ETV Bharat / bharat

గృహిణి టు చెస్ ఆర్బిటర్- కొడుకు కోసం చదరంగం నేర్చుకున్న తల్లి

కొడుకు చెస్ మ్యాచ్‌లో ఎదురైన ఘటనతో శుభాంగి జీవితంలో కీలక మలుపు- కుమారిడికి అన్యాయం జరగకూడదని చెస్ నేర్చుకున్న తల్లి- నేడు రాష్ట్ర స్థాయి ఆర్బిటర్‌గా, కుమారుడికి మార్గదర్శిగా మారిన తల్లి

Women Become Chess Arbiter For Son
వల్లభ్‌తో చెస్​ ఆడుతున్న శుభాంగి కులకర్ణి (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : September 2, 2026 at 3:47 PM IST

4 Min Read
Choose ETV Bharat

Women Become Chess Arbiter For Son : సాధారణంగానే తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. వారి ఆసక్తిని గుర్తించి, ఆ రంగంలో ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తారు. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ తల్లి తన కుమారుడి కోసం ఏకంగా చదరంగం నేర్చుకున్నారు. అంతటితో ఆగకుండా చెస్ ఆర్బిటర్‌గా మారారు. కుమారుడికి ఓ మ్యాచ్‌లో ఎదురైన అనుభవమే ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు ఆమె తల్లిగా మాత్రమే కాకుండా, చెస్ ఆర్బిటర్‌గా, కుమారుడికి మార్గదర్శిగా కూడా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

మహారాష్ట్రలోని ఛత్రపతీ సంభాజీనగర్ జిల్లాకు చెందిన శుభాంగి కులకర్ణి తొలుత ఓ సాధారణ గృహిణి. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ, తన కుమారుడు వల్లభ్‌కు మంచి భవిష్యత్తు కోసం కృషి చేసేవారు. వల్లభ్‌కు చిన్న వయసులోనే చెస్‌పై ఆసక్తి ఏర్పడింది. కేవలం మూడేళ్ల వయసులోనే చదరంగం ఆడటం ప్రారంభించాడు. చిన్న వయసులోనే చెస్‌పై పట్టు సాధించిన వల్లభ్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పలు టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. అతడి ఆసక్తిని గమనించిన శుభాంగి కుమారుడిని ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే ఓ చెస్ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది.

Women Become Chess Arbiter For Son
శుభాంగి కులకర్ణి (ETV Bharat)

"మీరు ఆర్బిటరా?"
ఒక రోజు మ్యాచ్​ అయిపోయాక, పోటీలో ప్రత్యర్థి తనపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా ఆడుతున్నాడని వల్లభ్‌ తన తల్లి శుభాంగికి చెప్పాడు. దీంతో తన కుమారుడికి అన్యాయం జరిగిందని భావించిన శుభాంగి, వెంటనే మ్యాచ్ ఆర్బిటర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఆమె చెప్పిన విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన ఆర్బిటర్, "మీరు ఆర్బిటరా? ఆట గురించి మీకు ఏం తెలుసు?" అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆ మాటలు శుభాంగిని బాధించాయి. అయితే నిరుత్సాహపడలేదు. తనకు ఆట గురించి తెలియకపోవడమే సమస్య అయితే చెస్‌ నేర్చుకుంటానని నిర్ణయించుకున్నారు. తన కొడుకు ఇకపై ఎక్కడ ఆడినా, అతడికి న్యాయం జరిగేలా నిబంధనలు తనకు పూర్తిగా తెలియాలని భావించారు.

గృహిణి టు చెస్ విద్యార్థిగా
ఆ ఘటన తర్వాత శుభాంగి చెస్‌ను నేర్చుకోవడం ప్రారంభించారు. ఇంట్లో కుటుంబ బాధ్యతలు చూసుకునే శుభాంగికి చెస్‌ నేర్చుకోవడం అంత సులభం కాలేదు. ఇంటి పనులు, పిల్లల చదువు, కుటుంబ బాధ్యతల మధ్య ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వచ్చింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఇంటి పనులను ముందుగానే పూర్తి చేసుకునేలా రోజువారీ పనులను ప్రణాళిక చేసుకున్నారు. ఇలా రోజూ కొంత సమయాన్ని చెస్‌ నేర్చుకోవడానికి కేటాయించారు. ఆటకు సంబంధించిన ప్రాథమిక అంశాల నుంచి నిబంధనల వరకు క్రమంగా అవగాహన పెంచుకున్నారు. కొన్ని నెలలపాటు శిక్షణ తీసుకుని ఆటలో పట్టు సాధించారు.

