తమిళనాడులో 'నెంబర్ గేమ్'- మెజార్టీ మార్క్‌కు 6 సీట్ల దూరంలో TVK- విజయ్ ప్రమాణస్వీకారం ఆలస్యం!
విజయ్ ప్రమాణస్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠ- టీవీకే మద్దతుపై సంతృప్తి చెందని గవర్నర్!

Published : May 6, 2026 at 10:14 PM IST
TVK Vijay Oath Taking Ceremony : తమిళనాడులో రాజకీయ సమీకరణాలు గంటగంటకూ మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఉత్కంఠత కొనసాగుతోంది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతు కోరుతూ తమిళగ వెట్రి కళగం చీఫ్ విజయ్ బుధవారం గవర్నర్‌ను కలిశారు. అయితే విజయ్‌కు ఉన్న సంఖ్యాబలంపై గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. విజయ్‌కి కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ, డీఎంకే కూటమిలోని వామపక్షాలు కలిసి రాకపోవడంతో రేపు విజయ్ ప్రమాణస్వీకారం ఉండకపోవచ్చని తెలుస్తోంది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 108 గెల్చుకొని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినా, మ్యాజిక్ మార్క్ 118 సీట్లకు 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్ (5) బలంతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అయితే టీవీకేకు ఉన్న సంఖ్యా బలంపై గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ సంఖ్యాబలం నిరూపించుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి మరో 10 సీట్లు అవసరం కాగా ఐదు సీట్లు ఉన్న కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
అయితే ఐదుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు సహా, విజయ్ నెగ్గిన రెండు చోట్లలో ఒకదాన్ని మినహాయిస్తే, టీవీకే బలం 112కు అవుతుంది. అయినప్పటికీ ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఇందుకోసం ఇతర పార్టీలను టీవీకే సంప్రదిస్తోంది. విజయ్‌కు మద్దతిచ్చేందుకు డీఎంకే మిత్రపక్షాలైన వామపక్షాలు, ఐయూఎంఎల్ నిరాకరించాయి. డీఎంకే కూటమిలోనే ఉంటామని సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ తేల్చిచెప్పాయి. ఈ మూడు పార్టీలకు ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉన్నారు.
డీఎంకే మరో మిత్రపక్షం వీసీకే టీవీకే పార్టీకి మద్దతిచ్చే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీకి సైతం ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు విజయ్ పార్టీకి అన్నాడీఎంకే మద్దతిస్తుందనే ప్రచారాన్ని ఆ పార్టీ తోసిపుచ్చింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని అన్నాడీఎంకే నేత కేపీ మునుస్వామి వెల్లడించారు. దీంతో విజయ్‌కు ఇంకా ఎవరెవరు మద్దతిస్తారో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటకు విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించలేదని తెలుస్తోంది. 108 మంది సభ్యుల బలం చేకూరిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం.
నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు
ఇప్పటికే చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లుచేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి విజయ్ ఆహ్వానించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలం ఇదీ!
- టీవీకే - 108
- డీఎంకే - 59
- అన్నాడీఎంకే - 47
- కాంగ్రెస్ - 05
- పీఎంకే - 04
- ఐయూఎమ్ఎల్- 02
- సీపీఐ - 02
- సీవీకే - 02
- సీపీఎం - 02
- బీజేపీ - 01
- డీఎండీకే - 01
- అన్నామక్కల్ మున్నేట్ర కళగం - 01
ఆ రెండు పార్టీల మంతనాలు
ఇదిలాఉండగా, కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఓవైపు విజయ్ మద్దతు కూడగట్టుకునే పనిలో ఉండగానే, మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలుకు 106 సీట్లు ఉన్నాయి. వామపక్షాలు మిగిలిన చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నాయట! దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
టీవీకేకు మేం మద్దతు ఇవ్వడం లేదు- ఆ వార్తలు అవాస్తవం : ఏఐఏడీఎంకే
ఒక్క ఓటుతో గెలుపు నుంచి 50 శాతానికిపైగా ఓట్లతో విజయాల దాకా- 2026 ఎన్నికల్లో TVK సంచలన గణాంకాలు

