Telangana Panchayat Elections Results2025

ETV Bharat / bharat

వచ్చే ఏప్రిల్‌ 10న తమిళనాడు ఎన్నికలు? - బీజేపీ చీఫ్​ నాగేంద్రన్‌ కీలక వ్యాఖ్యలు

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయన్న ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు!

Nainar Nagendran
Nainar Nagendran (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : November 9, 2025 at 10:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

BJP President on TamilNadu Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని ఓ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ​ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకముందే ఆయన అలా చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా, వచ్చే ఏడాది మే 10తో తమిళనాడు అసెంబ్లీ గడువు ముగియనుంది. ధర్మపురిలో నిర్వహించిన ఓ సభలో ఆయనతో పాటు అన్నాడీఎంకే మాజీ మంత్రి కేపీ అన్బళగన్‌, తదితరులు పాల్గొన్నారు.

'రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఎన్నికలు జరగనున్నాయి. ఎడప్పాడి పళనిసామి ఎన్​డీయే అభ్యర్థి. ఇది బలమైన కూటమిగా నిలుస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో పళనిసామి చేతులు కలిపితేనే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్రం నుంచి నిధులు వస్తాయి. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఏమీ చేయలేదు. గడిచిన 11ఏళ్లలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రూ.14లక్షల కోట్లు ఇచ్చారు. డీఎంకే పాలనను గద్దె దించేందుకు బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ఏర్పడింది. ఏప్రిల్‌ 10న ఎన్నికలు, అంటే 140 రోజులకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. డీఎంకే ప్రభుత్వానికి పళనిసామి ముందుమాట రాస్తే, బీజేపీ దానికి ముగింపు ఇస్తుంది' అని నాగేంద్రన్‌ పేర్కొన్నారు. ఈసీ కంటే ముందే ఎన్నికలపై నాగేంద్రన్‌ ప్రకటన ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.

మరోవైపు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాట రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు రచిస్తున్నాయి. డీఎంకే కూటమి కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు తదితర చిన్న పార్టీలతో బలంగా ఉంది. ఐదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమమే మళ్లీ తమ పార్టీని అధికారంలోకి తెస్తాయని డీఎంకే ధీమా వ్యక్తం చేస్తోంది. బీజేపీతో కలిసి అధికార పీఠం అందుకుంటామని అన్నాడీఎంకే నమ్ముతోంది. అధికార, విపక్షాలు పోటాపోటీగా తలపడుతుంటే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రయత్నిస్తోంది. దశాబ్దాలుగా రెండు పార్టీల పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పుకు ఓటేస్తారని విజయ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు.

అటు చిన్న పార్టీలన్నీ ఏదో ఒక కూటమిలో చేరిపోయి ఉనికి కాపాడుకునే యత్నాల్లో ఉన్నాయి. సీమాన్‌ ఎప్పటిలాగే ఒంటరిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక డీఎండీకే పరిస్థితి అస్పష్టంగా ఉంది. మరో వైపు తండ్రీకొడుకుల గొడవతో పీఎంకే పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయితే ఎన్డీయే నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, ఏఎంఎంకే వైదొలగటం, పలు సమస్యలతో కూటమి బీటలు వారుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు, బలమైన డీఎంకే కూటమిని ఎదుర్కొనేందుకు అన్నాడీఎంకే నేతృత్వంలో బలమైన కూటమి ఏర్పాటు కావాలనే స్వరాలు వినిపిస్తున్నాయి.