మౌనమే భారత ప్రతిష్ఠను తగ్గిస్తోంది- ఖమేనీ మృతిపై మోదీ మాట్లాడాలి : రాహుల్ గాంధీ
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్- ఖమేనీ హత్యపై ప్రధాని మోదీ మౌనం వీడాలని వ్యాఖ్య

Published : March 3, 2026 at 3:47 PM IST
Rahul Gandhi On Khamenei : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ హత్యపై కేంద్రం స్పందించాలని అన్నారు. ఈ విషయంలో మోదీ సర్కార్ మౌనం పాటించడం వల్ల ప్రపంచ వేదికపై భారత్‌కు ఉన్న గౌరవం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
'ఈ ఘర్షణపై భారత్ నైతికంగా, స్పష్టంగా వ్యవహరించాలి. అంతర్జాతీయ చట్టాల పరిరక్షణ, మానవ ప్రాణాల రక్షణ కోసం స్పష్టంగా మాట్లాడే ధైర్యం మనకు ఉండాలి. మన విదేశాంగ విధానం సార్వభౌమత్వం, వివాదాలు శాంతియుత పరిష్కారంపై ఆధారపడి ఉంది. ఎప్పటికీ అదే విధంగా కొనసాగాలి. ప్రపంచ వ్యవస్థను నిర్వచించే మార్గంగా ఒక దేశాధినేత హత్యకు ప్రధానమంత్రి మద్దతు ఇస్తారా? ప్రధాని మోదీ ఈ విషయంలో మాట్లాడాలి. ఇప్పుడైనా మౌనం వీడాలి. ఈ మౌనం ప్రపంచంలో భారత ప్రతిష్ఠను తగ్గిస్తోంది' అని రాహుల్ గాంధీ అన్నారు.
Escalating hostilities between the United States, Israel and Iran are pushing a fragile region toward wider conflict. Crores of people, including nearly a crore Indians, face uncertainty.
— Rahul Gandhi (@RahulGandhi) March 3, 2026
While security concerns are real, attacks that violate sovereignty will only worsen the…
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై రాహుల్ ఆందోళన
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఘర్షణలపై రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సున్నితమైన ప్రాంతాన్ని పెద్ద యుద్ధానికి దారి తీసే పరిస్థితి వైపు నెట్టివేస్తున్నాయని అన్నారు. భారతీయులతో సహా కోట్లాది మంది ప్రజలు ఈ అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. భద్రతాపరమైన ఆందోళనలు వాస్తవమే అయినప్పటికీ, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని పేర్కొన్నారు. ఇరాన్, ఇతర పశ్చిమాసియా దేశాలపై చేస్తున్న దాడులను ఖండించాల్సిందే అని చెప్పారు. ఇది మరింత హింసకు దారి తీస్తుందని తెలిపారు. సంభాషణ, సహనం మాత్రమే శాంతికి మార్గమని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోదీ మౌనం వీడాలంటూ సోనియా వ్యాఖ్య
ఖమేనీ లక్ష్యంగా చేసిన హత్యపై నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌనం వహిస్తుందంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా స్పందించారు. మౌనంగా ఉండటం అనేది తటస్థ వైఖరి కాదని, పరాజయమని అన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ చేపట్టిన భారీ దాడిని ప్రధాని మోదీ విస్మరించారని ఆరోపించారు. కేవలం యూఏఈపై ఇరాన్ ప్రతీకార దాడిని ఖండించడానికి మాత్రమే పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రభుత్వానికి నిస్సంపదేహంగా మద్దతు ప్రకటించారని అన్నారు. హత్యకు కేవలం 48 గంటల ముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన నుంచి తిరిగి వచ్చారని తెలిపారు.
నాలుగో రోజు కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ అధికారిక మీడియా భవనం సహా క్షిపణులు, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానికదాడులు చేశాయి. ఇక ఇరాన్లో ఇప్పటి వరకు 787మంది మృతి చెందారు. ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తూనే ఉంది. అమెరికా సైనిక స్థావరాలపై లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇదిలా ఉండగా హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ప్రటించింది.
మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్‌పై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఉద్ధృతం చేసింది. తాజాగా భూతలదాడులు చేపట్టింది. హెజ్బొల్లా కమాండ్ సెంటర్‌తో సహా ఆయుధ నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ వైమానిక స్థావరం దిశగా డ్రోన్లు ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. దాడులు ఆపకుంటే ప్రతీకారచర్యలు తీవ్రంగా ఉంటాయని హెజ్బొల్లా హెచ్చరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 52మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 154 మంది గాయపడ్డారని వెల్లడించింది.