Women Become Chess Arbiter For Son
కుమారుడితో చెస్​ ఆడుతున్న శుభాంగి కులకర్ణి (ETV Bharat)

కొద్ది నెలల్లోనే ఆర్బిటర్‌గా
పట్టుదలతో చెస్ నేర్చుకున్న శుభాంగి కొద్ది నెలల్లోనే ఆటపై మంచి అవగాహన సంపాదించారు. ఆ తర్వాత ఆర్బిటర్‌గా శిక్షణ పొందడం ప్రారంభించారు. చెస్‌లో ఆటగాళ్లు పాటించాల్సిన నియమాలు, మ్యాచ్‌లో జరిగే పరిణామాలను ఎలా గమనించాలి, ఆటగాళ్ల ఎత్తుగడలను ఎలా పరిశీలించాలి వంటి అంశాలపై శిక్షణ తీసుకున్నారు. ఆర్బిటర్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయి ఆర్బిటర్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం వివిధ చెస్ టోర్నమెంట్లలో ఆర్బిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు చెస్ గురించి పెద్దగా తెలియని గృహిణి, ఇప్పుడు ఆట నియమాలను పరిశీలించే స్థాయికి ఎదిగారు.

కుమారుడికి తల్లిగా, కోచ్
శుభాంగి ప్రయాణం ఇక్కడితో ఆగలేదు. ప్రస్తుతం ఆరేళ్ల వయసున్న వల్లభ్‌, అత్యంత చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చెస్‌ క్రీడాకారుడిగా నిలిచాడు. తల్లి అతడికి చెస్‌లోని మెళకువలు నేర్పడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. గతంలో మ్యాచ్‌ ఆడేటప్పుడు వల్లభ్‌ భయపడేవాడట. తనకంటే వయసులో పెద్దవాళ్లతో పోటీ పడాల్సి రావడంతో ఒత్తిడికి గురయ్యేవాడు. కొందరు ప్రత్యర్థులు అతడిని ఓడించేందుకు రకరకాల వ్యూహాలు అనుసరించిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఎలా స్పందించాలి? ప్రత్యర్థి ఆటపై దృష్టి పెట్టి తన వ్యూహాన్ని ఎలా అమలు చేయాలి? నిబంధనలకు అనుగుణంగా ఎలా ఆడాలి? వంటి విషయాలను శుభాంగి తన కుమారుడికి నేర్పించారు. దీంతో ఇప్పుడు వల్లభ్‌ వివిధ రకాల చెస్‌ పోటీల్లో ధైర్యంగా ఆడుతున్నాడు. ఇప్పటికే అతడు మూడు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. గతేడాది ఒకేసారి 21 మందితో చెస్‌ మ్యాచ్‌ ఆడి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అయితే తల్లి తన ఆటలో తప్పులు చేస్తే అప్పుడప్పుడు తనపై కోప్పడుతుందని వల్లభ్‌ సరదాగా చెప్పాడు.

Women Become Chess Arbiter For Son
వల్లభ్​ గెలుచుకున్న చెస్​ కప్​లు (ETV Bharat)

'అమ్మ వల్లే ఈ స్థాయికి వచ్చాడు'
వల్లభ్ తండ్రి అమోల్ కులకర్ణి కూడా తన కుమారుడి ఎదుగుదలలో శుభాంగి పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. ఆమె వల్ల వల్లభ్ ఆటలో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన నమ్ముతున్నారని అన్నారు. కుమారుడి చదువును పర్యవేక్షించడంతో పాటు, ప్రతి ఉదయం, మధ్యాహ్నం అతడి చెస్ సాధనకు సమయం కేటాయిస్తున్నారని తెలిపారు. ఆర్బిటర్‌గా శిక్షణ పొందడం వల్ల వల్లభ్‌కు చిన్న వయసులోనే చెస్ నియమాలను కచ్చితంగా నేర్పించడం శుభాంగికి సులభమైందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నిబంధనలకు అనుగుణంగా అతడికి శిక్షణ ఇస్తూ, మరాఠ్వాడా ప్రాంతంలోనే అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ స్థాయి చెస్ క్రీడాకారుడిగా ఎదగడంలో ఆమె సహాయపడుతున్నారని అన్నారు.

దేవుడి ఊరేగింపులో హ్యూమనాయిడ్‌ రోబో- మంత్రాలు పఠిస్తూ, డ్యాన్స్ చేస్తూ సందడి

క్యాన్సర్‌తో మాట పోయినా కళను వదల్లేదు- పెయింటింగ్, కాలిగ్రఫీతో భావాలకు ప్రాణం