అయ్యప్ప భక్తులకు గోల్డెన్ ఛాన్స్- ఇకపై సొంత పాటలను దేవస్థానానికి సమర్పించే అవకాశం
అయ్యప్ప స్వామిపై భక్తి పాటలు రాద్దామనుకుంటున్నారా? ఈ అవకాశం మీ కోసమే!

Published : January 7, 2026 at 11:17 AM IST
Golden Opportunity For Ayyappa Devotees : దేవుడికి సంబంధించిన పాటలు విన్నప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. అయితే ఇలాంటి పాటలు మనం కూడా రాస్తే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంది కదూ. ఇలాంటి ఒక సువర్ణ అవకాశమే అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అందిస్తుంది. భక్తులు తాము సొంతంగా రాసిన లేదా రూపొందించిన పాటలను శబరిమల సన్నిధానంలోని లౌడ్‌స్పీకర్లలో ప్లే చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
భక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు
ప్రఖ్యాత గాయకులు పాడిన పాత పాటలతో పాటు, కొత్తగా స్వరపరిచి, రికార్డ్ చేసిన పాటలు కూడా ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రంలో ప్లే చేసే అవకాశం అందిస్తున్నారు. ప్రస్తుతం, శబరిమలలో ప్లేలిస్ట్‌లో ప్రధానంగా కే.జే.ఏసుదాస్ , జయ-విజయ ద్వయం వంటి దిగ్గజ గాయకుల పాటలు వినిపిస్తున్నాయి. భక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, దేవస్థానం బోర్డు కొత్త పాటలను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ గత సంవత్సరం నుంచి అమలు చేశామని, దీనికి అప్పుడు కూడా విశేష స్పందన లభించిందని దేవస్థానం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్ఓ) జి.ఎస్.అరుణ్ తెలిపారు.

ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఇలా సొంత పాటలను ట్యూన్ చేయలని కోరిక ఉన్న వారికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఈ అప్లికేషన్ పంపడానికి ఎలాంటి గడువు లేదు. ఏడాదిలో ఎప్పుడైనా అప్లై చేసుకునే అవకాశం సన్నిధానం వారు భక్తులకు అందించారు. అయితే మీ పాటను ఈ ప్లే లిస్ట్‌లో చేర్చుకునేందుకు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే?
- పాటను సొంతంగా రాసి, ట్యూన్ చేయాల్సి ఉంటుంది. అలానే ఎవరూ కాపీరైట్ చేయలేదని పేర్కొంటూ అఫిడవిట్‌తో పాటు సంతకం చేసిన పత్రాలను సమర్పించాలి.
- ఈ పాటకు సంబంధించిన (రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు) వారి సంతకాలు, వారు అనుమతించినట్లు ధ్రువీకరించే పత్రాలను కూడా అప్లికేషన్లో చేర్చాల్సి ఉంటుంది.
- పాటలను శబరిమల సన్నిధానంలోని పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ (పీఆర్ఓ)లో పెన్ డ్రైవ్ ద్వారా అందించాలి. ప్లే లిస్ట్‌లో చేర్చడానికి ముందు, పాట నాణ్యత, నిపుణుల కమిటీని తనిఖీ చేస్తుంది.
తరచూ మూడు పాటలు మాత్రమే
శబరిమలలో తరచూ మూడు భక్తి పాటలు మాత్రమే ప్లే చేస్తూ ఉంటారు. తెల్లవారుజామున ఆలయం తెరిచినప్పుడు ఏసుదాస్ పాడిన 'వందే విఘ్నేశ్వరం' గీతం వినిపిస్తుంది. మధ్యాహ్నం 3:00 గంటలకు తలుపులు మళ్లీ తెరిచినప్పుడు, జయ-విజయ ద్వయం పాడిన ప్రసిద్ధ 'శ్రీకోవిల్ నాడ తురన్ను' పాటను ప్లే చేస్తారు. రాత్రిపూట 'హరివరాసనం'తో ఆ రోజు ముగుస్తుంది.
మరి కొత్త పాటలు ఎప్పుడు ప్లే చేస్తారు?
తాజాగా రిజిస్టర్ చేసుకున్న కొత్త పాటలను ప్రకటనల మధ్య విరామ సమయాల్లో ప్రసారం చేస్తారు. అయితే ఈ పాటలు సన్నిధానం నుంచి మరకూటం వరకు భక్తులకు వినిపిస్తాయి. తమ స్వరాన్ని, సాహిత్యాన్ని సంగీత నివాళిగా అయ్యప్ప స్వామికి అర్పించాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి.

హృదయాన్ని హత్తుకునే ప్రదర్శన
కేరళ అగ్నిమాపక, రెస్క్యూ బృందం పాడిన పాటలకు అయ్యప్ప భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఇది పి.పి.రాహుల్, పృథిన్ ఆర్.మోహన్, ధీరజ్ లాల్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా గతేడాది డిసెంబర్ 29న విధులు నిర్వహించేందుకు 83 మంది అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది శబరిమలకు వచ్చారు. వారు ఇక్కడే జనవరి 9 వరకు తమ సేవలను కొనసాగించనున్నారు. ప్రతి సంవత్సరం వలియ నడప్పందల్‌లోని స్వామి అయ్యప్పన్ ఆడిటోరియంలో విధుల్లో ఉన్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ అధికారులు భక్తితో సంగీత కచేరీని నిర్వహించడం ఒక సంప్రదాయంగా మారింది.


భక్తి గీతాలు, శ్లోకాలు వింటున్న గోమాతలు.. డ్యాన్స్ చేస్తూ ఎక్కువ పాలు!
LIVE Streaming: గాన గ్రంథాలయం.. సుస్వర సాగరం.. బాలుకు నీరాజనం

