ETV Bharat / bharat

ఇంటి మేడపైనే వ్యవసాయం- రైతుగా మారిన ఇంజినీర్- బ్లూబెర్రీ సాగులో దూసుకెళ్తున్న యువ అన్నదాత

బ్లూబెర్రీని సాగు చేస్తున్న హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యువ రైతు- సాగులో సవాళ్లు ఎదురైనా వెనక్కి తగ్గని అన్నదాత- ఇంటి మేడపైనే పంట సాగు

Blueberry Farming in Rooftop
ఇంటి మేడపైనే వ్యవసాయం (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2026 at 10:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

Blueberry Farming in Rooftop : ప్రస్తుత సాంకేతిక యుగంలో చాలా మంది యువత వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపట్లేదు. చిన్నదో, పెద్దదో ఉద్యోగం, లేదంటే వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో శిమ్లాకు చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాత్రం బ్లూబెర్రీ సాగులో దూసుకెళ్తున్నాడు. ఇంటి మేడపైనే వ్యవసాయం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలో యువ రైతు సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం పదండి.

వర్క్ ఫ్రమ్ హోమ్ టైమ్‌లో ఆలోచన
శిమ్లాలోని బదాశ్‌కు చెందిన మనన్ శర్మ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతడు తన ఇంటి పైకప్పును విజయవంతంగా బ్లూబెర్రీ తోటగా మార్చేశాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనన్ తన ఇంటి టెర్రస్‌పై బ్లూబెర్రీ సాగును ప్రారంభించి సఫలీకృతం అయ్యాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Blueberry Farming in Rooftop
ఇంటి మేడపైనే వ్యవసాయం (ETV Bharat)

తండ్రి నుంచి ప్రేరణ పొంది సాగులోకి
మనన్ శర్మ కుటుంబం చాలా కాలం నుంచి సాగు చేస్తోంది. మనన్ తండ్రి పీయూశ్ శర్మ రిటైర్డ్ తహసీల్దార్. ఆయన తన పొలాల్లో స్ట్రాబెర్రీలను పండించేవారు. పీయూశ్ శర్మను చూసి మనన్‌కు కూడా వ్యవసాయం చేయాలనే ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో 'రూఫ్‌టాప్ కల్టివేషన్' (ఇంటి పైకప్పుపై సాగు)ను చేపట్టాడు. "నా ఇంజినీరింగ్ విద్య నాకు డేటా విశ్లేషణ, కచ్చితమైన నిర్వహణ ప్రాముఖ్యాన్ని నేర్పింది. అదే సమయంలో నౌని విశ్వవిద్యాలయం, ది గ్రోయర్స్ ఫ్రూట్ ప్లాంట్ నర్సరీలోని నిపుణుల నుంచి నేను పొందిన సాంకేతిక పరిజ్ఞానం బ్లూబెర్రీల వంటి అరుదైన పంటలను మన సొంత ఇంటి మేడపైనే విజయవంతంగా పండించగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది" అని మనన్ తెలిపాడు.

Blueberry Farming in Rooftop
ఇంటి మేడపైనే వ్యవసాయం (ETV Bharat)

సాధారణంగా యూరప్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా వంటి దేశాల్లో బ్లూబెర్రీలను ఎక్కువగా వాడుతారు. అమెరికా, కెనడాను బ్లూబెర్రీ జన్మస్థలాలుగా భావిస్తారు. బ్లూబెర్రీ మొక్కలు కేవలం చల్లని వాతావరణం ఉండే ప్రాంతాల్లో మాత్రమే బాగా పెరుగుతాయి. తత్ఫలితంగా వీటి సాగు పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. భారత్‌లో హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, సిక్కిం, నీలగిరి కొండలు (తమిళనాడు) వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బ్లూబెర్రీల సాగు జరుగుతోంది. అయితే దేశంలో బ్లూబెర్రీలను చాలా తక్కువ మొత్తంలోనే పండిస్తున్నారు. భారత్‌లో వినియోగించే బ్లూబెర్రీల్లో అత్యధిక భాగం దిగుమతి చేసుకున్నవే. దేశీయ మార్కెట్లో బ్లూబెర్రీల ధర వాటి గ్రేడ్‌ను బట్టి మారుతుంది. ప్రస్తుతం మార్కెట్లో బ్లూబెర్రీ ధర కిలోకు రూ.1,200-రూ.1,500 వరకు ఉంది. అయితే ప్రస్తుతానికి భారతీయ మార్కెట్లో బ్లూబెర్రీలు చాలా అరుదుగా లభిస్తున్నాయి.

వెయ్యి మొక్కలు నాటిన మనన్
తమ ఇంటి మేడపై మిస్టీ, బ్లూ రాబిన్ వంటి రెండు జాతులకు చెందిన వెయ్యి బ్లూబెర్రీ మొక్కలను నాటానని మనన్ శర్మ తెలిపాడు. జాతిని బట్టి ఒక్కో మొక్క ధర రూ.400- రూ.800 పడిందన్నాడు. బ్లూబెర్రీ సాగుకు శిమ్లాలోని వాతావరణ పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉంటాయని వెల్లడించాడు. వేసవి కాలంలో కూడా ఇక్కడ ఉష్ణోగ్రతలు ఇతర ప్రదేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంటాయని పేర్కొన్నాడు. బిందు సేద్యం ద్వారా బ్లూబెర్రీ సాగు చేస్తున్నానని వివరించాడు. "నా మేడపైన ఉన్న బ్లూబెర్రీ మొక్కలు వచ్చే ఏడాది నాటికి పంటను ఇవ్వడం ప్రారంభిస్తాయని ఆశిస్తున్నాం. హిమాచల్‌లోని సంప్రదాయ యాపిల్‌తో పాటు బ్లూబెర్రీలు కూడా వాణిజ్య పంటగా ఎదుగుతున్నాయి. మార్కెట్లో నాణ్యత గల బ్లూబెర్రీలు ధర కిలోకు రూ.2,500-రూ.3,000 వరకు పలుకుతోంది" అని మనన్ తెలిపాడు.

నిపుణులు ఏమంటున్నారంటే?
దేశంలో బ్లూబెర్రీ సాగుకు చల్లని వాతావరణం అత్యంత అనుకూలమైనదని ఉద్యానవన నిపుణులు పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్ వంటి రాష్ట్రాలు బ్లూబెర్రీలను పెంచడానికి అనువైన ప్రాంతాలని వెల్లడించారు. బ్లూబెర్రీ మొక్కలు నీటి కొరతకు గురికాకుండా ఉండేందుకు బిందు సేద్య విధానం వంటి పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు. నేల pH స్థాయి 4.5- 5.5 మధ్య ఉన్న నేలలో బ్లూబెర్రీ సాగు చేయాలని తెలిపారు. మరోవైపు, బ్లూబెర్రీలను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.