ఆధార్‌ను కేవలం గుర్తింపు కార్డుగానే ఉపయోగించాలా? కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
ఆధార్‌ను కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగించాలి- పౌరసత్వ రుజువుగా వాడకూడదంటూ పిటిషన్- దీనిపై సుప్రీంకోర్టు ఏమందంటే?

Published : June 16, 2026 at 3:28 PM IST
SC On Aadhaar Usage : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ జారీ చేసే ఆధార్ కార్డులను పౌరసత్వం, స్థానికత, నివాస చిరునామా రుజువులుగా ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మంగళవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందనను కోరింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహన్లతో కూడిన ధర్మాసనం, అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ పిటిషన్‌ను ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఇలాంటి ఇతర కేసులతో జత చేసింది.
ఇంతకీ ఈ పిటిషన్లో ఏముంది?
ఆధార్‌ను కేవలం గుర్తింపు కార్డుగా ఉపయోగించేలా పరిమితం చేయాలని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ కోరారు. దీనిని పౌరసత్వం, స్థానికత, చిరునామా, పుట్టిన తేదీకి రుజువుగా వాడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘానికి కూడా తగిన ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు. న్యాయవాది అశ్వినీ దూబే ద్వారా ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు.
కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు ఫారమ్‌లో పుట్టిన తేదీ, నివాస రుజువుగా ఆధార్‌ను ఉపయోగించడానికి పిటిషనర్ సవాల్ చేశారు. ఇది ఆధార్ చట్టం, 2016లోని సెక్షన్ 9, ప్రజాప్రాతినిధ్య చట్టం (ఆర్పీఏ)- 1950లోని సెక్షన్ 23(4), రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని పేర్కొన్నారు.
అక్రమ చొరబాటుదారులకు వరంగా మారింది!
"ఆధార్ చట్టం, 2016లోని సెక్షన్ 9 చాలా స్పష్టంగా ఆధార్ అనేది పౌరసత్వం లేదా స్థానికతకు రుజువు కాదు అని చెబుతోంది. అలాగే 2023 ఆగస్టు 22 నాటి యూఐడీఏఐ నోటిఫికేషన్ కూడా ఆధార్ అనేది గుర్తింపునకు మాత్రమే రుజువు, పౌరసత్వం, చిరునామా, పుట్టిన తేదీకి కాదు అని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ పాఠశాల ప్రవేశాలు, ఆస్తి కొనుగోళ్లు, జనన ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సుల కోసం వయస్సు, పౌరసత్వం, స్థానికత రుజువుగా ఆధార్‌ను ఉపయోగిస్తున్నారు. అంతేకాదు కొత్త ఓటరు నమోదు దరఖాస్తు ఫారమ్ (ఫారమ్-6)లో పుట్టిన తేదీ, నివాస రుజువుగా కూడా వాడుతున్నారు. దీని వల్ల చొరబాటుదారులు, అక్రమ వలసదారులు ఆధార్‌ను ఉపయోగించి వివిధ రకాల అధికార పత్రాలు పొందుతున్నారు" అని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఫారమ్-6 కింద చేస్తున్న వెరిఫికేషన్ విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని, సరైన పత్రాలు లేని వ్యక్తులు కూడా ఓటర్ల డేటాబేస్‌లో చేరిపోయే ప్రమాదం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. అందుకే ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే వెరిఫికేషన్ విధానాన్ని సమూలంగా పునర్వ్యవస్థీకరించాలని ఆయన కోరారు. ఈ సంస్కరణలను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో పాటు, సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన హై-పవర్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
విదేశీయులు కూడా ఆధార్ పొందవచ్చు!
ఆధార్ చట్టం ప్రకారం, విదేశీ పౌరులతో సహా దేశంలోని నివాసితులు అందరూ ఆధార్ కార్డు పొందే హక్కు ఉందని పిటిషనర్ అన్నారు. ఓ వ్యక్తి ఒక ఏడాదిలో 182 రోజులు భారతదేశంలో నివసిస్తే, ఆధార్ కార్డు పొందడానికి అర్హత వచ్చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అద్దె ఒప్పందాలు, స్థానిక అధికారుల సిఫారసులు వంటి పత్రాల ఆధారంగా ఎన్రోల్మెంట్ కేంద్రాల నుంచి ఆధార్ పొందవచ్చని తెలిపారు. అందుకే ఈ లూప్ హోల్స్‌ను ఆసరాగా చేసుకొని అక్రమ వలసదారులు, చొరబాటుదారులు ఆధార్‌ను సంపాదిస్తున్నారని, ఆ తర్వాత దానిని ఉపయోగించి ఓటరు గుర్తింపు కార్డుతో సహా ఇతర గుర్తింపు పత్రాలను కూడా సులభంగా పొందగలుగుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు.
కనుక ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23(4) ప్రకారం, ఆధార్‌ను కేవలం గుర్తింపును నిరూపించుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని, వయస్సు, నివాసానికి రుజువుగా వాడకూడదని పిటిషనర్ పేర్కొన్నారు. ఆధార్ ఉపయోగించి దేశంలోకి చొరబడుతున్న అక్రమ వలసదారుల వల్ల ఎన్నికల్లో పారదర్శకత లేకుండా పోతోందని అన్నారు. జనాభా మార్పులు (డెమోగ్రాఫిక్ ఛేంజ్) వస్తున్నాయని, దేశ భద్రతకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.
మమత వర్గంతో చర్చించాకే- టీఎంసీ రెబల్ ఎంపీల విలీనంపై స్పీకర్ నిర్ణయం!

