'గ్రీన్ గోల్డ్'తో స్వయం ఉపాధి- రూ.120తో రూ.50వేల ఆదాయం- ఈ పనిని నేర్చుకుంటే జీవితం మారిపోతుంది!
గ్రీన్ గోల్డ్‌తో ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్న మేఘళి దాస్- వెదురు ఆభరణాల తయారీలో మహిళలకు ఉచిత శిక్షణ- గువహటిలో బాంబూ ఫ్యాషన్ షోరూం ప్రారంభం

Published : February 25, 2026 at 1:16 PM IST
Meghali Das Bamboo Ornaments : 'గ్రీన్ గోల్డ్' ఎంతోమందికి స్వయం ఉపాధి మార్గాన్ని చూపిస్తోంది. ఆదాయాల పంటను పండిస్తోంది. రూ.120 నుంచి రూ.200 విలువ చేసే గ్రీన్ గోల్డ్‌ను కొని, దానితో ఆభరణాలను తయారు చేస్తే రూ.50వేల దాకా సంపాదించొచ్చు అని వ్యాపారవేత్త మేఘళి దాస్ అంటున్నారు. ఇంతకీ ఏమిటీ గ్రీన్ గోల్డ్? దీనితో ఆభరణాలను ఎలా తయారు చేయాలి? ఎక్కడ విక్రయించాలి? గ్రీన్ గోల్డ్ ఆభరణాల తయారీ వ్యాపారంలో మేఘళి దాస్ ఎలా రాణిస్తున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.
గ్రీన్ గోల్డ్‌తో ఆభరణాల తయారీ
వెదురుకు విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. దానికి ఎంతో ఆర్థిక ప్రాముఖ్యం ఉంది. అందుకే దాన్ని గ్రీన్ గోల్డ్ (ఆకుపచ్చ బంగారం) అని పిలుస్తారు. ఫర్నీచర్, గృహ నిర్మాణం, కాగితం, వస్త్రాలు, హస్తకళల తయారీలో వెదురు పాత్ర కీలకం. ఇటీవలె మార్కెట్‌లోకి వెదురు కిటికీ కర్టెన్లు, ఫ్లోర్‌మ్యాట్‌లు, కార్పెట్‌లు, బట్టలు, ఆభరణాలు కూడా వచ్చాయి. ఈనేపథ్యంలో అసోం రాష్ట్రం గువాహటి నగరంలోని రుక్మిణి నగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త, ఔత్సాహిక వ్యాపారవేత్త మేఘళి దాస్ ఐదేళ్ల క్రితం వెదురుతో ఆభరణాల తయారీని మొదలుపెట్టారు. తొలుత ఈ ఆభరణాల తయారీలో మహిళలకు ఆమె ఉచిత శిక్షణ ఇచ్చారు. వెదురు, పూసలతో ఆకర్షణీయమైన ఆభరణాలను తయారు చేసే టెక్నిక్‌లను నేర్పించారు. వెదురు వేర్ల నుంచి కాండం వరకు ప్రతి భాగాన్ని ఎలా ఉపయోగించాలో వివరించారు. ఈ పనుల కోసం ఏయే పరికరాలను ఉపయోగించాలి అనే దానిపైనా అవగాహన కల్పించారు.

మహిళల జీవితాల్లో స్వయం ఉపాధి వెలుగులు
రుక్మిణి నగర్‌లోని ఈ ట్రైనింగ్ అందించే కేంద్రానికి వెదురు ఆభరణాల శిక్షణ, పరిశోధన కేంద్రం అనే పేరును మేఘళి దాస్ పెట్టారు. దీని శిక్షణా కార్యక్రమాలు ఇప్పుడు అసోం రాష్ట్రమంతటా వ్యాపించాయి. చాలా మారుమూల పల్లెల మహిళలు రుక్మిణి నగర్‌కు వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్తున్నారు. ట్రైనింగ్ పూర్తయ్యాక వెదురు ఆభరణాల తయారీకి అవసరమయ్యే మెటీరియల్‌ను, పరికరాలను ఆయా మహిళలకు మేఘళి దాస్ అందిస్తున్నారు. ఈ మహిళలు తమతమ ఇళ్లలోనే వెదురు ఆభరణాలను తయారు చేసి తీసుకొచ్చి రుక్మిణి నగర్‌లోని శిక్షణా కేంద్రానికి అందిస్తున్నారు. ఈ ఆభరణాల మార్కెటింగ్ బాధ్యతను స్వయంగా మేఘళి దాస్ పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే అసోంలోని వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా వెదురు ఆభరణాల తయారీలో ట్రైనింగ్‌ను ఇవ్వడం విశేషం. ఈవిధంగా ఎంతోమంది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను మేఘళి దాస్ సృష్టించారు.

