ETV Bharat / bharat

దిల్లీ స్కూల్స్​, కోర్టులకు బాంబు బెదిరింపులు- అధికారులు హై అలెర్ట్

దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం- అప్రమత్తమైన అధికారులు

Delhi Bomb Threat
Delhi Bomb Threat (PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : November 18, 2025 at 12:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

Delhi Bomb Threat : దిల్లీ పేలుడు ఘటన తర్వాత మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపాయి. కోర్టులు, విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. వాటిలో రెండు సీఆర్​పీఎఫ్​ స్కూల్స్​ ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు.

మంగళవారం ఉదయం 9గంటల సమయంలో బాంబు బెదిరింపుల మెసేజ్​లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తీస్​ హజారీ, సాకేత్​ కోర్టులు లక్ష్యంగా దిల్లీ పోలీసులకు మెయిల్స్ వచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా ద్వారక, ప్రశాంత్ విహార్​లోని రెండు సీఆర్​పీఎఫ్​ పాఠశాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయని అన్నారు. అది కూడా జైషే మహ్మద్​ పేరుతో వచ్చినట్లు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. కోర్టు ప్రాంగణాలతో పాటు సీఆర్​పీఎఫ్​ పాఠశాలనను ఖాళీ చేయించారు. బాంబ్, డాగ్​ స్క్వాడ్​తో తనిఖీలు చేపట్టారు. ద్వారక, సాకేత్​, పటియాలా హౌస్​ రోహిణి కోర్టుల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమనాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిని కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టారు.

నవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత రాజధాని దిల్లీలోనే కాకుండా ఎన్​సీఆర్​ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను పెంచారు. ప్రధాన షాపింగ్ మాల్స్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో తరుచుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పేలుడు జరిగిన వారం రోజుల్లోనే దేశ రాజధానిలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

నవంబర్ 12న దేశవ్యాప్తంగా కొన్ని ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్​ పంపించారు. అందులో దిల్లీ, కోల్‌కతా, తిరువనంతపురం నుంచి నడుస్తున్న పలు ఇండిగో విమానాల్లో బాంబులు అమర్చినట్లు పేర్కొన్నారు. మొత్తం దిల్లీ, ముంబయి సహా ఐదు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్‌ అధికారులు ఆయా విమానాశ్రయాల అధికారులు తనీఖీలు చేపట్టారు.

మొదట కోల్‌కతా నుంచి ముంబయికి వెళ్లనున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. దీంతో అందులోని 186 మంది ప్రయాణికులను కిందకు దించి, విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. ఆ తర్వాత దిల్లీ, తిరువనంతపురం విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు స్క్వాడ్‌ బృందాలతో ఇండిగో విమానాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దిల్లీలో కారు పేలుడు జరిగిన నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో అన్ని విమానాలకు తప్పనిసరి సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్ చేస్తున్నారు. అలాగే ఎయిర్​పోర్టుల వద్ద అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నారు.

ఎర్రకోట బ్లాస్ట్ కేసు: అమీర్​కు 10 రోజులు NIA కస్టడీ- మరో నిందితుడికి హైదరాబాద్​లో లింకు!

ఎర్రకోటకు పెరిగిన సందర్శకుల తాకిడి- బాంబు బెదిరింపులు తమను బయపెట్టలేవని వెల్లడి