ETV Bharat / bharat

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఓటమి- టీవీకే అభ్యర్థి చేతిలో పరాజయం

టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో ఓడిపోయిన స్టాలిన్- బాబు ఒకప్పుడు డీఎంకే సభ్యుడే!

Assembly Elections 2026
Assembly Elections 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 4, 2026 at 4:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Assembly Elections 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఓటమి పాలయ్యారు. కొళత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన, టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు చేతిలో పరాజయం చెందారు. హోరాహోరీగా సాగిన పోరులో బాబు 8,795 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్టాలిన్‌కు 74,202 ఓట్లు రాగా, బాబుకు 82,997 ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద పార్టీ కార్యకర్తల సంబరాల మధ్య టీవీకే అభ్యర్థి బాబు తన విజయ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

కొళత్తూరు నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సీఎం స్టాలిన్, ఈ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. 1996 తర్వాత స్టాలిన్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి. 2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి, కొళత్తూరుకు స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఓటమితో డీఎంకే నాయకుడు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించకపోవడం ఇదే మొదటిసారి. ఇది తమిళనాడు రాజకీయ ముఖచిత్రంలో ఒక పెద్ద మార్పుకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉదయనిధి స్టాలిన్‌ విజయం
అటు స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ విజయం సాధించారు. చెపాక్​ స్థానం నుంచి 7140 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మాజీ సీఎం, DMK నేత పన్నీర్‌ సెల్వం బోడినాయకనూర్‌ నియోజకవర్గంలో 6805 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అటు DMK ఓటమి ఖాయం కావడంతో చెన్నైలోని పార్టీ కార్యాలయం వద్ద సంబరాల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తీసివేశారు.

బాబు ఒకప్పుడు డీఎంకే సభ్యుడే
డీఎంకేకు కొలత్తూర్‌ నియోజకవర్గాన్ని కోటగా భావిస్తారు. 2011 నుంచి ఇక్కడ ఆ పార్టీ ఓడింది లేదు. అందుకనే డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించిన ఆయన, తాజా ఎన్నికల్లోనూ గెలుపు తథ్యమనుకున్నారు. కానీ అనూహ్యంగా కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్‌ పార్టీ టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, స్టాలిన్​ను ఓడించిన వీఎస్‌ బాబు సుదీర్ఘకాలంగా డీఎంకేలోనే ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు పురుషవాకం ఎమ్మెల్యేగా ఉండగా, 2011 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పునర్‌ విభజనలో రద్దయ్యింది. అదే సమయంలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉన్న కొలత్తూర్‌లో స్టాలిన్‌ పోటీచేసి విజయం సాధించారు. అయితే మెజార్టీ తక్కువ వచ్చిందని బాబును ప్రశ్నించడంతో ఆయన అన్నాడీఎంకేలో చేరారు. అనంతరం విజయ్ నేతృత్వంలోని టీవీకే తీర్థం పుచ్చుకున్నారు. తాజా ఎన్నికల్లో స్టాలిన్‌పై పోటీచేసి విజయం సాధించడంతో తమిళనాడు రాజకీయరంగంలో సంచలనంగా మారిపోయారు. కొన్ని సంవత్సరాల కిందట తనను నిలదీసిన పార్టీ నాయకత్వాన్నే ఇప్పుడు ఓడించారు.

ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే గెలుపు దిశగా దూసుకుపోతోంది. మొత్తం 234 స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ మ్యాజిక్‌ మార్క్‌నకు చేరువైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం కాగా TVK ఇప్పటికే 105కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార DMK కూటమి రెండో స్థానానికి పడిపోయింది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాDMK కూటమి మూడో స్థానానికి చేరింది. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీచేసిన విజయ్, రెండుచోట్లా విజయం సాధించారు. పెరంబూర్‌లో లక్షా 10వేలకుపైగా మెజార్టీ సాధించిన ఆయన, తిరుచ్చి ఈస్ట్‌లో 73వేల పైచిలుకు లీడ్‌ దక్కించుకున్నారు. చాలాచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు.

తమిళ రాజకీయాల్లో కొత్తశకం- విజయ్ సునామీతో కదలిన 'ద్రవిడ' పార్టీల కూసాలు- TVK గెలుపునకు కారణాలు ఇవే!

తమిళనాట డీఎంకేకు అనూహ్య ఓటమికి కారణాలు ఏంటి? స్టాలిన్ లెక్కలు ఎక్కడ తప్పాయ్!