ETV Bharat / bharat

బంగాల్‌లో ఓట్ల కౌంటింగ్- 24 గంటల ముందే రెండు దేశాల బార్డర్స్ క్లోజ్

హోరాహోరీగా సాగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు- నువ్వా నేనా అన్నట్లు తలపడ్డ అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ- సోమవారం తేలనున్న పార్టీల భవితవ్యం- బంగాల్‌తో బార్డర్ పంచుకున్న రెండు దేశాల సరిహద్దులను మూసేసిన అధికారులు

West Bengal Counting Borders Closed
West Bengal Counting Borders Closed (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2026 at 7:58 PM IST

3 Min Read
Choose ETV Bharat

West Bengal Counting Borders Closed : బంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకు కేంద్రం, ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బంగాల్‌తో బార్డర్‌ను పంచుకునే రెండు దేశాల అంతర్జాతీయ సరిహద్దులను ఓట్ల లెక్కింపు ప్రారంభానికి 24 గంటల ముందే మూసేశారు. భూటాన్, బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాలతో బంగాల్ పంచుకునే సరిహద్దులను పూర్తిగా సీల్ చేశారు. ఈ మేరకు జల్పాయ్‌గుడి జిల్లా యంత్రాగం వెల్లడించింది.

ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ అంతర్జాతీయ సరిహద్దుల్లో వాణిజ్య వాహనాల రాకపోకలను 48 గంటల పాటు నిలిపివేశామని జల్పాయ్‌గుడి జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆదివారం (మే 3) ఉదయం 6 గంటల నుంచి మంగళవారం (మే 5న) ఉదయం 6 గంటల వరకు బంగాల్‌తో అంతర్జాతీయ సరిహద్దు పంచుకునే రెండు దేశాల బార్డర్లను పూర్తిగా మూసివేశామని ప్రకటించింది. ఈ కాల వ్యవధిలో ఏ వాహనానికి లేదా డ్రైవర్‌కు బంగాల్ నుంచి బంగ్లాదేశ్, భూటాన్‌కు వెళ్లడానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అలాగే ఈ రెండు పొరుగు దేశాల నుంచి బంగాల్‌లోకి ప్రవేశించడానికి కూడా పర్మిషన్ లేదని చెప్పింది.

కొన్ని మినహాయింపులు
అయితే, బంగాల్‌తో బార్డర్‌ను పంచుకునే రెండు దేశాల అంతర్జాతీయ సరిహద్దుల మూసివేత విషయంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. హెల్త్ ఎమర్జెన్సీ వంటి అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు ఈ ఆంక్షల నుంచి పూర్తి మినహాయింపునిచ్చారు. ఇటువంటి సందర్భాలలో వాహనాన్ని, సంబంధిత పత్రాలను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత వాహనాన్ని సరిహద్దు దాటడానికి అనుమతిస్తారు. ప్రస్తుతం భూటాన్ సందర్శనలో ఉన్న టూరిస్టులు భారత్‌కు తిరిగి రావడానికి అనుమతిస్తారు. అంతేకాకుండా పని నిమిత్తం భూటాన్, బంగ్లాదేశ్‌కు వెళ్లిన పౌరులు సరిహద్దు దాటి తమ స్వదేశానికి తిరిగి రావడానికి పర్మిషన్ ఇస్తారు. అయితే, ఇటువంటి సందర్భాలలో పౌరులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

టూర్ కోసం భూటాన్, బంగ్లాదేశ్‌కు వెళ్లాలనుకునే పౌరులు సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్ద సరైన పత్రాలను, తమ ప్రయాణ వివరాలను సమర్పించిన తర్వాత పొరుగు దేశాలకు వెళ్లొచ్చు. కాగా, భూటాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న కల్చి వద్ద గల సరిహద్దు ద్వారాలను ఆదివారం ఉదయమే మూసేశారు. మరోవైపు, సిలిగుడి సమీపంలో ఉన్న ఫుల్‌బారి వద్ద గల భారత్-బంగ్లాదేశ్ సరిహద్దును కూడా సీల్ చేశారు. అయితే బంగ్లాదేశ్ సరిహద్దుకు సంబంధించి మాత్రం ప్రవేశ ఆంక్షలను ప్రధానంగా బంగ్లాదేశ్ పౌరులపై విధించారు. కాగా, భారత్-బంగ్లాదేశ్, భారత్-భూటాన్ సరిహద్దుల వెంబడి అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువుల రవాణా నిరాటంకంగా కొనసాగుతుందని జల్‌పాయ్‌గుడి జిల్లా మేజిస్ట్రేట్ సందీప్ కుమార్ ఘోష్ తెలిపారు. ఇతర అన్ని రకాల సరిహద్దు దాటే రాకపోకలు ప్రస్తుతానికి నిలిపివేశామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశారు.

432 మంది కౌంటింగ్ అబ్జర్వర్లు
మరోవైపు, బంగాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 432 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను (పరిశీలకులు) నియమించింది. జిల్లాల సున్నితత్వం, ఎన్నికల ప్రాముఖ్యత దృష్ట్యా వాటికి అదనపు పరిశీలకులను కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని 33 నియోజకవర్గాలకు 49 మంది అబ్జర్వర్లను, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 31 స్థానాలకు 45 మంది పరిశీలకులను ఈసీ కేటాయించింది. ముర్షిదాబాద్‌లోని 22 నియోజకవర్గాలకు 33 మంది, డార్జిలింగ్, జల్‌పాయ్‌గుడి, ఉత్తర దినాజ్‌పుర్ వంటి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గానికి ఒక అదనపు పరిశీలకుడిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఫిబ్రవరి 26 నుంచి మే 2 వరకు బంగాల్‌లో రూ. 30.79 కోట్ల నగదు, రూ. 145.07 కోట్ల విలువైన 55 లక్షల లీటర్లకు పైగా మద్యం, రూ. 127.02 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 37.52 కోట్ల విలువైన విలువైన లోహాలు, విదేశీ కరెన్సీతో సహా ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఈ స్వాధీనం చేసుకున్న వస్తువులు, మద్యం, నగదు విలువ రూ.561 కోట్లు అని తెలిపింది.

స్వీట్లు రెడీ
అలాగే, సోమవారం బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండడంతో టీఎంసీ, బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నాయి. తమ పార్టీ జెండా రంగులు, నినాదాలకు అనుగుణంగా స్వీట్‌లను సిద్ధం చేశాయి. బీజేపీ కాషాయ వర్ణంలో 'మోదీశ్రీ' పేరిట, ఆకుపచ్చ రంగులో 'జాయ్ బంగ్లా' పేరిట టీఎంసీ, 'లాల్ సలాం' పేరిట వామపక్షాలు మిఠాయిలను సిద్ధం చేశాయి.

బంగాల్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ- ఆ 11 జిల్లాల్లో హై అలర్ట్‌- ఎవరు గెలుస్తారో?

బంగాల్ ఎన్నికల్లో అక్రమాలు - ఆ నియోజకవర్గంలోని 285 బూత్​ల్లో రీ పోలింగ్