వీధుల నుంచి ప్రతి కుక్కను తరలించాలని ఆదేశించలేదు: సుప్రీంకోర్టు
జంతువుల జనన నియంత్రణ నిబంధనల అమలుకు ఆదేశించాం: సుప్రీం- గతంలో ఇచ్చిన ఆదేశాలు సవరించాలన్న పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

Published : January 8, 2026 at 5:35 PM IST
SC on Stray Dogs : వీధుల్లో ఉండే ప్రతి కుక్కను తరలించాలని తాము ఆదేశించలేదని, జంతువుల జనన నియంత్రణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. కుక్కలు తమకు భయపడేవారిని లేదా గతంలో కుక్కకాటుకు గురైన వారిని వాసన చూసి వారిపై దాడి చేస్తాయని వీధికుక్కల కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. కేవలం సంస్థలు, కార్యాలయాల దగ్గరి నుంచి మాత్రమే వాటిని తరలించమన్నామని సుప్రీం ధర్మాసనం గుర్తుచేసింది. సున్నితమైన ప్రదేశాల్లో భద్రతపై ఆందోళన వ్యక్తంచేసిన సుప్రీం కోర్టు, ఆసుపత్రి వార్డుల్లో, రోగుల చుట్టూ కుక్కలు సంచరించడానికి అనుమతించాలా అని ప్రశ్నించింది.
శునకాలను వీధుల నుంచి తరలించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని జంతు ప్రేమికులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ NV అంజారియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వీధుల నుంచి ప్రతి కుక్కను తరలించాలని తాము ఆదేశించలేదని, నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని మాత్రమే ఆదేశించినట్లు జస్టిస్ మెహతా పేర్కొన్నారు.
దేశ రాజధాని దిల్లీలో కుక్కకాటు వల్ల ముఖ్యంగా చిన్నారులు రేబిస్ బారిన పడుతున్నట్లు మీడియా కథనాలు వెలువడటంతో గతేడాది జులై 28న సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. విద్యాసంస్థలు, బస్, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు తదితర జనసమ్మర్ద బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు సంచరించకుండా చేయాలని గతేడాది నవంబర్ 7న కీలక ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి, వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేయాలని ఆదేశించింది. ఏ కారణం చేతనైనా మళ్లీ వాటిని పట్టుకున్న ప్రదేశంలోనే వదిలేయొద్దని స్పష్టంచేసింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధరించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. జాతీయ రహదారులపై తిరుగుతున్న పశువులను కూడా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆయా సంస్థల ప్రాంగణాల్లోకి అవి చొరబడకుండా కంచెలు నిర్మించాలని గుర్తుచేసింది. కుక్క కాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ఆరోగ్యం తమకు అత్యంత ప్రాధాన్యమని తేల్చి చెప్పింది.
అంతకుముందు బుధవారం వీధి కుక్కుల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్‌లు దాఖలు అవుతుండటంపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం, కేవలం శునకాలపై ఆలోచిస్తుంటే ఇతర జంతువుల సంగతేంటని ప్రశ్నించింది. కరిచేందుకు సిద్ధమైన కుక్కల ప్రవర్తనను ముందుగా ఎవరూ అంచనా వేయలేరని పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో చికిత్స కంటే నివారణే ముఖ్యమని స్పష్టంచేసింది.
కాలేజీ క్యాంపస్‌ల్లో వీధి కుక్కలకు చెక్- నోడల్ ఆఫీసర్లుగా ప్రొఫెసర్లు, సిబ్బంది
సుప్రీంకోర్టు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆదేశాల మేరకు కాలేజీ క్యాంప్‌లను వీధి కుక్కలు లేని ప్రాంగణంగా ఉంచాలనే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇకపై కాలేజీల్లో వీధి కుక్కలు కనిపించకుండా చూసే బాధ్యత నోడల్ ఆఫీసర్లుగా నియమితులైన ప్రొఫెసర్లు లేదా సిబ్బందిపై ఉంటుంది. ఈ ఉత్తర్వులు రాజస్థాన్ రాష్ట్రం మొత్తం వర్తిస్తాయని కాలేజీ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ పంచోలి తెలిపారు.
కోటా నగరంలోని 8 కాలేజీలు సహా డివిజన్ పరిధిలోని మొత్తం 55 కాలేజీల ప్రిన్సిపాల్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రొఫెసర్ విజయ్ వివరించారు. ఇప్పటికే చాలా కాలేజీలు నోడల్ ఆఫీసర్లను నియమించగా, మిగతావి త్వరలోనే నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని ప్రొ. విజయ్ పంచోలి వివరించారు. ఆ మేరకు అన్ని కాలేజీల్లో స్ట్రీట్ డాగ్ ఫ్రీ క్యాంపస్ కోసం నోడల్ ఆఫీసర్లను నియమించాలనే సూచనలు ఇచ్చారు. అయితే, నోడల్ ఆఫీసర్‌గా తప్పనిసరిగా ఫ్యాకల్టీ సభ్యులే ఉండాలన్న నిబంధన లేదని అధికారులు స్పష్టం చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ తమకు తగిన విధంగా టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ సిబ్బందిని నోడల్ ఆఫీసర్లుగా నియమించుకోవచ్చని చెప్పారు. వీరిలో ల్యాబ్ అసిస్టెంట్లు, క్లర్కులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉండొచ్చని అన్నారు.
నోడల్ ఆఫీసర్ల బాధ్యతలు ఇవే
జిల్లా కలెక్టర్ పీయూశ్ ఆదేశాల ప్రకారం జారీ చేసిన ఉత్తర్వుల్లో, నోడల్ ఆఫీసర్లకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. కాలేజీ క్యాంపస్‌లో వీధి కుక్కలు కనిపిస్తే వెంటనే కోటా నగరపాలక సంస్థ (నగర నిగమ్) నంబర్లకు సమాచారం ఇవ్వాలి. కుక్కలను షెల్టర్ హోమ్‌కు తరలించే ప్రక్రియను సమన్వయం చేయాలి. ఈ మొత్తం బాధ్యత నోడల్ ఆఫీసర్‌దే అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కుక్కలు కరిచే మూడ్‌లో ఉన్నాయని ముందే ఎవరూ ఊహించలేరు : సుప్రీంకోర్టు
ఏనుగుల బీభత్సం- ఒక్క రాత్రిలో ఆరుగురు మృతి- 6రోజుల్లో 15 మంది మరణం

