బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు- 11 మంది మృతి
యూపీలో బాణసంచా కర్మాగారంలో సంభవించిన పేలుడు- ప్రమాదంలో 11మంది మృతి, పలువురికి గాయాలు- పేలుడు తీవ్రతకు కుప్పకూలిన చుట్టుపక్కల ఇళ్లు

Published : August 31, 2026 at 7:19 PM IST
Firecracker Blast In UP : ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ పేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీతో పాటు చుట్టుపక్కల ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి.
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, కౌశాంబీ జిల్లా పిప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మనోరి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. మనోరి పవర్ హౌస్ సమీపంలో ఉన్న బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతినడంతో పాటు పక్కనే ఉన్న ఐదు నుంచి ఆరు ఇళ్లు కూడా కూలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి పలువురికి గాయాలయ్యాయి. తొలుత గాయపడిన 11 మందిని మెరుగైన చికిత్స కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వారంతా మృతి చెందినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో పలువురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా ఫ్యాక్టరీకి సమీపంలోని ప్రాంతాల్లో నివసిస్తున్నవారేనని అధికారులు తెలిపారు. ఘటనలో 18 మందికి పైగా గాయపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
శిథిలాల కింద మరికొందరా?
పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కూలిపోవడంతో పెద్ద మొత్తంలో శిథిలాలు పేరుకుపోయాయి. వాటి కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ గాలింపు కొనసాగిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పదికి పైగా ఫైర్ ఇంజిన్లు, దాదాపు 24 అంబులెన్స్‌లు ఘటనాస్థలిలో మోహరించారు. వైమానిక దళానికి చెందిన 50 మందికి పైగా సిబ్బంది కూడా సహాయక చర్యల్లో భాగమయ్యారు. తొలుత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం శిథిలాల తొలగింపు, గాలింపు చర్యలను వేగవంతం చేశారు. విద్యుత్ స్తంభాలు, వైర్లకు నష్టం వాటిల్లడంతో విద్యుత్ శాఖ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో మణోరి వైమానిక స్థావరం ఉంది.
రైళ్ల రాకపోకలకు అంతరాయం
పేలుడు తీవ్రతతో సమీపంలోని విద్యుత్ స్తంభాలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. మరోవైపు ఘటనాస్థలానికి సమీపంగా ఢిల్లీ-హౌరా రైల్వే మార్గం ఉండటంతో ముందుజాగ్రత్త చర్యగా రైళ్ల రాకపోకలను సుమారు గంటపాటు నిలిపివేశారు. ఘటనాస్థలానికి సమీపంలోకి చేరుకున్న అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్‌ను మణోరి రైల్వే స్టేషన్ వైపు వెనక్కి పంపించారు. దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సయ్యద్ సరావన్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. అనంతరం పరిస్థితిని సమీక్షించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు
ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

