ETV Bharat / bharat

నీట్- యూజీ రీ ఎగ్జామ్​పై సుప్రీం కీలక ఉత్తర్వులు- OMR మోడ్​లోనే పరీక్ష

CBT విధానంలో నీట్ పరీక్ష నిర్వహించాలన్న పిటిషన్​ను తిరస్కరించిన సుప్రీం కోర్టు - NTAపై జులైలో సుదీర్ఘ విచారణ జరుపుతామని వెల్లడి!

Supreme Court Of India
Supreme Court Of India (Source : ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 1, 2026 at 4:05 PM IST

4 Min Read
Choose ETV Bharat

SC On NEET Re Exam : 2026 నీట్- యూజీ పరీక్ష నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్షను 'కంప్యూటర్ ఆధారిత పరీక్ష' (సీబీటీ) విధానంలో నిర్వహించాలని ఆర్​జేడీ ఎంపీ సుధాకర్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్​ను స్వీకరించడానికి నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న పెన్​ అండ్ పేపర్​ విధానంలోనే నీట్ పునఃపరీక్ష నిర్వహించాలని జస్టిస్ పీఎస్ నరిసింహ, జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ)పై ఉన్న ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. తర్వాత ఎంపీ సుధాకర్ సింగ్​ సహా, ఇతరులు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జూలై 27కు వాయిదా వేసింది.

జూన్​ 21న రీటెస్ట్
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3న నీట్​-యూజీ పరీక్ష నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఆ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనితో మే 12న ఎన్​టీఏ నీట్​ పరీక్షను రద్దు చేసింది. విద్యార్థులు, ప్రతిపక్షాల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ పేపర్ లీక్ కేసును సీబీఐకు అప్పగించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు విద్యార్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షను తిరిగి (రీటెస్ట్​) జూన్​ 21న నిర్వహించేందుకు ఎన్​టీఏ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా పరీక్షను సీబీటీ విధానంలో జరపాలని కోరుతూ ఆర్​జేడీ ఎంపీ సుధాకర్​ సింగ్​తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

వీటిపై విచారణ జరుపుతూ, పిటిషనర్ల తరఫున హాజరైన అడ్వకేట్ సత్యం సింగ్ రాజ్​పుత్​ను ఉద్దేశించి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "రీ-ఎగ్జామినేషన్​ సీబీటీ విధానంలో నిర్వహించే ప్రశ్నే లేదు. ఎన్​టీఏ ఇప్పటికే చాలా సమస్యలను ఎదుర్కొంటోంది. నీట్ పరీక్ష రద్దు అయ్యింది కనుక ఇప్పుడు దానిని మళ్లీ నిర్వహిస్తున్నారు. కనుక ఈ పిటిషన్​ను మేము ఇప్పుడే కొట్టివేయాలా లేదా వేసవి సెలవుల తర్వాత కొట్టివేయాలా?" అని ప్రశ్నించింది.

దీనిపై న్యాయవాది సత్యం సింగ్ రాజ్​పుత్​ స్పందిస్తూ, "మేము నీట్​-రీటెస్ట్​ను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని మాత్రమే అభ్యర్థిస్తున్నాం. మరేమీ కాదు" అని అన్నారు. అయితే ఇలాంటి పిటిషన్లను గతంలోనే సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. దీనిపై సత్యం సింగ్​ రాజ్​పుత్ స్పందిస్తూ, "రీ-ఎగ్జామ్​ను పెన్​ అండ్ పేపర్ విధానంలో భౌతికంగా నిర్వహిస్తున్నారని, అయితే ఎలాంటి లీకేజ్​లు లేకుండా ఉండేందుకు దానిని సీబీటీ విధానంలో జరపాలి" అని పట్టుబడ్డారు. దీనిపై జస్టిస్​ నరసింహ స్పందిస్తూ, ప్రస్తుతం ఎన్​టీఏపై ఉన్న ఒత్తిడిని అర్థం చేసుకోవాలని న్యాయవాదికి సూచించారు.

స్వయంగా ప్రధాన మంత్రి పర్యవేక్షిస్తున్నారు!
అంతకుముందు మే 29న దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వైద్య విద్య ప్రవేశ పరీక్షకు సంబంధించి అసలైన జవాబుదారీతనం వచ్చే వరకు అసలు సమస్య ముగియని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం, ఎన్​టీఏ యువతను నిరాశపరచకూడదని పేర్కొంది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరణ ఇస్తూ, యువత ఆందోళనల పట్ల ప్రభుత్వం దృష్టి సారించిందని, ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అంతేకాదు జూన్​ 21న జరగనున్న నీట్​-యూజీ రీటెస్ట్​ కోసం కొన్ని సరికొత్త రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎన్​టీఏకు బదులుగా మరో సంస్థ?
వైద్య విద్య ప్రవేశ పరీక్షలను నిర్వహించడానికి ఎన్​టీఏ స్థానంలో మరింత బలమైన, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేయాలని లేదా ఎన్​టీఏను పునర్వ్యవస్థీకరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం వాటిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్​టీఏ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్​ దాఖలు చేసింది. అందులో, తాము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని, వచ్చే ఏడాది నుంచి పెన్​-అండ్-పేపర్ విధానానికి బదులుగా సీబీటీ విధానంలో నీట్​-యూజీ పరీక్ష నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

ఎన్​టీఏ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు!
2024లోనూ నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ పరీక్షను రద్దు చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అదే సమయంలో పేపర్ లీకేజీలను అరికట్టడానికి, పబ్లిక్ పరీక్షలను రద్దు చేయడానికి సంబంధించిన ప్రమాణాలపై పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే ఈ ఏడాది కూడా నీట్ పేపర్ లీక్ అయ్యింది. దీనిపై దాఖలైన పిటిషన్లపై మే 25న విచారణ చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గత నీట్ పేపర్ లీక్ ఘటన నుంచి ఎన్​టీఏ ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరమని వ్యాఖ్యానించింది. పరీక్షలు నిర్వహించే ఈ ఏజెన్సీ (ఎన్​టీఏ) స్థానంలో మరింత పటిష్టమైన, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థను తీసుకురావాలని కోరిన పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్​టీఏ, సీబీఐలను కోర్టు నిర్దేశించింది.

జేబు దొంగల పట్ల జాగ్రత్త- వారు CBSEలోనే తిష్ట వేశారు: రాహుల్

JEE అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు రిలీజ్- టాపర్​గా దిల్లీ విద్యార్ధి- విశాఖ సందీప్​కు ఐదో ర్యాంక్