'పదవీవిరమణకు 2 నెలల ముందే కొత్త సీజేల నియామకం'- సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం
మద్రాస్, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేలను సిఫారసు చేసిన కొలీజియం- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ సిఫారసు- మద్రాస్ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ సిఫారసు

Published : February 27, 2026 at 8:18 AM IST
SC Collegium on HC Chief Justice : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పదవీ విరమణకు రెండు నెలల ముందే కొత్త సీజేలను నియమించాలని తెలిపింది. దీంతో కొత్త సీజేలు కోర్టు పరిపాలన, వ్యవస్థపై ముందుగానే అవగాహన పొందే అవకాశం ఉంటుందని కొలీజియం భావిస్తోంది.
ఈ మేరకు జరిగిన తాజా సమావేశంలో, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని కొలీజియం రెండు ముఖ్యమైన హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్, మద్రాస్ హైకోర్టుల్లో త్వరలో ఖాళీ కానున్న సీజే పదవుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం చంఢీగఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్‌ను సిఫారసు చేసింది.
ఆమెను ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేసి, ఖాళీ ఏర్పడిన రోజునుంచే చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ ముందస్తు బదిలీ ద్వారా ఆమె కోర్టు పరిపాలన, కేసుల నిర్వహణ, రోస్టర్ వ్యవస్థ వంటి అంశాలను సమగ్రంగా తెలుసుకునే వీలుంటుందని కొలీజియం పేర్కొంది. అటు మద్రాస్ హైకోర్టు విషయానికి వస్తే, ప్రస్తుతం కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి పేరును సిఫారసు చేసింది. మద్రాస్ హైకోర్టు ప్రస్తుత సీజే పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయనను మద్రాసు హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం నిర్ణయించింది.
కొలీజియం తెలిపిన ప్రకారం, హైకోర్టుల పరిపాలనలో చీఫ్ జస్టిస్ పాత్ర ఎంతో కీలకం. కేసుల కేటాయింపు, న్యాయమూర్తుల రోస్టర్ నిర్ణయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెండింగ్ కేసుల నిర్వహణ, మొత్తం పరిపాలనా పర్యవేక్షణ వంటి అనేక బాధ్యతలు సీజేలపై ఉంటాయి. కొత్తగా వచ్చినవారు ఒక్కసారిగా బాధ్యతలు చేపట్టడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే బదిలీ చేసి అనుభవం కల్పించడం ద్వారా మొదటి రోజే సమర్థంగా పనిచేయగలరని కొలీజియం భావిస్తోంది.
ఇది హైకోర్టుల్లో నాయకత్వ మార్పులను మరింత సజావుగా చేయడానికి తీసుకున్న దీర్ఘకాలిక సంస్కరణగా న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అనేక హైకోర్టుల్లో తరచూ సీజే మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, ఈ కొత్త విధానం స్థిరత్వాన్ని తీసుకురానుందని అంటున్నారు. అలాగే, మాతృ హైకోర్టుకు బయటనుంచే చీఫ్ జస్టిస్ నియామకం చేయాలనే నిబంధన అమల్లో ఉన్నందున, కొత్త ప్రదేశంలో ముందస్తు పరిచయం అవసరమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ నిర్ణయం అమలుతో, ఏపీ, మద్రాస్ హైకోర్టుల్లో త్వరలోనే కొత్త ప్రధాన న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టనున్నారు.

