'కాంగ్రెస్ ఒక వెన్నుపోటుదారు, నమ్మకం లేని భాగస్వామి'- TVKకి మద్దతుపై డీఎంకే ఫైర్
కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని దూరదృష్టి లేనిదిగా అభివర్ణించిన డీఎంకే- వారు చూపిన కారణాలు ఏమాత్రం విశ్వసనీయంగా లేవని వ్యాఖ్య

Published : May 6, 2026 at 10:14 AM IST
Tamilnadu Election Results : తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, డీఎంకేల మధ్య అత్యంత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పొత్తు తెగిపోయే దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ఇండీ కూటమిలోని చీలికలు బహిరంగంగా మారాయి. డీఎంకే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై చేసిన వ్యాఖ్యలు బలాన్నిస్తున్నాయి. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని దూరదృష్టి లేనిదిగా అభివర్ణించారు. ఇండీ కూటమి భాగస్వాములకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
"కాంగ్రెస్ తీసుకున్న ఈ వైఖరి చాలా స్వల్పదృష్టితో, ఎలాంటి దూరదృష్టి లేకుండా ఉందని నేను భావిస్తున్నాను. దీనికి వారు కచ్చితంగా చింతిస్తారు. 2029లో పెద్ద ఎన్నికలు రాబోతున్నాయి. అందులో బీజేపీని గద్దె దించగలమని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారు చాలా అస్థిరమైన భాగస్వామిగా మారారు. దీంతో కాంగ్రెస్‌ను నమ్మలేమనే అభిప్రాయం దేశవ్యాప్తంగా నెలకొంది. కాంగ్రెస్ పార్టీ TVKకి తమ మద్దతును ప్రకటించింది. అందుకే మేము దీనిని 'వెన్నుపోటు'గా అభివర్ణించాము. కాంగ్రెస్ తమ వైఖరిని మార్చుకుని TVKకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు వారు చూపిన కారణాలు ఏమాత్రం విశ్వసనీయంగా లేవు. బీజేపీ, RSSలను దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు చెబుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ మనస్పూర్తిగా తీసుకున్న నిర్ణయం. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఒక్క రోజులోనే కాంగ్రెస్ ఇంతటి అవిశ్వసనీయ రీతిలో ప్రవర్తించింది. ఇలా ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా బహిరంగంగా వ్యవహరిస్తే అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, ఇతర నాయకులపై ఇది ఎలాంటి ప్రభావం పడుతుంది? మేము కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ నిరాశపరచలేదు"
---శరవణన్ అన్నాదురై, డీఎంకే అధికార ప్రతినిధి
ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు
తమిళనాడులో టీవీకే పార్టీకి 108 సీట్లు రాగా, ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరగా అందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీవీకే అధినేత విజయ్‌కు మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం రాత్రి తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ-PAC అత్యవసరంగా సమావేశమైంది. తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గిరీష్ చోడంకర్ ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి సానుకూలత వ్యక్తం చేశారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అంతకుముందు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ తమ మద్దతు కోరినట్లు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తమిళనాడు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకోవాలని తమ అధిష్టానం తమిళనాడు కాంగ్రెస్ కమిటీని ఆదేశించినట్లు తెలియజేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్, తమిళనాడులో ప్రజలు లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకే తీర్పు ఇచ్చారని స్పష్టం చేసింది. బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
'తమిళనాడు ప్రజలకు జీవితాంతం కృతజ్ఞుడనై ఉంటా'- చారిత్రక విజయంపై TVK చీఫ్ విజయ్ ఎమోషనల్ ట్వీట్
విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు- TVK కూటమి ప్రభుత్వానికి మార్గం సుగమం!

