ETV Bharat / bharat

'ప్రస్తుత లోక్​సభ స్థానాల సంఖ్యనే మరో 25 ఏళ్లు పాటు కొనసాగించాలి'-డీలిమిటేషన్‌పై మోదీకి ఖర్గే లేఖ

లోక్‌సభ స్థానాల పెంపుపై ప్రధాని మోదీకి ఖర్గే లేఖ- ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను మరో 25 ఏళ్లు యథాతథంగా కొనసాగించాలన్న ఖర్గే

Kharge On Delimitation
ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : August 27, 2026 at 5:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kharge On Delimitation : దేశ రాజకీయాల్లో కీలకమైన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) అంశంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. డీలిమిటేషన్‌కు సంబంధించి ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రతిపాదనలను అన్ని రాజకీయ పార్టీలతో పంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. ప్రస్తుత లోక్​సభలోని సభ్యుల సంఖ్యను 25 ఏళ్ల పాటు యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేశారు.

'లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కాంగ్రెస్‌ వైఖరి స్పష్టంగా ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 543 స్థానాల సంఖ్యను మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలి. అంతేకాకుండా రాష్ట్రాల వారీగా ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యలోనూ మరో 25 ఏళ్లపాటు మార్పులు చేయకూడదు. దీంతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే మహిళలకు మూడో వంతు రిజర్వేషన్‌ అమలు చేయాలి. డీలిమిటేషన్‌తో పాటు మహిళా రిజర్వేషన్‌ అంశం కూడా దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యమున్న అంశం. ప్రభుత్వం వద్ద ఉన్న డీలిమిటేషన్‌ ప్రతిపాదనలను అన్ని పార్టీలతో చర్చించాలి. వాటిని అధ్యయనం చేసేందుకు రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సమయం ఇవ్వాలి' అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.

జులై 16న కూడా ఇదే అంశంపై ప్రధానికి లేఖ రాసినట్లు ఖర్గే గుర్తుచేశారు. డీలిమిటేషన్‌పై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అప్పుడే కోరినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి టీవీ ఇంటర్వ్యూలో ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెప్పడంతో మరోసారి ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. డీలిమిటేషన్‌ వంటి కీలకమైన అంశంపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా విస్తృతంగా చర్చించాలని ఖర్గే కోరారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశమని అన్నారు. ఏప్రిల్‌ 16, 17 తేదీల్లో చేసినట్లుగా మరోసారి ఈ ప్రక్రియను బుల్డోజ్‌ చేయడానికి ప్రయత్నించవద్దని ప్రధాని మోదీని ఉద్దేశించి ఖర్గే వ్యాఖ్యానించారు.

మహిళా రిజర్వేషన్‌పైనా కాంగ్రెస్‌ పట్టుబట్టు
లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ కల్పించాలన్న అంశాన్ని కాంగ్రెస్​ గతంలోనూ ప్రస్తావించింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ డిమాండ్లను పునరుద్ఘాటించాయి. డీలిమిటేషన్​కు సంబంధించిన అంశాలతో ముడిపెట్టి మహిళ రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలన్న ప్రధాని విజ్ఞప్తిని కాంగ్రెస్ గతంలో విమర్శించింది. మహిళ రిజర్వేషన్ పేరుతో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తోందని ఆరోపించింది.

ఏప్రిల్‌లో బిల్లుకు ఎదురుదెబ్బ
2026 బడ్జెట్‌ సమావేశాల్లో డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలింది. ఏప్రిల్‌ 17న జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొన్నారు. వారిలో 298 మంది బిల్లుకు అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలోని ఓట్లలో మూడింట రెండు వంతుల మద్దతు అవసరం. అంటే 352 ఓట్లు రావాల్సి ఉండగా, అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక పార్లమెంట్ వర్షాకాల​ సమావేశాలు నిరవధిక వాయిదా రెండు వారాలపైగా అవుతున్న ఇంతవరకు ప్రొరోగ్​పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మహిళ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి ప్రతిపాదన తీసుకొస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

రూ.22వేల కోట్ల బకాయిలకు రూ.6.5కోట్ల చెల్లింపు- ఇది హెయిర్​ కట్​ కాదు, పూర్తి గుండు: కాంగ్రెస్

భారత అథ్లెట్ల నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందా- 2036 ఒలింపిక్స్​కు సిద్ధమవ్వాలి: మోదీ