ETV Bharat / bharat

ఫ్యాక్టరీలో భారీ పేలుడు- 17 మంది మృతి

ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు- 18 మందికి గాయాలు- దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం

Factory Blast In Maharashtra
Factory Blast In Maharashtra (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 9:59 AM IST

3 Min Read
Choose ETV Bharat

Factory Blast In Maharashtra : మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాగ్‌పుర్ జిల్లాలోని పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని కాటోల్ తహసీల్ పరిధిలోని రౌల్‌గావ్ గ్రామంలో ఉన్న ఎస్​బీఎల్​ ఎనర్జీ లిమిటెడ్ పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘటన జరిగింది. ఉదయం 7 నుంచి 7.15 గంటల మధ్య డిటోనేటర్ ప్యాకింగ్ యూనిట్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ఫ్యాక్టరీ భవనం పూర్తిగా ధ్వంసమై శిథిలాలు సుమారు 500 నుంచి 700 మీటర్ల దూరం వరకూ ఎగిరి పడింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పేలుడు తర్వాత అక్కడ భారీ అగ్ని ప్రమాదం కూడా చెలరేగింది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు. అనంతరం మంటలను అదుపులోకి తెచ్చి సహాయక చర్యలను వేగవంతం చేశారు.

మృతుల్లో ఎక్కువ మంది మహిళలే
పోలీసుల ప్రకారం, ఘటనాస్థలంలో పనిచేస్తున్న కార్మికుల్లో 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళా కార్మికులే ఉన్నట్లు తెలుస్తోంది. మరో 18 మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని తక్షణమే నాగ్‌పుర్ నగరంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ హర్ష్ పొద్దార్ సహా ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

సహాయక చర్యలకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టాయి. అదేవిధంగా పేలుడు పదార్థాల భద్రతను పర్యవేక్షించే సంబంధిత విభాగాల బృందాలు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఆ ఫ్యాక్టరీలో గనుల పరిశ్రమలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం అవసరమైన పారిశ్రామిక పేలుళ్లు, డిటోనేటర్లు, అనుబంధ ఉత్పత్తులు తయారు చేస్తారు. డిటోనేటర్ ప్యాకింగ్ యూనిట్‌లో ఏదైనా సాంకేతిక లోపం లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు అనంతరం స్పష్టమవుతుందని తెలిపారు.

మొత్తం సీల్​
రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించింది. అలాగే ప్రమాదానికి గల కారణాలపై సవివర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఘటన అనంతరం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేశారు. అనుమతి లేకుండా ఎవ్వరినీ అక్కడికి వెళ్లనివ్వడం లేదు.

అయితే ఘటనపై సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. పేలుడు సంఘటన చాలా దురదృష్టకరమని తెలిపారు. "నేను స్థానిక పరిపాలనతో నిరంతరం సంప్రదిస్తున్నాను. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఘటనా స్థలంలో ఉన్నాయి. 'PESO', 'DISH' బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటివరకు 17 మంది మరణించారు. 18 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే నాగ్‌పూర్‌కు తరలించారు. వారు త్వరగా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం" అని తెలిపారు.

చిన్నపాటి నిర్లక్ష్యమే నిప్పురవ్వై - శ్మశానంలా మారిన సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌ ప్రాంగణం

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - 21కి చేరిన మృతుల సంఖ్య