తొలి షోరూం 'బాంబూ ఫ్యాషన్'
మేఘళి దాస్ తాను తయారు చేయిస్తున్న వెదురు ఆభరణాలతో ప్రత్యేక షోరూంను ఫిబ్రవరి 23న (సోమవారం) గువహటి నగరంలో ప్రారంభించారు. దీనికి బాంబూ ఫ్యాషన్ అని పేరు పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో వెదురు ఆభరణాల షోరూం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. ఇందులో వెదురు ఆభరణాలను కొనొచ్చు. తమకు నచ్చిన డిజైన్ల ప్రకారం వెదురు ఆభరణాలను తయారు చేసి ఇవ్వమని ముందస్తు ఆర్డర్లు ఇవ్వొచ్చు. మహిళలు తాము తయారుచేసిన వెదురు ఆభరణాలను ఈ షోరూం వేదికగా విక్రయించొచ్చు. వెదురు ఆభరణాల తయారీని ఉచితంగా నేర్చుకోవాలని అని భావించే వారు రుక్మిణి నగర్‌లోని వెదురు ఆభరణాల శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని సంప్రదించొచ్చు.

కేవలం రూ.120తో రూ.50వేల ఆదాయం
'ఈ ఆభరణాలను వెదురుతో పాటు స్థానికంగా లభించే వివిధ రకాల పూసలతో తయారు చేస్తారు. ఆభరణం డిజైన్ ప్రకారం వెదురును కత్తిరించి ఉపయోగిస్తారు. ఈ ఆభరణాల తయారీ ప్రక్రియలో ఎటువంటి రసాయనాలనూ ఉపయోగించం. భవిష్యత్తులో అవసరమైతే గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్లి అక్కడి మహిళలకు వెదురు ఆభరణాల తయారీలో ట్రైనింగ్ ఇస్తాం. కరోనా లాక్‌డౌన్ కాలం వరకు మేం వెదురు నారతోనూ ఆభరణాలను తయారుచేసే వాళ్లం. కానీ ఆ తర్వాత వివిధ కారణాలతో వెదురు నారతో జువెల్లరీ తయారీని ఆపాల్సి వచ్చింది. రూ.120 నుంచి రూ.200 విలువ చేసే వెదురు ముక్కతో చక్కటి డిజైన్ కలిగిన ఆభరణాలను తయారు చేస్తే రూ. 50,000 కంటే ఎక్కువే సంపాదించొచ్చు' అని బాంబూ ఫ్యాషన్ షోరూం వ్యవస్థాపకురాలు మేఘళి దాస్ ఈటీవీ భారత్‌కు వివరించారు.


ఆభరణాల ధర రూ. 50 నుంచి రూ. 5,000 దాకా
'ఈశాన్య రాష్ట్రాల్లో వెదురుకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. వెదురును, వెదురు ఉత్పత్తులను పండుగలు, శుభకార్యాల వంటి సందర్భాల్లో ఉపయోగిస్తుంటారు. బంగారం, వెండి ఆభరణాల తయారీకి పెద్ద మొత్తంలో పరికరాలు కావాలి. కానీ బాంబూ జువెల్లరీ తయారీకి పెద్దగా పరికరాలు అవసరం లేదు. ఈ పనిని నేర్చుకుంటే, ఇంట్లో కూర్చొని హాయిగా ఆభరణాలను తయారు చేయొచ్చు. ఈ ఆభరణాల ధర రూ. 50 నుంచి రూ. 5,000 దాకా ఉంటుంది. డిజైన్, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఆభరణం ధరను నిర్ణయిస్తాం' అని మేఘళి దాస్ తెలిపారు.


