ETV Bharat / bharat

ఆలయంలో తొక్కిసలాట- ఏడుగురు మహిళా భక్తులు మృతి- అనేక మందికి గాయాలు

అశోక్ ధామ్ ఆలయం ప్రాంగణంలో తొక్కిసలాట- సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

Bihar Stampede Today
ఘటనాస్థలిలో అంబులెన్స్ (ETV BHARAT)
author img

By ETV Bharat Telugu Team

Published : August 17, 2026 at 8:23 AM IST

3 Min Read
Choose ETV Bharat

Bihar Stampede Today : బిహార్ లఖిసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయం వద్ద తొక్కిసలాట జరగ్గా, ఏడుగురు భక్తులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. శ్రావణ మాసం మూడో సోమవారం (ఉత్తరాది లెక్కల ప్రకారం) కావడంతో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. జలాభిషేకం చేయడానికి సుమారు 50,000 మంది భక్తులు తరలివచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తొక్కిసలాట జరిగింది.

అయితే తొక్కిసలాట అనంతరం భక్తులు ఒక్కసారిగా అరుస్తూ పరిగెత్తారు. ఈ క్రమంలో చాలా మంది భక్తులు ఒకరిపై ఒకరు పడి నలిగిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పరిపాలనా బృందం సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదంలో గాయపడిన వారందరిని వెంటనే స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించారు. అదే సమయంలో మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా మహిళలనే తెలుస్తోంది.

మృతులను మధుబాలా దేవి (బరాహియా), మన్మలా దేవి (బరాహియా), రింకూ దేవి (సఫియా సరాయ్ ముంగేర్), హేమలతా దేవి (ప్రతాప్ హుల్‌సీ)గా గుర్తించారు. గాయపడిన వారిలో మౌసం కుమారి (లక్ష్మీపుర్), ముస్కాన్ కుమారి (విద్యాపీఠ్ చౌక్), మమతా దేవి (చనానియా, లఖిసరాయ్), విమలా దేవి (మొకామా), బభాహూస్నాగామా లఖిసరాయ్), శివాని కుమారి (ఫరీదాబాద్, లఖిసరాయ్), కబిలా దేవి (బిహార్) తదితరులు ఉన్నారు.

తొక్కిసలాట ఎలా జరిగింది?
అశోక్ ధామ్ స్టేషన్ నుంచి ఆలయానికి వెళ్లే రహదారిపై ఉదయం 6:30 గంటలకు ఆ ఘటన జరిగిందని డీఎం శైలేంద్ర కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం భక్తులు జలాభిషేకం కోసం ఆలయానికి చేరుకున్నారని చెప్పారు. "ఆ ప్రాంతంలో ఒక విద్యుత్ స్తంభం వద్ద ఒక వైర్​ తెగిపడిపోయింది. దాని వల్ల షాక్ కొడుతుందనే రూమర్​ను ఎవరో స్ప్రెడ్ చేశారు. దీంతో ఆలయం చుట్టూ భయాందోళనలు చెలరేగాయి. ప్రజలు పరుగులు పెట్టడం ప్రారంభించారు చాలా మంది భక్తులు ఒకరి కింద ఒకరు నలిగిపోయారు. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు కేకలు వేస్తూ, విలపించారు" అని తెలిపారు.

సీఎం స్పందన
అశోక్​ ధామ్​ ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై బిహార్ సీఎం సమ్రాట్ చౌధరీ స్పందించారు. "లఖిసరాయ్‌లోని అశోక్‌ధామ్‌లో జరిగిన సంఘటన అత్యంత విషాదకరం, హృదయ విదారకం. ఆ ప్రమాదంలో భక్తులు మరణించారన్న వార్త విని నా హృదయం దుఃఖంతో నిండిపోయింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి సత్వర చికిత్స అందించేందుకు పరిపాలనా యంత్రాంగానికి అవసరమైన ఆదేశాలు జారీ చేశా. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

2019లో కూడా
2019లో కూడా ఇదే ఆలయంలో తొక్కిసలాట జరిగింది. జలాభిషేకం సమయంలో, పోలీసులు లాఠీలు వాడుతున్నారనే వదంతులు వ్యాపించాయి. ఆ తొక్కిసలాటలో భక్తులు పారిపోవడం ప్రారంభించారు. అప్పుడు ఒక భక్తుడు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఆ సమయంలో, తీవ్రమైన వేడి కారణంగానే మరణాలు సంభవించాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

అశోక్ ధామ్ ఆలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది?:
జిల్లాలో అశోక్ ధామ్‌ను ఇంద్రదామనేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలో విశిష్టమైన శివలింగం, పౌరాణిక చరిత్ర, పురావస్తు ప్రాముఖ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆ శివలింగం నల్ల గ్రానైట్‌తో ఉంటుంది. 1977లో, అశోక్ అనే గొర్రెల కాపరి ఏదో ఆడుతుండగా ఒక శివలింగాన్ని చూశాడు. అప్పటి నుంచి ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆ గొర్రెల కాపరి పేరుతో ఆలయానికి నామకరణం చేశారు. దీనిని ఉత్తర భారతదేశపు డియోఘర్ అని కూడా పిలుస్తారు. డియోఘర్​ నుంచి తిరిగి వచ్చే భక్తులు శ్రావణ మాసంలో శివ భగవానుడికి తమ గౌరవాన్ని అర్పించడానికి ఆ ఆలయాన్ని సందర్శిస్తారు. ఫలితంగా, శ్రావణ మాసంలో ఆ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట- ఒకరు మృతి- అనేక మందికి గాయాలు

బిహార్ గుడిలో తొక్కిసలాట- 8 మంది భక్తులు మృతి