ETV Bharat / bharat

స్టాలిన్‌ను కలిసిన రజనీకాంత్‌- ఇప్పుడే ఎందుకు?

రాష్ట్ర ఎన్నికల్లో డీఎంకేకు ఎదురైన పరాజయం- స్టాలిన్‌కు తన సంఘీభావాన్ని తెలియజేశారని సమాచారం- మర్యాదపూర్వక భేటీయే అంటున్న డీఎంకే వర్గాలు

Rajinikanth And Stalin
Rajinikanth And Stalin (ETV Bharat And ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2026 at 5:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Rajinikanth Meets Stalin : తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ బుధవారం డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఆయన చెన్నై నివాసంలో కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

బుధవారం ఉదయం చెన్నైలోని స్టాలిన్ నివాసానికి వెళ్లిన రజనీకాంత్ కొంతసేపు ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని డీఎంకే వర్గాలు చెబుతున్నప్పటికీ, రాజకీయంగా మాత్రం దీని చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర నిరాశలో ఉన్న స్టాలిన్‌కు ధైర్యం చెప్పేందుకే రజనీకాంత్ ఆయన ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో తాను స్టాలిన్ వెంటే ఉంటానని, పూర్తి స్థాయిలో అండగా నిలుస్తానని రజనీకాంత్ హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. నిజానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ డీఎంకే కూటమిదే విజయం అని అంచనా వేశాయి. మరోసారి స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. అయితే తుది ఫలితాలు మాత్రం డీఎంకేకు తీవ్ర నిరాశ మిగిల్చాయి. అధికారాన్ని కోల్పోవడమే కాకుండా స్టాలిన్ స్వయంగా తన కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలవడం పార్టీ శ్రేణులను షాక్‌కు గురిచేసింది.

2011 నుంచి వరుసగా మూడు సార్లు కొళత్తూరు నుంచి విజయం సాధించిన స్టాలిన్ ఈసారి టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో సుమారు 8,700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో డీఎంకే శ్రేణులు ఈ ఫలితాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయి. డీఎంకే, దాని మిత్రపక్షాలు కలిసి రెండో అతిపెద్ద కూటమిగా నిలవడంతో కొత్త అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది. ఇక స్టాలిన్ ఓటమి నేపథ్యంలో ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. చెపాక్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

రజనీకాంత్- డీఎంకే అనుబంధం కొత్తది కాదు. 1995లో తమిళ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూటమికి రజనీకాంత్ బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో పెద్ద ప్రభావం చూపాయి. అనంతరం 1998 లోక్‌సభ ఎన్నికల్లో కూడా డీఎంకేకు ఆయన అండగా నిలిచారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో 2017లో రజనీకాంత్ స్వయంగా రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. అభిమానుల అంచనాల మధ్య పార్టీ స్థాపనపై ముందడుగు వేసినప్పటికీ, 2021లో ఆరోగ్య కారణాలు, వయసు దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి రాజకీయ వ్యాఖ్యల విషయంలో రజనీకాంత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఇలాంటి సమయంలో స్టాలిన్‌ను స్వయంగా కలిసి పరామర్శించడం తమిళ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసింది. ముఖ్యంగా డీఎంకే ఓటమి, స్టాలిన్ వ్యక్తిగత పరాజయం నేపథ్యంలో ఈ భేటీని చాలామంది రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైన పరిస్థితి ఉంది. విజయ్ తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు స్థానాల్లో గెలవడంతో ఒక స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే విజయ్ విజయంపై రజనీకాంత్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. అదే సమయంలో ఇప్పుడు స్టాలిన్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్​ చరిత్రలోనే ఉంది : బీజేపీ

మమతా బెనర్జీ సీఎంగా కొనసాగవచ్చా? రాజ్యాంగ నిపుణులు ఏమంటున్నారు?