ETV Bharat / bharat

పాముకాటుతో అన్నాచెల్లెలు మృతి - రక్షాబంధన్​కు ముందురోజు కుటుంబంలో తీవ్ర విషాదం

రక్షాబంధన్​కు ముందురోజు తీవ్ర విషాదం - పాముకాటుకు గురై మృతి చెందిన చిన్నారులు- కడసారిచూపుకు నోచుకోని తల్లి- అన్నాచెల్లెళ్లిద్దరి అంతక్రియల ఊరేగింపు చూసి కంటతడి పెట్టిన గ్రామస్థులు

Snake bite
ప్రతీకాత్మక చిత్రం (ఫైల్) (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : August 27, 2026 at 10:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

Silbings Passed Away : రక్షాబంధన్ పండుగ సమయంలో రాఖీ కట్టించుకుని ఎంతో ఆనందంగా గడపాల్సిన చిన్నారులను మృత్యువు పాము రూపంలో కబళించింది. ఇంట్లో సందడిగా గంతులేయాల్సని పిల్లలు శవమై తేలడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా రోధించింది. అన్నాచెల్లెలు ఒకేసారి మృతిచెందడం ఆ కుటుంబంతో పాటు, ఆ గ్రామస్థులను కంటతడి పెట్టించింది. అన్నాచెల్లెలిద్దరి దహన సంస్కారాలు ఒకే సమయంలో నిర్వహించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన పంజాబ్​లో గురువారం జరిగింది.

పాము కాటుతో అన్నాచెల్లెలు మృతి
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, లుథియానా జిల్లా పరిధి బస్సియన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అయితే, బుధవారం రాత్రి ఇంట్లో ఉక్కపోతగా ఉండడంతో జోబన్‌ప్రీత్‌ (8), జస్​ప్రీత్​ కౌర్​(6) అనే ఇద్దరు చిన్నారులు తమ అమ్మమ్మతో కలిసి ఇంటి ఆవరణలో నిద్రించారు. అయితే, చిన్నారులిద్దరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో జోబన్‌ప్రీత్‌, జస్ప్రీత్​ను పాము కాటువేసింది. తొలుత వారికి ఆ విషయం తెలియలేదు. సరిగ్గా గురువారం తెల్లవారుజామున, కొద్ది సేపటికి తన చేతిని ఏదో కుట్టిందని చెబుతూ జోబన్‌ప్రీత్ ఏడుస్తూ నిద్రలేచాడు. తొలుత అతడికి దోమ కుట్టిందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, ఆ బాలుడి పరిస్థితి విషమించి, అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల చూడగా, మంచం ఉయ్యాల కింద ఓ పాము కనిపించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ
క్షణాల్లోనే జోబన్​ప్రీత్ పరిస్థితి విషమించడంతో అతడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరికొద్దిసేపటికి చిన్నారి కూడా అస్వస్థతకు గురికావడంతో ఆమెను కూడా పాము కుట్టిందని గమనించారు. వెంటనే లుథియానాలోని సీఎమ్‌సీ ఆసుపత్రికి రిఫర్ చేశారు వైద్యులు. అయితే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కొంతసేపటి తర్వాత చికిత్స పొందుతున్న మరో చిన్నారి కూడా మృతి చెందారు. కాగా, జస్‌ప్రీత్ ఒకటో తరగతి, జోబన్‌ప్రీత్ మూడో తరగతి చదువుతున్నట్లు వారి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చిన్నారులిద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబం గుండెలవిసేలా రోదించింది.

కడసారి చూపుకు నోచుకోని తల్లి
ఈ విషాద ఘటనలో అత్యంత హృదయవిదారకమైన విషయం ఏమిటంటే, చిన్నారుల తల్లి సరబ్‌జిత్ కౌర్ ఒమన్‌లో పనిచేస్తున్నారు. అయితే, పిల్లలిద్దరి మరణవార్త తెలిసినప్పటికీ, చివరిసారిగా వారిని చూడలేకపోయారు. ఆమెకు సకాలంలో సెలవు లభించలేదని, పాస్‌పోర్ట్ సమస్య కారణంగా వెంటనే స్వదేశానికి తిరిగి రాలేకపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, పిల్లలకు సకాలంలో తగినంత వైద్య సంరక్షణ అందలేదని గ్రామ నివాసి జగ్తార్ సింగ్ ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, పాము కాటుకు సకాలంలో చికిత్స అందేలా, గ్రామ స్థాయి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, విష నిరోధక మందులను తగినంతగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

ఒకేసారి అన్న చెల్లెళ్ల అంత్యక్రియలు
మరోవైపు, చిన్నారులిద్దరి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. ఇద్దరి అంత్యక్రియల ఊరేగింపులు కలిసి వెళ్తుండగా చూసిన గ్రామస్థులు తీవ్ర దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. పిల్లల మృతితో గ్రామం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని గ్రామ సర్పంచ్ సురీందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబం కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుందని తెలిపారు.

రాఖీలను భద్రంగా దాచుకున్న అమరవీరుడు- 20ఏళ్ల తర్వాత వెలుగులోకి- కన్నీళ్లు పెట్టుకున్న కుటుంబం

ప్రతిభకు వైకల్యం అడ్డు కాదు- పండగ వేళ ఈ పిల్లలు చేసిన రాఖీలు వెరీ స్పెషల్- ధర చాలా తక్కువే!