ETV Bharat / bharat

'న్యాయ వ్యవస్థలో అవినీతి'పై NCERT బుక్‌లో ఛాప్టర్- సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అధ్యాయాన్ని చేర్చడంపై సుప్రీం కోర్టు ఆందోళన- న్యాయవ్యవస్థకు అపకీర్తిని తెచ్చే అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వను- సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు

Supreme Court on NCERT
Supreme Court on NCERT (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : February 25, 2026 at 12:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

Supreme Court on NCERT : ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి కొత్త సోషల్ సైన్స్ టెక్ట్స్ బుక్‌లో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే అధ్యాయాన్ని చేర్చడంపై సుప్రీం కోర్టు స్పందించింది. బుధవారం ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఇలాంటి అంశంపై సోషల్ సైన్స్ పుస్తకంలో అధ్యాయాన్ని చేర్చడం తీవ్ర ఆందోళనకర అంశమని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సీనియర్ అడ్వకేట్లు కపిల్ సిబాల్, అభిషేక్ ఎం సింఘ్వి ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠాన్ని చెప్పబోతున్నారని, ఇది చింత కలిగించే అంశమని వారు తెలిపారు. బ్యూరోక్రసీ, రాజకీయాల్లో ఉన్న అవినీతి గురించి ఒక్క అంశాన్నీ ప్రస్తావించకుండా, కేవలం న్యాయవ్యవస్థలోనే అవినీతి జరుగుతోందని అన్నట్టుగా విద్యార్థులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దీన్ని సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టు బెంచ్‌కు సిబల్, సింఘ్వి విన్నవించారు.

ఉద్దేశపూర్వక, ప్రణాళికాబద్ధ చర్యలాగే కనిపిస్తోంది
దీనిపై ఘాటుగా స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, న్యాయవ్యవస్థకు అపకీర్తిని తెచ్చే అవకాశాన్ని తాను ఎవ్వరికీ ఇవ్వనని తేల్చి చెప్పారు. చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని ఆయన స్పష్టం చేశారు. దేశ న్యాయ వ్యవస్థకు అధిపతిగా తన పనిని తాను చేశానని, న్యాయ వ్యవస్థలో అవినీతి అనే ఛాప్టర్‌ను సుమోటోగా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నానని వెల్లడించారు. ఇలాంటి అంశంపై సోషల్ సైన్స్ టెక్ట్స్ బుక్‌లో ఛాప్టర్‌ను చేర్చడం అనేది ఉద్దేశపూర్వక, ప్రణాళికాబద్ధ చర్యలాగే కనిపిస్తోందని, దీనిపై ఇంకా ఎక్కువ మాట్లాడలేనని సీజేఐ అన్నారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చినందుకు కపిల్ సిబల్‌, అభిషేక్ ఎం సింఘ్విలను ఆయన అభినందించారు.

ఎంత పెద్ద స్థానంలో ఉన్నవారైనా సరే, ఆ ఛాన్స్ ఇవ్వను
‘‘భారత న్యాయ వ్యవస్థ అధిపతిగా ఈ అంశంపై నాకు పూర్తి అవగాహన ఉంది. మేం ఒకరోజు పాటు ఎదురు చూస్తాం. న్యాయ వ్యవస్థలో అవినీతి అనే టాపిక్‌పై పాఠాన్ని చేర్చడం కచ్చితంగా యావత్ న్యాయ వ్యవస్థకు ఆందోళన కలిగించే అంశం. న్యాయవాదులతో పాటు న్యాయమూర్తులకూ ఇది చింతించే విషయం. దీనిపై నాకు చాలా కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నాను. ఎంత పెద్ద స్థానంలో ఉన్న వారైనా సరే, న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను. చట్టం తన పనిని తాను చేసుకుపోతుంది’’ అనే కీలక కామెంట్స్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేశారు. భారత రాజ్యాంగపు మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సోషల్ సైన్స్ టెక్ట్స్ బుక్‌ కనిపిస్తోందని న్యాయమూర్తి జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి వ్యాఖ్యానించారు.

ఫిబ్రవరి 23నే విడుదలైన సోషల్ సైన్స్ పుస్తకం
వాస్తవానికి ఎన్‌సీఈఆర్‌టీ 8వతరగతి కొత్త సోషల్ సైన్స్ టెక్ట్స్ బుక్‌‌‌ పార్ట్ - 2ను ఈ ఏడాది ఫిబ్రవరి 23నే విడుదల చేశారు. ‘ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ : ఇండియా అండ్ బియండ్’ అనే టైటిల్‌తో ఈ బుక్ వచ్చింది. ఇందులోనే ది రోల్ ఆఫ్ ది జ్యుడీషియరీ ఇన్ అవర్ సొసైటీ అనే వివాదాస్పద ఛాప్టర్ ఉంది. ఈ ఛాప్టర్‌లో జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, కరప్షన్ ఇన్ ది జ్యుడీషియరీ అనే రెండు సెక్షన్లు ఉన్నాయి.

న్యాయవ్యవస్థలో అవినీతి, దేశంలో భారీగా పేరుకుపోయిన కోర్టు కేసులు, జడ్జీల కొరత, న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి అంశాలను ఈ ఛాప్టర్‌లో ప్రస్తావించారు. జడ్జీలకు ఒక ప్రవర్తనా నియమావళి ఉంటుందని, దాని ప్రకారం వాళ్లు కోర్టులో, బయట వ్యవహరించాల్సి ఉంటుందని ఈ ఛాప్టర్‌లో పేర్కొన్నారు. 1947లో జరిగిన భారత్ -పాక్ విభజన, జలియన్ వాలా బాగ్ ఉదంతం వంటి అంశాలపైనా ఈ పుస్తకంలో కొత్త కోణంలో విశ్లేషణను అందించారనే చర్చ జరుగుతోంది. దీని విక్రయాలు ఫిబ్రవరి 24న మొదలయ్యాయి. ఇక ఎన్‌సీఈఆర్‌టీ 8వతరగతి సోషల్ సైన్స్ బుక్ పార్ట్ 1ను 2025 జులైలో విడుదల చేశారు. ఈ పాత సోషల్ సైన్స్ టెక్ట్స్ బుక్‌లో న్యాయ వ్యవస్థ నిర్మాణ స్వరూపం,కోర్టుల పాత్ర అనే అంశాలను మాత్రమే ప్రస్తావించారు.