టుపై యువతకు ఆసక్తి పెరుగుతోందనే అంశాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
ఎద్దుల జాతులను కాపాడేందుకే జల్లికట్టు పోటీలు
"తమిళనాడులోని స్థానిక ఎద్దుల జాతుల ఉనికిని కాపాడేందుకే జల్లికట్టు పోటీలను నిర్వహిస్తున్నారు. 2014లో జల్లికట్టుపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించడంతో, ఈ ఎద్దుల జాతులు అంతరించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆనాటి నుంచి చాలా మంది వాటిని పెంచడం ఆపేశారు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో మేం పలుచోట్ల జల్లికట్టు పోటీల్లో గెలిచిన యోధులకు ఎద్దు దూడలను బహుమతులుగా ఇచ్చాం. 2016లో జల్లికట్టు కోసం తమిళులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వమే అత్యవసర చట్టాన్ని తీసుకొచ్చింది. జల్లికట్టును చట్టపరంగా నిర్వహించుకునే వీలును కల్పించింది. ఇప్పుడు మా రాష్ట్రంలో ఎద్దుల ధరలు పెరిగాయి. వాటిని పెంచే వారికి మంచి లాభాలు వస్తున్నాయి. ఒక్కో జల్లికట్టు ఎద్దు ధర లక్షల్లో ఉంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అంశం" అని తమిళనాడు జల్లికట్టు సంఘం అధ్యక్షుడు పి.రాజశేఖరన్ 'ఈటీవీ భారత్'కు తెలిపారు.
ఆ గ్రామంలో పెళ్లి రోజు 'మందు' బ్యాన్- దుబారా ఖర్చులను అరికట్టేందుకు వినూత్న నిర్ణయం
పాక్, అఫ్గాన్‌లో కైట్ ఎగరేస్తే నేరమా? అసలు పతంగి ఎక్కడ పుట్టింది? ప్రపంచ దేశాలకు ఎలా చేరింది?

