ETV Bharat / bharat

పవర్‌ ప్లాంట్‌లో పేలిన బాయిలర్‌- 11మంది మృతి- 22మందికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ పవర్‌ ప్లాంట్‌లో పేలుడు- 11 మంది మృతి- స్పందించిన మోదీ, సీఎం

Chhattisgarh Boiler Blast
Chhattisgarh Boiler Blast (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 14, 2026 at 6:22 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chhattisgarh Boiler Blast : ఛత్తీస్​గఢ్​లో ఘోర ప్రమాదం జరిగింది. వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించి 11మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై పవర్​ ప్లాంట్ కూడా స్పందించింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, సక్తీ జిల్లా సింఘితెరాయ్ గ్రామంలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ ప్లాంట్​లోని బాయిలర్ ట్యూబ్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన కార్మికులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటనాస్థలంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, మిగతావారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిని సమీపంలోని రాయగఢ్ జిల్లా ఆసుపత్రులకు తరలించారు.

పేలుడు తీవ్రత కారణంగా పరిసర ప్రాంతం అధిక ఉష్ణోగ్రతలతో ప్రమాదకరంగా మారింది. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. ప్రమాద స్థలంలో శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని రాయ్‌గఢ్‌ ఎస్‌డీఎం మహేశ్ శర్మ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఎక్స్-గ్రేషియా ప్రకటించిన మోదీ
మరోవైపు, ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం విషాదకరం. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. బాధితులకు స్థానిక యంత్రాంగం సహాయం అందిస్తోంది. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, అలాగే గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్-గ్రేషియా అందజేస్తున్నాం" అని పీఎంఓ ఎక్స్​ పోస్ట్‌లో పేర్కొంది.

సీఎం స్పందన
ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్​ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఘటనా స్థలంలో ఉందని, సహాయక, రెస్క్యూ కార్యకలాపాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య చికిత్స అందించడానికి అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘనటపై విచారణకు ఆదేశించిన సీఎం బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

మరోవైపు ఈ ఘటనపై మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బాధితులకు తగిన పరిహారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు.

స్పందించిన యాజమాన్యం
ఈ ఘటనపై స్పందిస్తూ వేదాంత ప్లాంట్ ప్రతినిధి ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ ఘటనను దురదృష్టకరంగా పేర్కొని, సబ్​ కాంట్రాక్టర్ ఎన్​జీఎస్​ఎల్ నిర్వహిస్తున్న బాయిలర్ యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, స్థానిక అధికారులతో సమన్వయం కొనసాగుతోందని వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

బాధిత కుటుంబాల ఆవేదన
ఘటనలో గాయపడిన కార్మికుడి తండ్రి రాజ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 'మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. నా కుమారుడు నాలుగు నెలలుగా ఇక్కడ పని చేస్తున్నాడు. అతని పరిస్థితి గురించి ఎవరూ సరైన సమాచారం ఇవ్వడం లేదు. ప్లాంట్‌ యాజమాన్యం నుంచి కూడా ఎవరూ రావడం లేదు' అని వాపోయారు.