ETV Bharat / bharat

రైతులకు గుడ్​న్యూస్ - 'కర్ణ 18' చెరకు వంగడం అభివృద్ధి- అన్నదాతలకు లాభాలు మస్త్!

చెరకు రైతులకు తీపికబురు - కొత్త రకం వంగడం కర్ణ-18ను అభివృద్ధి చేసిన కర్నాల్​లో ఉన్న సుగర్​కేన్​ బ్రీడింగ్ ఇన్​స్టిట్యూట్​ రీజనల్ సెంటర్ - ఎందుకో తెలుసా?

KARNA 18 NEW variety SUGARCANE crop
KARNA 18 NEW variety SUGARCANE crop (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : January 11, 2026 at 2:16 PM IST

3 Min Read
Choose ETV Bharat

Karna 18 Variety Sugarcane Features : చెరకు రైతులకు శుభవార్త. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగుకు అనుకూలంగా ఉండే, మంచి దిగుబడిని ఇచ్చే కొత్త రకం చెరకు వంగడం అందుబాటులోకి వచ్చింది. అదే కర్ణ-18 (CO-18022). ఈ కొత్త వంగడాన్ని హరియాణాలోని కర్నాల్​లో ఉన్న సుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్ స్టిట్యూట్ రీజనల్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఈ చెరకు వంగడం దేశంలోని వాయువ్య ప్రాంతంలోని రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దీన్ని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగు చేయవచ్చు. తెగులు, వ్యాధులను తట్టుకునే స్వభావం ఈ కొత్త చెరకు వంగడంలో ఎక్కువ. దీంతో ఈ రకం చెరకును సాగు చేసి రైతులు మంచి దిగుబడి, లాభాలను సాధించవచ్చు.

ఆ ప్రాంత రైతులకు అధిక ప్రయోజనం
కొత్త రకం వంగడం కర్ణ-18 (CO-18022) భవిష్యత్తులో దేశంలోని చెరకు రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని కర్నాల్​లో ఉన్న సుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్ స్టిట్యూట్ రీజనల్ సెంటర్ సీనియర్ సైంటిస్ట్ ఎంఆర్ మీనా తెలిపారు. "అత్యధికంగా చెరకు ఉత్పత్తి చేసే ప్రాంతమైన వాయువ్య భారతంలోని రైతులకు కర్ణ-18 రకం చెరకు వంగడం మంచి గిఫ్ట్ లాంటిది. హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్​లోని రైతులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా రైతులకు పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరుతుంది." అని ఎంఆర్ మీనా పేర్కొన్నారు.

"ఈ రకం చెరకు ప్రత్యేక లక్షణం దాని వాతావరణ అనుకూలమైన స్వభావం. ఇది వాతావరణం ద్వారా గణనీయంగా ప్రభావితం కాదు. లవణీయత, కరవు పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. ఫలితంగా అధిక దిగుబడి వస్తుంది. లవణీయత, కరవు ఈ రకం చెరుకుపై గణనీయమైన ప్రభావాన్ని చూపవు. అందుకే ఈ చెరకును సాగు చేసి మంచి దిగుబడిని సాధించవచ్చు" -ఎంఆర్ మీనా, కర్నాల్ సుగర్​కేన్ బ్రీడింగ్ ఇన్ స్టిట్యూట్ రీజనల్ సెంటర్ సీనియర్

కర్ణ -18 తెగుళ్ల బారిన పడదు : సైంటిస్టులు
చెరకు పంటను పట్టి పీడించే ఎర్ర, టాప్ బోరర్ తెగులు వంటి ఇతర రకాల వ్యాధుల బారిన కర్ణ-18 పడదని ఎంఆర్ మీనా పేర్కొన్నారు. "చెరకు పంటలలో అత్యంత సాధారణ వ్యాధులు, తెగుళ్ల వల్ల కర్ణ-18 రకం చెరకు ప్రభావితం కాదు. ఎర్ర, టాప్ బోర్ తెగులు చెరకు రైతులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్యలు. ఇవి పంటకు సోకితే ఉత్పత్తి తగ్గడం వల్ల రైతులు గణనీయమైన నష్టాలను చవిచూస్తారు. అయితే, కర్ణ-18 రకం ఎర్ర, టాప్ బోరర్ తెగులుకు నిరోధకతను కలిగి ఉంటుంది. " అని మీనా స్పష్టం చేశారు.

grown karna 18 variety sugarcane crop
కర్ణ -18 చెరకు పంట (Etv Bharat)

కర్ణ-18 ఇప్పటికే ఉన్న CO-05011 స్థానంలోకి వస్తుందని ఎంఆర్ మీనా తెలిపారు. ఇది రాటూన్ క్రాప్ నకు కూడా చాలా బాగుంటుందన్నారు. (రాటూన్ క్రాప్ అనేది మొదటి లేదా ప్రధాన పంటను కోసిన తర్వాత మిగిలిపోయిన వేర్లు (మొద్దుల నుంచి) పెంచే ద్వితీయ పంట. విత్తనాలు, శ్రమ, సమయాన్ని రైతులకు ఆదా చేస్తుంది. ఈ పద్ధతి సాధారణంగా చెరకు, వరి, అరటి సాగులో కనిపిస్తుంది. అయితే దీని దిగుబడి తరచుగా ప్రధాన పంట కంటే తక్కువగా ఉంటుంది). కర్ణ-18 రకం చెరకు దిగుబడి హెక్టారుకు 12.6 టన్నుల అంచనా వేశామని అన్నారు. చక్కెర మిల్లుల వద్ద రికవరీ దాదాపు 11 శాతం ఉంటుందని అంచనా అని తెలిపారు.

తక్కువ సమయంలోనే చేతికందుతుంది
"కర్ణ-18 రకం చెరకు 12 నెలల్లోపే పండేస్తుంది. వసంతకాలంలో ఫిబ్రవరి-మార్చి, శరదృతువు సెప్టెంబర్-అక్టోబర్‌ లో విత్తనాలు వేయవచ్చు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి చక్కెర మిల్లులు. వ్యవసాయ విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు కర్ణ-18 విత్తనాలు అందుబాటులో ఉంటాయి. కర్ణ-18 రకం చెరకు అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం కావాలనుకున్న రైతులకు మంచి ఆప్షన్. ఇది భవిష్యత్తులో చెరకు రైతులకు ఒక వరంలా మారుతుంది" అని మీనా పేర్కొన్నారు.

వాస్తవానికి కర్ణ-18 రకం చెరకు వంగడాన్ని ఇటీవల బీజేపీ అగ్రనేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. మొత్తం 184 రకాల వివిధ పంటలను విడుదల చేశారు. అందులో కొత్త చెరకు వంగడం కర్ణ-18 ఒకటి. ఈ రకాన్ని సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ (CVRC) నోటిఫై చేసింది.

farmer showing karna18 variety sugarcane crop
కర్ణ -18 రకం చెరకు పంటను చూపిస్తున్న రైతు (Etv Bharat)

చెరుకు దిగుబడిలో రైతు రికార్డు- 3 ఎకరాల్లో 391 టన్నులు ఉత్పత్తి - లాభం రూ.10 లక్షలకుపైనే!

సౌత్ ఇండియా రైతులను చూసి ప్రేరణ- కొబ్బరి సాగులో అదరగొడుతున్న అన్నదాత- ఏటా రూ.లక్షల్లో ఆదాయం