మూడు కోబ్రాలను ఆస్పత్రికి తీసుకెళ్లిన స్నేక్ క్యాచర్- కరిచిన పామును డాక్టర్లకు చూపించేందుకే అలా!
పాములను పట్టే నిపుణుడిని కరిచిన నాగుపాము - పట్టుకున్న సర్పాలను అడవికి తరలించే క్రమంలో ఘటన - డాక్టర్లకు చూపించేందుకు పాములను ఆస్పత్రికి తీసుకెళ్లిన స్నేక్ క్యాచర్

Published : January 11, 2026 at 9:19 AM IST
Man Went Hospital With Snakes : పెద్దలు చెప్పినట్లు 'పాములు పట్టేవాడు పాము కాటుకే బలవుతాడు' అనే సామెతకు తగినట్లే, ఓ చోట ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ పాములు పట్టే నిపుణుడికి పాము కాటు వేయగా, హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ప్రాణాలతో బయట పడ్డాడు. అయితే, ఆ వ్యక్తి తాను ట్రీట్మెంట్ కోసం వెళ్లిన ఆస్పత్రిలో పెద్ద గందరగోళాన్నే సృష్టించాడు. బిహార్‌కి చెందిన ఈ స్నేక్ క్యాచర్ తాను పట్టుకున్న మూడు నాగు పాములను అడవికి తరలించే క్రమంలో అతణ్ని ఓ పాము కరిచింది. దీంతో తనను ఏ పాము కాటు వేసిందో వైద్యులకు చూపించేందుకు, ఆ మూడు విష సర్పాలను తీసుకుని ఆస్పత్రి ప్రాంగణంలో వదిలాడు. వాటిని చూసిన రోగులు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
పాములకు గాలి తగలాలని
బిహార్‌లోని రోహతాస్ జిల్లా, రాజ్‌పుర్‌కు చెందిన గౌతమ్ కుమార్ అనే వ్యక్తి వృత్తి రీత్యా పాములు పట్టే నిపుణుడు. గత కొద్ది రోజుల క్రితం అతడు మూడు భారీ నాగుపాములను పట్టుకుని తన వద్దే ఉంచుకున్నాడు. శనివారం ఆ పాములను అడవిలో వదిలేయడానికి సిద్ధమైన గౌతమ్, వాటికి కాస్త గాలి తగిలేలా సంచిలో నుంచి బయటకు తీశాడు. ఆ సమయంలోనే అనుకోకుండా ఒక పాము అతనిపై దాడి చేసి కాటు వేసింది.
ఆసుపత్రిలో కలకలం
పాము కాటుకు గురైన గౌతమ్ భయాందోళనతో చికిత్స కోసం సాసారాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పరుగులు తీశాడు. అయితే, అతను కేవలం తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా, తనను కాటు వేసిన పాము ఏ రకానికి చెందిందో డాక్టర్లకు చూపించాలనే ఉద్దేశంతో ఆ మూడు భారీ నాగుపాములను సంచిలో వేసుకుని నేరుగా ట్రామా సెంటర్‌లోకి ప్రవేశించాడు. ఆసుపత్రి లోపలికి వెళ్లిన తర్వాత అతను సంచిని విప్పగా, సుమారు 8 నుంచి 10 అడుగుల పొడవున్న మూడు నాగుపాములు బయటకు వచ్చాయి. ఆ దృశ్యాన్ని చూసిన రోగులు, డాక్టర్లు, ఇతర ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా భయపడి పోయారు. ప్రాణభయంతో అందరూ అటూ ఇటూ పరుగులు తీయడంతో ఆసుపత్రి ప్రాంగణంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
ప్రస్తుతం గౌతమ్ ఆరోగ్య పరిస్థితి
పాము కాటు వేసినప్పటికీ గౌతమ్ ధైర్యంగా ఉన్నాడు. డాక్టర్లు అతనికి తక్షణమే ప్రాథమిక చికిత్స అందించి, విష విరుగుడైన యాంటీ వీనమ్ మందును ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. విష సర్పాలు కరిచినప్పుడు కంగారు పడటం వల్లనే విషం తొందరగా శరీరమంతా వ్యాపిస్తుందని, గౌతమ్ ఎక్కువగా ఆందోళన చెందకపోవడమే మేలు చేసిందని డాక్టర్లు వివరించారు.
ఏ పాము కరిచిందో డాక్టర్లకు తెలియాలని
ఈ విషయంపై స్నేక్ క్యాచర్, బాధితుడు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, "కొన్ని రోజుల క్రితం నేను మూడు పాములను రక్షించాను. వాటిని వదలడానికి అడవికి తీసుకెళ్తున్నాను. ఈ క్రమంలోనే వాటికి గాలి అందించాలని నేను వాటిని వదిలేసిన వెంటనే, అందులో ఓ నాగుపాము నన్ను కాటు వేసింది. నన్ను కరిచింది ఏ సర్పమో డాక్టర్లకు చూపించాలని నేనే వాటిని ఆస్పత్రికి తీసుకెళ్లాను" అని అతడు తెలిపాడు.
పాము ఏ రకమో చెబితే సరిపోతుంది
గౌతమ్‌కు చికిత్స తరలించిన అనంతరం వైద్యులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు ఆసుపత్రికి చేరుకుని ఆ మూడు పాములను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, పాము కాటు వేసినప్పుడు వాటిని కూడా వెంట తీసుకురావడం ప్రమాదకరమని, ఫొటో తీయడం లేదా దాని రకాన్ని వివరిస్తే సరిపోతుందని వైద్యులు సూచించారు.
గతంలోనూ ఇలా పాములతో ఆస్పత్రికి
ఇలాంటి ఘటనే గతంలో భాగల్పుర్ జిల్లాలోనూ జరిగింది. మీరాచాక్ గ్రామానికి చెందిన ప్రకాశ్ మండల్‌కు ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పాముల్లో ఒకటైన రస్సెల్స్ వైపర్ ఎడమ చేతి బొటనవేలుపై బుధవారం కాటు వేసింది. వెంటనే పాము నోటిని గట్టిగా అదిమిపట్టుకున్న ప్రకాశ్, జేఎల్‌ఎన్‌ఎం ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడు. అక్కడ రోగులు, ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. మంచంపై ప్రకాశ్‌ను పడుకోపెట్టినా, అతడు పామును వదల్లేదు. వైద్యులు సలహా మేరకు కొందరు సాహసం చేసి ఆ పామును గోనె సంచిలో బంధించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రకాశ్ మండల్‌కు చికిత్స అందిస్తున్నామని వైద్యుడు ప్రతీక్ తెలిపారు.
జనావాసాల్లోకి 12 అంగుళాల అరుదైన పాము- దాని ప్రత్యేకత ఏమిటంటే?
స్కూటర్లో దాక్కున్న పాము- తెలియకుండానే 5కి.మీ నడిపిన లేడీ టీచర్- చివరకు ఏమైందంటే?

