ETV Bharat / bharat

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం- నలుగురు మృతి- 20మందికిపైగా గాయాలు

బిహార్‌లోని ముజఫర్‌పూర్ ప్రైవేటు ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం- ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు మృతి- షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనా-ఇతర రోగులను వేర్వేరు ఆస్పత్రులకు తరలింపు

Bihar Fire Accident
Bihar Fire Accident (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 4, 2026 at 6:51 AM IST

3 Min Read
Choose ETV Bharat

Bihar Fire Accident : బిహార్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ముజఫర్‌పూర్‌లోని ప్రసాద్ అనే ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగి నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. 20మందికి పైగా గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ప్రసాద్‌ ఆస్పత్రిలోని ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మంటలు చెలరేగిన వెంటనే అవి వేగంగా వ్యాపించాయి. దీంతో ఐసీయూ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది అగ్నిపమాక యంత్రాలతో గంటల తరబడి శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి వచ్చే వరకు ఆస్పత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఉదయం సుమారు మూడు గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారి ఆర్​ఎన్ పాండే తెలిపారు. అప్పటికే ఐసీయూ మొత్తం పొగతో నిండిపోయిందని, సహాయక చర్యల ద్వారా 20 మందికిపైగా రోగులను సురక్షితంగా బయటకు తరలించినట్లు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఎక్స్​గ్రేషియా ప్రకటించిన సీఎం
ఈ ఘటనపై బిహార్ సీఎం సమ్రాట్ చౌధరీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. ఘటనపై స్పందించిన ముజఫర్‌పూర్ జిల్లా కలెక్టర్ సుబ్రత్ కుమార్ సేన్ తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించినట్లు ధ్రువీకరించారు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో ఐసీయూలో సుమారు 13 నుంచి 15 మంది రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.

దర్యాప్తు ప్రారంభం
అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు ఉన్నతస్థాయి విచారణ కమిటీని జిల్లా యంత్రాంగం నియమించింది. కమిటీ నివేదిక అనంతరం ప్రమాదానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా పరిపాలనతో పూర్తిగా సహకరిస్తోందని, ప్రమాదంపై అంతర్గత విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. ఘటన సమయంలో చికిత్స పొందుతున్న కొందరు రోగుల వివరాలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

దిల్లీలో అగ్నిప్రమాదం
బుధవారం దిల్లీలో మాలవీయ నగర్‌లోని ఓ హోటల్​లో భారీ అగ్నిప్రమాదం జరిగి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 35 మంది గాయపడ్డారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 11మంది విదేశీయులు ఉన్నారు.

బుధవారం ఉదయం 8.50 గంటల సమయంలో చెఫ్‌ ఎలక్ట్రిక్‌ స్టవ్‌ వెలిగించిన సందర్భంగా మంటలు చెలరేగి ఒక్కసారిగా హోటల్‌ అంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం నుంచి 58 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. హోటల్‌లో బస చేసిన విదేశీయులంతా సెంట్రల్‌ ఆసియా, ఆఫ్రికా నుంచి స్థానికంగా వైద్య చికిత్స కోసం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. హోటల్‌ భవనం నుంచి బయటకు వెళ్లేందుకు ఒకటే మార్గం ఉండటంతో తప్పించుకునే దారిలేక ఎక్కువ ప్రాణనష్టం సంభవించిందని తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో పాక్ కుట్రలు- సోషల్ మీడియా ద్వారా ఉగ్ర నెట్‌వర్క్ ఏర్పాటుకు యత్నాలు!

విద్యార్థులకు గుడ్​న్యూస్- వాళ్లందరికీ రూ.10 లక్షలు- తొలి కేబినెట్​లో సీఎం సంచలన నిర్ణయాలు!