ఖమేనీ మృతిపై మౌనమేలా? - మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియా గాంధీ
రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో అంతర్జాతీయ సమస్యలపై తప్పనిసరిగా చర్చించాలని సోనియా గాంధీ డిమాండ్

Published : March 3, 2026 at 9:29 AM IST
Sonia Gandhi on Khamenei Death : ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీ హత్య వేళ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. ఖమేనీ లక్ష్యంగా చేసిన హత్యపై నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తుందని విమర్శించారు. ఇది తటస్థ వైఖరి కాదని చెప్పిన ఆమె ఇదొక పరాజయమని అన్నారు. భారత విదేశ విధానం దిశ, విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తుతుందని అన్నారు. ఓ పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె ఈ మేరకు స్పందించారు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో అంతర్జాతీయ సమస్యలపై తప్పనిసరిగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలపై ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి కనీస అభ్యంతరం లేకపోతే అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘణ సులభం అవుతుందని ఆమె పేర్కొన్నారు.
"మార్చి 1న ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీని అంతకుముందు రోజు జరిపిన దాడుల్లో హత్య చేసినట్లు అమెరికా- ఇజ్రాయెల్ ధృవీకరించాయి. చర్చలు కొనసాగుతున్న క్రమంలోనే ఒక దేశాధినేతను హత్య చేయడం సమకాలీన అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్ర చీలికను సూచిస్తుంది. అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన భారీ దాడిని విస్మరించి ప్రధాని మోదీ కేవలం UAEపై ఇరాన్ ప్రతీకార దాడిని ఖండించడానికి మాత్రమే పరిమితమయ్యారు. అనంతరం తన తీవ్ర ఆందోళన గురించి మాట్లాడుతూ చర్చలు- దౌత్యంతోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఒక విదేశీ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని హత్య చేసినా మన దేశం నుంచి ఇతర అంతర్జాతీయ చట్టం స్పష్టమైన రక్షణ లభించనప్పుడు మన విదేశాంగ విధానం దిశ, విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతుంది."
--సోనియా గాంధీ, కాంగ్రెస అగ్రనేత
"హత్యకు కేవలం 48 గంటల ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన నుంచి తిరిగి వచ్చారు. అక్కడ ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రభుత్వానికి నిస్సందేహంగా మద్దతు ప్రకటించారు. ఇప్పటికీ గాజా వివాదంలో మహిళలు, పిల్లలు సహా పౌరుల మరణాలపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51లో వివాదాలను శాంతియుత మార్గంలో పరిష్కారానికి భారతదేశ విదేశాంగ విధానం ఆధారపడి ఉండాలని చెబుతోంది. దీని ప్రకారం ఇరాన్ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా వర్గాలకు మేము సంతాపం తెలిపాము. 'సార్వభౌమ సమానత్వం, జోక్యం చేసుకోకపోవడం, శాంతిని ప్రోత్సహించడం' అనే ఈ సూత్రాలు చారిత్రాత్మకంగా భారతదేశ దౌత్య గుర్తింపులో అంతర్భాగంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత నిర్లక్ష్యం కేవలం వ్యూహాత్మకంగానే కాకుండా, మన ప్రకటిత సూత్రాలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 2 (4) ప్రకారం ఏదైనా దేశ ప్రాదేశిక సమగ్రత లేదా రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా బలప్రయోగం లేదా బెదిరింపును నిషేధిస్తుంది. ప్రస్తుతం పనిచేస్తున్న దేశాధినేతను లక్ష్యంగా చేసుకుని చంపడం ఈ సూత్రాల ముఖ్య ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తుంది." అని సోనియా గాంధీ ఆన్నారు.
2001 ఏప్రిల్‌లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ టెహ్రాన్ పర్యటన నుంచి ఇరాన్‌తో భారత్‌కు ఉన్న నాగరిక, సమకాలీన సంబంధాలను ప్రస్తుత ప్రభుత్వం గుర్తుంచుకోవడం మంచిదని సోనియా గాంధీ సూచించారు. అటు ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలు ఇటీవలి కాలంలో రక్షణ, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం అంతటా విస్తరించాయని పేర్కొన్నారు. భారత్‌కు టెహ్రాన్‌తో పాటు టెల్ అవీవ్‌కు దౌత్యపరమైన స్వేచ్ఛ ఉందని, అది విశ్వసనీయతపై ఆధారపడిం ఉంటుందని అన్నారు. "ఇది కేవలం నైతిక ప్రతిపాదన మాత్రమే కాదు. ఒక వ్యూహాత్మక అవసరం. దాదాపు 10 మిలియన్ల మంది భారతీయులు గల్ఫ్ అంతటా ఉన్నారు. గత సంక్షోభాల్లో గల్ఫ్ యుద్ధం నుంచి యెమెన్, ఇరాక్, సిరియా వరకు భారత్ తన పౌరులను రక్షించే సామర్థ్యం స్వతంత్రత ఉందని అది దాని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది." అని సోనియా గాంధీ అన్నారు.

