ETV Bharat / bharat

ఎల్ఓసీ వద్ద పాక్ డ్రోన్ కలకలం- సరిహద్దు వెంబడి బలగాల ముమ్మర గాలింపు

మెంధర్ సెక్టార్‌లోని బాలాకోట్ ప్రాంతంలో డ్రోన్‌ గుర్తింపు- సరిహద్దు దాటి పాక్ వైపు వెళ్లినట్లు అధికారుల వెల్లడి-అనుమానాస్పద కదలికలపై ఉధంపూర్, కతువా, రాజౌరిలోనూ సెర్చ్ ఆపరేషన్లు

Pakistan Drones In Jammu Kashmir
Representational image (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 29, 2026 at 2:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

Pakistan Drones In Jammu Kashmir : జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ డ్రోన్ సంచారం కలకలం రేపింది. ఎల్ఓసీ వెంబడి మెంధర్ సెక్టార్‌లోని బాలాకోట్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి డ్రోన్‌ చక్కర్లు కొట్టడాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సరిహద్దు జిల్లాలను జల్లెడపడుతున్నాయి. డ్రోన్ ఏదైనా అనుమానాస్పద వస్తువులను జారవిడిచిందా? లేదా ఏమైనా తీసుకెళ్లిందా? అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, బాలాకోట్ ప్రాంతంలోని బెహ్రూటి గ్రామం వద్ద రాత్రి 8:05 గంటల ప్రాంతంలో ఓ డ్రోన్‌ కనిపించింది. కొంతసేపు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిన డ్రోన్, అనంతరం సరిహద్దుకు సమీపంలోని మంగళ్‌నార్-డబ్రోట్ వైపు కదిలినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు నిఘాను మరింత పెంచాయి. తెల్లవారుజామున రంగంలోకి దిగి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.

అలాగే సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని అధికారుల చెప్పారు. డ్రోన్‌ కదలికలపై నిఘా కొనసాగుతోందని, అనుమానాస్పదంగా ఏదైనా గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు బలగాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పూంచ్‌తో పాటు జమ్ము ప్రాంతంలోని మరికొన్ని జిల్లాల్లోనూ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఉధంపూర్, కఠువా, రాజౌరి జిల్లాల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా బరిలోకి దిగాయి. శుక్రవారం సాయంత్రం నుంచి ఉధంపూర్-కఠువా అటవీ బెల్ట్‌లోని కుబాన్, నగేన్, ఖత్రైల్, గోడు ఫలాల్, పదేతర్, చోర్ మొట్టు, కియా, ఖేబా, భేద్, మార్తా, జోఫర్ తదితర మారుమూల గ్రామాలను జల్లెడపడుతున్నాయి.

ఇద్దరు సాయుధులు
ఇదే సమయంలో రాజౌరి జిల్లాలోని గైబాస్, మిథియాని, మోగ్లా, నర్లా ప్రాంతాల్లో ఇద్దరు సాయుధులు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో సైన్యం రంగంలోకి దిగింది. బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల గుండా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అనుమానితులు ఉగ్రవాదులై ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు, సైన్యం, పారామిలిటరీ బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ సాయుధుల గురించి ఎటువంటి సమాచారం లభించలేదు.

ఈ ఏడాది ప్రారంభంలోనూ పాకిస్థాన్​కు చెందిన డ్రోన్లు జమ్ముకశ్మీర్​లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు తిప్పికొట్టాయి. మార్చి 1న జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దుల గుండా చొరబడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, భారత భద్రతా దళాలు వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం ఉధంపూర్, కఠువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో కొనసాగుతున్న తనిఖీలతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. పాకిస్థాన్‌ నుంచి వచ్చిన డ్రోన్‌ ద్వారా వాటిని జారవిడిచినట్లు అధికారులు అనుమానించారు. ఫిబ్రవరి 13న అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో 6.5 కిలోలకు పైగా హెరాయిన్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.40 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం జరిగిన ఈ ఘటనలో కూడా పాకిస్థాన్ డ్రోన్ 'ఏదైనా అనుమానాస్పద వస్తువు విడిచిందా' అనే విషయంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

'నేపాల్​లో చిక్కుకున్న భారతీయుల కోసం NDRF బలగాలు మోహరించాలి'- కేంద్రానికి ఖర్గే లేఖ

'ఉగ్రవాద రహిత ప్రాంతం దిశగా భారత్‌ లక్ష్యం'- SCO సదస్సుకు బయల్దేరిన మోదీ